అన్ని జాగ్రత్తలతో రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్..
న్యూఢిల్లీ: పన్ను చట్టాలకు గతం నుంచి అమల్లోకి వచ్చే (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామని ఇన్వెస్టర్లకు జైట్లీ భరోసా ఇచ్చారు. ఐటీ చట్టం సవరణ(2012)కు సంబంధించిన తాజా కేసులన్నిటినీ ఉన్నత స్థాయి సీబీడీటీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. అయితే, ఆదాయ పన్ను చట్టం -1961కు రెట్రాస్పెక్టివ్ సవరణతో ఇప్పటికే ఉత్పన్నమై, కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు హేతుబద్ధంగా పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు.
ఆర్బిట్రేషన్ కొనసాగిస్తాం : జైట్లీ ప్రకటన నేపథ్యంలో రూ.20 వేల కోట్ల పన్ను వివాదానికి సంబంధించి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) ప్రక్రియను కొనసాగించాలని వొడాఫోన్ నిర్ణయించింది.
రెండేళ్లలో కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు...: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన కొత్త అకౌంటింగ్ ప్రమాణాలను 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని జైట్లీ చెప్పారు.
నూతన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల(ఇండ్ ఏఎస్)ను 2015-16 నుంచి స్వచ్ఛందంగా, 2016-17 నుంచి తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా ద్రవ్య సేవల రంగంలోని సంస్థలకు గడువును ఆయా రంగాల రెగ్యులేటర్లు ప్రకటిస్తారని చెప్పారు.