మా వాళ్లపై భారత్ ఆర్మీ దాడి: పాకిస్థాన్
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సరిహద్దు వెంబడి భారత్ కాల్పుల్లో 11 మంది మరణించారని పాకిస్థాన్ ఆరోపించింది. నీలం వ్యాలీలో ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత దళాలు జరిపిన దాడిలో తొమ్మిది మంది పౌరులు మృతి చెందారని స్థానిక అధికారి వహిద్ ఖాన్ తెలిపారు. మరో దాడిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని నాక్యాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారని పోలీసు అధికారి వసీంఖాన్ వెల్లడించారు.
కాల్పుల విరమణ ఉల్లఘించినందుకు తాము తగిన రీతిలో స్పందించామని భారత సైనిక అధికార ప్రతినిధి కల్నల్ నితిన్ జోషి అన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కశ్మీర్ లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాక్ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టడంతో ఇరువైపులా భారీగా కాల్పులు జరిగాయి. మంగళవారం పాక్ బలగాలు జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు.