క్రికెటర్ భువనేశ్వర్‌కు బెదిరింపులు
మీరట్: భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆయన తండ్రి కిరణ్ పాల్ సింగ్‌లకు బెదిరింపులు వచ్చాయి. కిరణ్ పాల్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ భూవివాద విషయంపై భువనేశ్వర్, కిరణ్ పాల్ కు బెదిరింపులు వచ్చినట్టు మీరట్ పోలీసులు తెలిపారు. భువనేశ్వర్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసిస్తోంది.
కిరణ్‌పాల్.. బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి 80 లక్షల రూపాయలకు భూమిని కొనుగోలు చేశారు. రణవీర్ ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కిరణ్ పాల్ భూమి కొనుగోలుకు సంబంధించిన మొత్తాన్ని నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రణవీర్ భూమిని కిరణ్‌పాల్ పేరిట ట్రాన్స్ఫర్ చేయలేదు. రణవీర్ ఈ డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు భువనేశ్వర్, కిరణ్‌పాల్‌ను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. రణవీర్‌తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భువనేశ్వర్ ప్రస్తుతం టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు.