Indian stock market
-
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
పబ్లిక్ ఇష్యూలకు రిటైలర్ల క్యూ
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో గతేడాది మార్చిలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆపై కోవిడ్–19 కట్టడిలో భాగంగా ప్రజలను అధిక సంఖ్యలో గుమిగూడవద్దంటూ హెచ్చరించింది. అయితే ఇదే సమయంలో దేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు క్యూ కట్టడం విశేషం! ఇందుకు వీలుగా పలువురు ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. తద్వారా పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది! ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: గత కేలండర్ ఏడాది(2020) సెప్టెంబర్ నుంచి చూస్తే పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వెస్టర్లు సగటున 1.3 మిలియన్ అప్లికేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్–19కు ముందు ఈ సంఖ్య 0.5 మిలియన్లుగా మాత్రమే నమోదైంది. ప్రైమరీ మార్కెట్లను పరిశీలించే ప్రైమ్ డేటాబేస్ అందించిన వివరాలివి. ఇందుకు ప్రధానంగా కరోనా వైరస్ ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయడం ప్రభావం చూపింది. ఎలాగంటే స్టిములస్ల కారణంగా ఒక్కసారిగా లిక్విడిటీ పెరిగిపోయింది. చౌకగా లభిస్తున్న ఈ నిధులు స్టాక్స్, బంగారం తదితరాల్లోకి ప్రవహించడం అధికమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. పసిడి సైతం సరికొత్త రికార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూకట్టాయి. మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్, లిక్విడిటీ ప్రభావంతో ఐపీవోలకు వచ్చిన కంపెనీల షేర్లు భారీ లాభాలతో లిస్ట్‌కావడం దీనికి జత కలిసింది. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రైమరీ మార్కెట్లు భారీగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఖాతాల జోరు గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా 10 మిలియన్ డీమ్యాట్ ఖాతాలను తెరిచినట్లు ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. లాక్డౌన్ సమయంలో నెలకు సగటున 1 మిలియన్ డీమ్యాట్ ఖాతాలు జమ అయినట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఈ సందర్భంగా వెల్లడించింది. డీమ్యాట్ ఖాతాలను సులభంగా తెరవడంతోపాటు.. అలవోకగా ఐపీవోలకు దరఖాస్తు చేసే వీలుండటంతో రిటైలర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు జిరోధా బ్రోకింగ్ నిపుణులు పేర్కొన్నారు. పలు ఐపీవోలు భారీ సక్సెస్‌ను సాధించడం, కొత్త కంపెనీలు లిస్టింగ్ రోజే సగటున 40 శాతం లాభాలు ఆర్జించడం వంటి అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొత్త తరం రిటైలర్లు పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో లిస్టింగ్‌లోనే లాభాల ట్రెండ్ మరింత ఊపందుకున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్లు కళకళలాడితే.. కొత్తగా రిటైల్ ఇన్వెస్టర్లు పుట్టుకొస్తారని వివరించారు. నిజానికి మార్కెట్లలో కొనసాగుతున్న ఇన్వెస్టర్లు సైతం కుటుంబ సభ్యుల పేరుతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతారని జిరోధా నిపుణులు ప్రస్తావించారు. ఇటీవల పలు ఇష్యూలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో షేర్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి ట్రెండ్ ప్రకారం చూస్తే పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసిన ప్రతీ 30 మందిలో ఒక్కరికి మాత్రమే షేర్ల కేటాయింపునకు వీలున్నట్లు వివరించారు. పలు కంపెనీలు దేశీయంగా ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలను తాకగా.. అటు యూఎస్ మార్కెట్లు సైతం రోజుకో కొత్త గరిష్టానికి చేరుతూ వచ్చాయి. సెకండరీ మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్ ప్రభావంతో పలు కంపెనీలు బంపర్ లిస్టింగ్‌లను సాధిస్తూ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్ తదుపరి సైతం పలు కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో సాగడం కూడా రిటైలర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. తాజా ఉదాహరణ చూస్తే.. ఎంటార్ టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ. 575తో పోలిస్తే రూ. 1,055 వద్ద లిస్టయ్యింది. తొలి రోజు ఏకంగా 87 శాతం లాభంతో రూ. 1,078 వద్ద ముగిసింది. కాగా. ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంటు నేపథ్యంలో ఈ వారం క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇం డస్ట్రీస్, కల్యాణ్ జ్యువెల్లర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. వీటితోపాటు వారాంతాన ప్రారంభమై మంగళవారం ముగిసిన అనుపమ్ రసాయన్ ఐపీవో సైతం 44 రెట్లు అధికంగా బిడ్స్‌ను ఆకట్టుకుంది. ఈ 5 కంపెనీలూ ఐపీవోల ద్వారా వారంలో రూ. 4,524కోట్లను సమీకరించనుండటం గమనార్హం. గతేడాది మొదట్లో తలెత్తిన కోవిడ్–19 ప్రభావం 2021కల్లా చాలావరకూ ఉపశమించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వె స్టర్ల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ట్లు తెలియజేశాయి. ఇటీవలి ఐపీవోలలో రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉన్నదంటే.. దరఖాస్తుల తీరిలా(మిలియన్లలో) కంపెనీ పేరు అప్లికేషన్లు ఇండిగో పెయింట్స్ 2.59 మజ్గావ్ డాక్ 2.36 బెక్టర్స్ ఫుడ్ 2.20 రైల్‌టెల్ కార్ప్ 2.07 బర్గర్ కింగ్ 1.97 . -
ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం..
ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను జోరుగా కొనసాగించిన నేపథ్యంలో గతవారం ప్రధాన సూచీలు మూడున్నర శాతం మేర లాభాలను నమోదుచేశాయి. రెట్టించిన ఉత్సాహంతో వీరు పెట్టుబడులను కొనసాగించడంతో నిఫ్టీ వారాంత ట్రేడింగ్ రోజున 11,427 వద్దకు చేరుకుంది. అయితే, ఇక్కడ నుంచి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకుంటుందా..? లేదంటే, స్వల్పకాలిక దిద్దుబాటుకు లోనవుతుందా? అనే ప్రధాన అంశానికి ఎఫ్ఐఐల నిర్ణయమే అత్యంత కీలకం కానుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈనెల్లో ఇప్పటివరకు దేశీ స్టాక్ మార్కెట్లో రూ.17,055 కోట్లను పెట్టుబడి పెట్టిన వీరు ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే సూచీలు ఊర్థ్వముఖంగా ప్రయాణం కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే ఫిబ్రవరి మధ్యవరకు దేశీ ప్రధాన సూచీలు అండర్పెర్ఫార్మ్ చేశాయి. ఇప్పుడైతే ఈ ట్రెండ్‌లో మార్పు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలపై అంచనాలు, ఇక్కడి మార్కెట్లో స్వల్పకాలిక రాబడికి ఉన్న అవకాశాల ఆధారంగా ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు ఉండనుంది. ఒకవేళ వీరి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం షార్ప్ కరెక్షన్ ఉంటుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నిఫ్టీలో 38 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్ రంగంలో ప్రస్తుతం పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటిలో ప్రైవేటు బ్యాంకులు బలమైన రిటైల్ వృద్ధిని నమోదుచేస్తుండగా.. పీఎస్‌యూ బ్యాంకులు మొండిబకాయిల భారం నుంచి బయటపడడం సానుకూలంగా ఉంది. ఇక హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవుకావడం గమనార్హం. అంతర్జాతీయ అంశాలపై దృష్టి.. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ).. కీలక వడ్డీ రేట్లపై ఈవారంలో తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అత్యధిక శాతం నిపుణుల అంచనాల ప్రకారం ఫెడరల్ ఫండ్ రేట్లు (2.25 శాతం నుంచి 2.5 శాతం) మార్చకపోవచ్చు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం గురువారం వెల్లడికానుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని తెలుస్తోంది. ఈవారంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. యూకే ద్రవ్యోల్బణం బుధవారం వెల్లడికానుండగా.. జపాన్ వాణిజ్యలోటు సోమ వారం, ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఎఫ్ఐఐల నికర కొనుగోళ్లు మార్చి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.20,400 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రూ.17,919 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.2,499 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టారు. అటు దేశీయ, ఇటు అంతర్జాతీయ సానుకూల అంచనాలు దీనికి కారణం. -
భవిష్యత్‌లోనూ దూకుడే
ముంబై: రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది మరింత పురోగమిస్తాయని ఒక సర్వే పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అంచనాలతో మార్కెట్లు ఇప్పటికే పలు రికార్డులను నమోదు చేశాయి. ఈ ఏడాది(2014) ద్వితీయార్థంలోనూ మరింత పుంజుకుంటాయని దేశీయ ఇన్వెస్టర్లలో అత్యధిక శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ సర్వే ఈ విషయాలను వివరించింది. 82% మంది దేశీయ ఇన్వెస్టర్లు 2014లో మార్కెట్లు మరింత లాభపడతాయని భావించగా, సగంమంది భారీగా పుంజుకుంటాయని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. రానున్న దశాబ్దం భారత్‌దే గత ఐదేళ్లలో దేశీ స్టాక్ మార్కెట్లు మందగించినప్పటికీ అత్యధిక శాతం మంది ప్రాంతీయ ఇన్వెస్టర్లు ఆశావ హంగా స్పందించడం విశేషమని టెంపుల్టన్ వ్యాఖ్యానించింది. రానున్న దశాబ్ద కాలంలో ఇండియా మార్కెట్లదే హవా అని అభిప్రాయపడ్డారు. మిగిలిన ఆసియా మార్కెట్లు ద్వితీయ స్థానంలో ఉంటాయని చెప్పారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, అమెరికా, యూరప్‌లకు చెందిన 22 దేశాల నుంచి 11,113 మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించినట్లు టెంపుల్టన్ తెలిపింది. 2014లో ఇండియా ఉత్తమ ఫిక్స్డ్ రిటర్న్‌లను అందించడమేకాకుండా రానున్న పదేళ్లలోనూ మంచి పనితీరును చూపుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారు. దేశీ ఇన్వెస్టర్లు ఆస్తులు, షేర్లు, బంగారం తదితర విలువైన లోహాలు ఉత్తమ రిటర్న్‌లను ఇస్తాయంటూ రేటింగ్ ఇచ్చారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో 52% మంది ఇన్వెస్టర్లు ఈ ఏడాది మరింత ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలిపారు. దేశీ ఇన్వెస్టర్లలో 59% మంది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలు, రియల్టీ, పసిడి, వెండిలో మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.