India-WestIndies
-
యువీ అవుట్.. దినేశ్ ఇన్
♦ అశ్విన్, భువీకి విశ్రాంతి. ♦ షమీ, జడేజాలకు అవకాశం నార్త్ సౌండ్: భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేకు భారత జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గత మ్యాచ్ విజయానంతరం మిగతా ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామన్న కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యలను నిజం చేస్తూ జట్టులో మార్పులు చేశారు. గత కొద్దీ రోజులుగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్ ఆటగాడు యువరాజ్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా చేతి వ్రేలి గాయంతో బాధపడుతున్న యువీని బెంచీకే పరిమితం చేశారు. ఇక యువీ స్థానంలో దినేష్ కార్తీక్ రాగా అశ్విన్ స్థానంలో జడేజాకు అవకాశం కల్పించారు. ఇక 2015 వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ వన్డేలకు దూరమైన మహ్మాద్ షమీకి ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించింది. పేస్ బౌలర్ భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇచ్చి షమీకి స్థానం కల్పించారు. అయితే షమీ గత చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక యువకెరటం రిషబ్ పంత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. యువీ స్థానంలో పంత్‌ను ఎంపిక చేస్తారని అందరూ భావించినా కోహ్లీ కార్తీక్‌వైపే మొగ్గు చూపాడు. -
విండీస్‌ను తిప్పేశారు..
♦ స్పిన్నర్లు దాటికి కుప్పకూలిన కరేబీయన్లు ♦ 93 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం ఆంటిగ్వా: భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్‌ల దాటికి కరేబీయన్లు తోకముడిచారు. కనీసం పోరాట పటిమకనబర్చకుండా చాప చుట్టేశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. ఇక విండీస్ ఆటగాళ్లలో మొహమ్మద్ (40), పావెల్(30), షాయ్ హోప్(23), హోప్(19) లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేదు. భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మరోసారి రెచ్చిపోగా, స్పిన్ దిగ్గజం అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా పేసర్ ఉమేశ్ యాదవ్, పార్ట్‌టైమ్ బౌలర్ జాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), అజింక్యా రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్(40), యువరాజ్(39)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2 నెగ్గి ఆధిక్యంలో ఉండగా ఒక మ్యాచ్ డ్రా అయింది. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
వారెవ్వా.. ధోని!
♦ విండీస్ లక్ష్యం 252 ♦ రాణించిన రహానే, జాదవ్ ఆంటిగ్వా: నిలకడలేమి ఫామ్‌తో సతమతవవుతున్న భారత మాజీ కెప్టెన్ ధోని మెరిశాడు. మిమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చి జట్టుకు తన అవసరమెంటో మరోసారి గుర్తు చేశాడు. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో క్లిష్ట పరిస్థితిలో అర్ధ సెంచరీ బాది జట్టుకు గౌరవ ప్రదమమై స్కోరు అందించాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే కూడా రాణించడంతో భారత్ విండీస్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బౌలింగ్ పిచ్ కావడంతో బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్(2), కెప్టెన్ కోహ్లీ(11) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్‌తో మరో ఓపెనర్ రహానే ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జట్టు స్కోరు 100 వద్ద స్పిన్నర్ దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ (39: 55 బంతుల్లో 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరకడంతో 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానే, ధోనితో కలిసి తన ఫామ్‌ను కొనసాగిస్తూ 89 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 170 వద్ద రహానే (71; 112 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్)ను కమిన్స్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక చివర్లో ధోని (78; 79 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు), కేదార్ జాదవ్( (40; 26 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) దాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఇక విండీస్ బౌలర్లలో కమిన్స్(2) వికెట్లు తీయగా హోల్డర్,బిషూలకు తలా ఓ వికెట్ దక్కింది. -
'విశాఖ వన్డేను రద్దు చేయాలి'
భారత్, వెస్టిండీస్‌ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న విశాఖపట్నంలో భారత్, విండీస్ మ్యాచ్ జరగాల్సివుంది. కోట్లాది ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తీర్మానించినట్టు కన్వీనర్ ముప్పాల సుబ్బారావు చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కోట్లాదిమంది సమైక్యవాదులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఈ సమయంలో విశాఖలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం సరికాదని సుబ్బారావు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల జేఏసీ పోరాటం కొనసాగిస్తోంది. ఈ నెల 23 వరకు విధుల్ని బహష్కరించారు.