భవిష్యత్‌లోనూ దూకుడే
ముంబై: రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది మరింత పురోగమిస్తాయని ఒక సర్వే పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అంచనాలతో మార్కెట్లు ఇప్పటికే పలు రికార్డులను నమోదు చేశాయి. ఈ ఏడాది(2014) ద్వితీయార్థంలోనూ మరింత పుంజుకుంటాయని దేశీయ ఇన్వెస్టర్లలో అత్యధిక శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ సర్వే ఈ విషయాలను వివరించింది. 82% మంది దేశీయ ఇన్వెస్టర్లు 2014లో మార్కెట్లు మరింత లాభపడతాయని భావించగా, సగంమంది భారీగా పుంజుకుంటాయని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.
రానున్న దశాబ్దం భారత్‌దే
గత ఐదేళ్లలో దేశీ స్టాక్ మార్కెట్లు మందగించినప్పటికీ అత్యధిక శాతం మంది ప్రాంతీయ ఇన్వెస్టర్లు ఆశావ హంగా స్పందించడం విశేషమని టెంపుల్‌టన్ వ్యాఖ్యానించింది. రానున్న దశాబ్ద కాలంలో ఇండియా మార్కెట్లదే హవా అని అభిప్రాయపడ్డారు. మిగిలిన ఆసియా మార్కెట్లు ద్వితీయ స్థానంలో ఉంటాయని చెప్పారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, అమెరికా, యూరప్‌లకు చెందిన 22 దేశాల నుంచి 11,113 మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించినట్లు టెంపుల్‌టన్ తెలిపింది. 2014లో ఇండియా ఉత్తమ ఫిక్స్‌డ్ రిటర్న్‌లను అందించడమేకాకుండా రానున్న పదేళ్లలోనూ మంచి పనితీరును చూపుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేశారు.
దేశీ ఇన్వెస్టర్లు ఆస్తులు, షేర్లు, బంగారం తదితర విలువైన లోహాలు ఉత్తమ రిటర్న్‌లను ఇస్తాయంటూ రేటింగ్ ఇచ్చారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో 52% మంది ఇన్వెస్టర్లు ఈ ఏడాది మరింత ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలిపారు. దేశీ ఇన్వెస్టర్లలో 59% మంది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలు, రియల్టీ, పసిడి, వెండిలో మరింత ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.