నూతన విద్యావిధానం అవసరం
ఐఎస్ఆర్ డిగ్రీల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
పింప్రి, న్యూస్‌లైన్: సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మన దేశం ప్రపంచ చేశాలతో పోటీ పడాలంటే కొత్త కొత్త ప్రయోగాలను చేయాలని, ఇందుకు యువత కృషి ఎంతో అవసరమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) సంస్థ ఆదివారం జరిగిన డిగ్రీల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ర్టపతి ప్రణబ్ ప్రసంగిస్తూ .. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ప్రాచీనమైనవని సూచించారు. కాలానుగుణంగా ప్రపంచస్థాయిలో పోటీ పడాలంటే కొత్త కొత్త ప్రయోగాలు, పరిశోధనల ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలోని మొదటి 200 విద్యాసంస్థల్లో మన దేశానికి చెందిన ఒక్క విద్యా సంస్థ కూడా లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల విద్యాసంస్థలకు దీటుగా మన దేశ విద్యా సంస్థలు పనిచేయడానికి నూతన విద్యావిధానం అవసరముంటుందన్నారు.
ఇందుకుగాను యువశక్తి తోడ్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత కృషితో పాటు విద్యాసంస్థలు తగిన ఏర్పాట్లను చేసినప్పుడే అది సాధ్యపడగలదని రాష్ట్రపతి తెలిపారు. తర్వాత సంస్థ నూతన భవనాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇదిలా వుండగా ఈ ఏడాది సంస్థ ద్వారా 13 మంది పీహెచ్‌డీలు, 94 మంది డిగ్రీలు పొందారు.
కార్యక్రమానికి రాష్ర్ట గవర్నర్ కె.శంకర్ నారాయణన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఐఎస్ఆర్ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కె.గణేష్, పాలక మండలి అధ్యక్షుడు టి.వి.రామకృష్ణన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.