తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు
తిరుపతిలో ఐదు రోజుల పాటు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు
ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా తరలివచ్చిన సైంటిస్టులు ఆరుగురు నోబెల్ గ్రహీతలు
12వేల మందికి పైగా పాల్గొంటారని అంచనా
ఎస్వీ వర్సిటీ వేదికగా ఏర్పాట్లనీ పూర్తి
ఐదు వేదికలపై రోజూ ప్లీనరీ సెషన్స్
సృష్టికర్త బ్రహ్మ చేసే ఉత్సవాలకు తిరునగరి ఏటా ఆతి«థ్య వేదికవుతోంది.. ఇప్పుడు సృష్టికి ప్రతిసృష్టి అని పిలిచే సైన్స్ పండగకు వేదికయింది. ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో శాస్త్ర విజ్జానం నేటి నుంచి కొలువు తీరనుంది. సైన్స్ రంగాన అతిరథ మహారథులంతా తిరునగరికి తరలి వస్తున్నారు. విశ్వ విఖ్యాత నోబెల్ అవార్డు గ్రహీతలూ సైన్స్ వేడుకలో పాలుపంచుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 11గంటలకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఇస్కా)ను ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు పండగ వాతావరణంలో జరిగే ఇస్కాలో ఎందరో ప్రముఖులు ప్రసంగించనున్నారు.తొలిరోజు ముగ్గురు నోబెల్ గ్రహీతలు తమ సందేశాలను వినిపిస్తారు. దేశ, విదేశాలకు చెందిన 400మంది సైంటిస్టులు పాల్గొంటారు. వివిధ అంశాలపై 32 ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి.
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ 104వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్నారు. జిల్లా యంత్రాంగం రెండు నెలలుగా శ్రమించి, ఏర్పాట్లు పూర్తిచేసింది.
దాదాపు 12వేల మంది ప్రతినిధులు, ఆరుగురు నోబెల్ శాస్త్రవేత్తలు, 200 మంది విదేశీ శాస్త్రవేత్తలు, 200 మంది దేశంలోని అత్యున్నత సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని ప్రారంభించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ప్రారంభ కార్యక్రమంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెం దిన ప్రొఫెసర్ మోర్నర్ విలియమ్ ఎస్కో, ఇజ్రాయిల్‌కు చెందిన అడాయియోనాత్, జపాన్‌కు చెందిన టకాకికజి త, బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్యూనస్, ప్రాన్స్‌కు చెందిన జీన్టైరోల్, ఫ్రా¯Œ్సకు చెందిన సెజ్ హరోచీ హాజరుకానున్నారు. వీరితో ప్రధాని భేటీ కానున్నారు. అర గంటపాటు ముఖాముఖిలో పాల్గొంటారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అనే అంశంపై జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్‌కు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సదస్సు 5 రోజుల పాటు జరగనుంది. సదస్సులో సుమారు 10 మందికి ప్రధాని వివిధ రకాల అవార్డులను అందజేస్తారు. మ« ధ్యాహ్నం నుంచి శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే నోబెల్ బహుమతి గ్రహీతలు తమ సందేశాలను ఇవ్వనున్నారు. 4 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం ఐదు వేదికల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా బ్లూ ఎకానమీ, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, నెట్ జనరేషన్ నెట్వర్క్, క్లైమేట్ ఛేంజ్, లీడర్ షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ , పాంట్రీయర్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, స్పేస్ టెక్నాలజీ, 5జీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆఫ్సోర్ విండ్ ఫామ్స్, నానో టెక్నాలజీ, తదితర అంశాలపై 32 ప్లీనరీలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి 34 హాళ్లలో టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. వీటిల్లో పరిశోధకులు వివిధ రకాల పరిశోధన పత్రాలు సమర్పిస్తారు.
12 వేల మందికి ఏర్పాట్లు
ప్రధాని ప్రారంభించే సమావేశంలో 12వేల మంది కూర్చునేలా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులకు వేర్వేరుగా సీట్లు కేటాయించారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు 10 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎగ్జిబిషన్
సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి, సాధించిన ప్రగతిపై మెగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎంఎం యాక్టివ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో డీఆర్డీవో, సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్, డీఏఈ తదితర పరిశోధన సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్ విశ్వవిద్యాలయాలు సరికొత్త ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నాయి.