
యువీ అవుట్.. దినేశ్ ఇన్
♦ అశ్విన్, భువీకి విశ్రాంతి.
♦ షమీ, జడేజాలకు అవకాశం
నార్త్ సౌండ్: భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేకు భారత జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గత మ్యాచ్ విజయానంతరం మిగతా ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామన్న కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యలను నిజం చేస్తూ జట్టులో మార్పులు చేశారు. గత కొద్దీ రోజులుగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్ ఆటగాడు యువరాజ్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా చేతి వ్రేలి గాయంతో బాధపడుతున్న యువీని బెంచీకే పరిమితం చేశారు.
ఇక యువీ స్థానంలో దినేష్ కార్తీక్ రాగా అశ్విన్ స్థానంలో జడేజాకు అవకాశం కల్పించారు. ఇక 2015 వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ వన్డేలకు దూరమైన మహ్మాద్ షమీకి ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించింది. పేస్ బౌలర్ భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇచ్చి షమీకి స్థానం కల్పించారు. అయితే షమీ గత చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక యువకెరటం రిషబ్ పంత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. యువీ స్థానంలో పంత్‌ను ఎంపిక చేస్తారని అందరూ భావించినా కోహ్లీ కార్తీక్‌వైపే మొగ్గు చూపాడు.