విండీస్‌ను తిప్పేశారు..
♦ స్పిన్నర్లు దాటికి కుప్పకూలిన కరేబీయన్లు
♦ 93 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
ఆంటిగ్వా: భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్‌ల దాటికి కరేబీయన్లు తోకముడిచారు. కనీసం పోరాట పటిమకనబర్చకుండా చాప చుట్టేశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. ఇక విండీస్ ఆటగాళ్లలో మొహమ్మద్ (40), పావెల్(30), షాయ్ హోప్(23), హోప్(19) లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేదు.
భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మరోసారి రెచ్చిపోగా, స్పిన్ దిగ్గజం అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా పేసర్ ఉమేశ్ యాదవ్, పార్ట్‌టైమ్ బౌలర్ జాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), అజింక్యా రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్(40), యువరాజ్(39)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2 నెగ్గి ఆధిక్యంలో ఉండగా ఒక మ్యాచ్ డ్రా అయింది. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.