ఎప్ప‌టినుంచో క‌ల‌లు కంటున్నా.. గర్వంగా ఉంది అభిషేక్‌: యువీ | Abhishek Sharma on Yuvraj Singhs tweet after 135 | Sakshi
Sakshi News home page

ఎప్ప‌టినుంచో క‌ల‌లు కంటున్నా.. గర్వంగా ఉంది అభిషేక్‌: యువీ

Published Mon, Feb 3 2025 11:22 AM | Last Updated on Mon, Feb 3 2025 11:47 AM

Abhishek Sharma on Yuvraj Singhs tweet after 135

ముంబై వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టీమిండియా 150 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భార‌త యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ(Abhishek Sharma) ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో అద్బుత‌మైన సెంచ‌రీతో చెలరేగిన అభిషేక్‌.. అనంత‌రం బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో స‌త్తాచాటాడు.

అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. వాంఖడే స్టేడియంలో సిక్స‌ర్ల వ‌ర్షం కుర్పించాడు. అత‌డి ఆప‌డం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల త‌రం కాలేదు. ఈ క్ర‌మంలో కేవ‌లం 37 బంతుల్లోనే త‌న రెండో టీ20 సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. భార‌త త‌ర‌పున టీ20ల్లో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా అభి నిలిచాడు. 

ఓవ‌రాల్‌గా 54 బంతులు ఎదుర్కొన్న శ‌ర్మ‌..  7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేశాడు. త‌ద్వారా టీ20ల్లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై తన మెంటార్‌, భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసల వర్షం కుర్పించాడు. "బాగా ఆడావు అభిషేక్ శర్మ! నిన్ను ఈ స్ధాయిలో చూడాల‌ని ఎప్ప‌టినుంచో క‌ల‌లు కంటున్నాను! ఈ రోజు నాకు చాలా గ‌ర్వంగా ఉందంటూ" యువీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

యువీ మెంటార్‌గా..
కాగా అభిషేక్‌ శర్మ కెరీర్‌ ఎదుగుదలలో యువరాజ్‌ది కీలక పాత్ర. అతడి గైడెన్స్‌లోనే అభిషేక్‌ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్‌కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. కొవిడ్‌-19 సమయంలో యువరాజ్.. అభిషేక్‌తో ఇతర పంజాబ్ యువ క్రికెటర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అన్మోల్‌ప్రీత్ సింగ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి యువీతో అభిషేక్ నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు. 

అభిషేక్‌ తన నెట్‌ ప్రాక్టీస్‌ వీడియోలను ఎప్పటికప్పుడు యువీకి షేర్‌ చేస్తూ ఉంటాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఏదైనా సమస్య ఉంటే గుర్తించి యువరాజ్‌ వెంటనే సరిదిద్దుకునేలా సలహాలు ఇస్తాడు. ఈ విష‌యాన్ని అభిషేక్‌ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు.

అయితే, బాగా ఆడినప్పుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే యువీ విమర్శస్తుంటాడు. కాగా 'ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్' అభిషేక్ శ‌ర్మ త‌న మెరుపు సెంచ‌రీపై మ్యాచ్ అనంత‌రం స్పందించాడు. తన ఇన్నింగ్స్‌తో మెంటార్ యువరాజ్ సింగ్ సంతోషించంటాడని అభి చెప్పుకొచ్చాడు.

వారిద్దిరి కోరిక ఇదే: అభిషేక్‌
"ఈ సెంచ‌రీ నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దేశం కోసం ఈ త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుంది. నాదైనా రోజున‌  తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. మా కోచ్‌, కెప్టెన్ నాకు తొలి రోజు నుంచే ఎంతో స‌పోర్ట్‌గా ఉన్నారు. వారు ఎప్పుడూ నా నుంచి ఇటువంటి ప్ర‌ద‌ర్శనే ఆశిస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్లు 140-150కి.మీ కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ఆడేందుకు వాళ్ల కన్నా ఒక్క సెకెన్‌  ముందే సిద్ధంగా ఉండాలి. 

బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్లు ఆడాను. వరల్డ్‌క్లాస్ బౌలర్ అర్చర్ బౌలింగ్‌లో కవర్స్ మీదగా కొట్టిన షాట్ నాకెంతో ప్రత్యేకం. అలాగే రషీద్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టడం కూడా బాగుంది. రషీద్ బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్.. యువీ పాజీ నుంచి నేర్చుకున్నాను.

కాబట్టి యువీ ఈ రోజు సంతోషంగా  ఉంటాడనుకుంటున్నా. అతను ఎప్పుడూ నేను 15 నుంచి 20 ఓవర్ల వరకు బ్యాటింగ్‌ చేయాలని కోరుకునేవాడు. ఈ రోజు యువీ పాజీ కోరిక నేరవేర్చాను. గౌతీ భాయ్‌ కూడా ఇదే కోరుకునేవాడు. ఈ మ్యాచ్‌లో దానిని అమలు చేసి చూపించా అని పోస్ట్‌ మ్యాచ్‌​ ప్రేజెంటేషన్‌లో అభిషేక్‌ పేర్కొన్నాడు.
చదవండి: వరల్డ్‌ రికార్డు.. వికెట్‌ కోల్పోకుండానే 376 కొట్టేశారు

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement