ఖాతాలపై స్విస్‌తో ఒప్పందం
2018 తర్వాత వివరాలు పొందే అవకాశం
న్యూఢిల్లీ: 2018 సెప్టెంబర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను పొందేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2019 సెప్టెంబర్ నుంచి ‘ఆటోమేటిక్ షేరింగ్’కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే వీలుంటుంది. ఈ సమయానికి ముందున్న సమాచారాన్ని ఇచ్చేందుకు స్విస్ నిరాకరించింది. దీని అమలుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకొనే ‘సంయుక్త ప్రకటన’ఒప్పందంపై సీబీడీటీ చైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోడిట్ మంగళవారం ఇక్కడ సంతకాలు చేశారు.
సమాచార గోప్యతకు భంగం కలగనీయమని స్విస్‌కు భారత్ హామీ ఇచ్చింది. ‘ఏఈఓఐ (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) ఒప్పందం వల్ల 2019 సెప్టెంబర్ నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల సమాచారాన్ని పొందొచ్చు’అని ఆర్థిక శాఖ పేర్కొంది. బహుపాక్షిక సమర్థ సంస్థ ఒప్పందం (ఎంసీఏఏ: మల్టీలేటరల్ కంపీటెంట్ అథారిటీ అగ్రిమెంట్) కింద భారత్‌తో ఏఈఓఐ కుదుర్చుకున్నాం’అని స్విస్ ఆర్థిక శాఖ తెలిపింది. అరుుతే ఖాతాల సమాచారమివ్వాలంటూ భారత్ నుంచి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలపై ఒప్పందం సందర్భంగా చర్చకు రాలేదు. గత జూన్‌లో స్విస్ అధ్యక్షుడు జోహాన్ ష్నెడర్ అమ్మన్‌తో జనీవాలో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ ఖాతాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చించారు.