Indian team selection
-
దక్షిణాఫ్రికా పర్యటనకు జంబో జట్టు..!
దాదాపు నెల రోజుల పాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత సెలెక్టర్లు ఇవాళ జట్టును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ పర్యటన కోసం సెలెక్టర్లు జంబో జట్టును ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఈ పర్యటన నిమిత్తం బీసీసీఐ ఏకంగా 45 వీసాలకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ విషయం సోషల్‌మీడియాలో లీక్ కావడంతో సెలక్టర్లు జంబో జట్టును ప్రకటించడం ఖాయమని భారత క్రికెట్ అభిమానులు నిర్ధారించుకున్నారు. డిసెంబర్ 10 నుంచి జనవరి 7, 2024 వరకు సాగే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మూడు ఫార్మాట్లలో సాగే ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్లు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండటం దాదాపుగా ఖరారైంది. రోహిత్, విరాట్ కేవలం టెస్ట్ సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కామన్ ప్లేయర్లతో కలుపుకుంటే ఈ పర్యటన కోసం కనీసం 25 ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అదనంగా సహాయ సిబ్బందిని కలుపుకుంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 45 వీసాల అంశం కరెక్టే అనిపిస్తుంది. కాగా, ప్రస్తుతం ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న జట్టులోని మెజార్టీ సభ్యులను భారత సెలెక్టర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయవచ్చు. వీరిలో ఎక్కువ శాతం టీ20 జట్టులో ఉండే అవకాశం ఉంది. వీరికి అదనంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్లు, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న ఆటగాళ్లు ఏదో ఒక ఫార్మాట్లో ఉండే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు వేర్వేరే కెప్టెన్లు ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి సెలెక్టర్లు ఏ మేరకు నిర్ణయిస్తారో తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్.. డిసెంబర్ 10: తొలి టీ20 (డర్బన్) డిసెంబర్ 12: రెండో టీ20 (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 14: మూడో టీ20 (జోహనెస్బర్గ్) డిసెంబర్ 17: తొలి వన్డే (జోహనెస్బర్గ్) డిసెంబర్ 19: రెండో వన్డే (పోర్ట్ ఎలిజబెత్) డిసెంబర్ 21: మూడో వన్డే (పార్ల్) డిసెంబర్ 26 నుంచి 30: తొలి టెస్ట్ (సెంచూరియన్) 2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్ (కేప్‌టౌన్) -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
శుబ్‌వార్త...
న్యూఢిల్లీ: యూత్ క్రికెట్‌తో పాటు రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో పరుగుల వరద పారించిన పంజాబ్ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్‌కు తొలిసారి భారత సీనియర్ జట్టు పిలుపు లభించింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్ కోసం 19 ఏళ్ల గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిషేధం ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ స్థానంలో అతడికి అవకాశం దక్కింది. తాజా రంజీ సీజన్లో గిల్ 10 ఇన్నింగ్స్‌లలో కలిపి 98.75 సగటుతో 790 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే భారత ‘ఎ’ జట్టు తరఫున న్యూజిలాండ్‌లో పర్యటించిన అనుభవం కూడా గిల్‌కు కలిసొచ్చింది. వాస్తవానికి సెలక్టర్లు టెస్టు సిరీస్‌లో రాణించిన మయాంక్ అగర్వాల్‌నే ఎంపిక చేయాలని భావించారు. అయితే ఇటీవల అతని వేలికి అయిన గాయం తగ్గకపోవడంతో గిల్ వైపు మొగ్గు చూపారు. నిషేధానికి గురైన మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు పిలుపు దక్కింది. భారత్ తరఫున శంకర్ ఇప్పటి వరకు 5 టి20 మ్యాచ్‌లు ఆడగా, వన్డేల్లో అవకాశం లభించడం ఇదే మొదటి సారి. అతను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లి రెండో వన్డేకు ముందు జట్టుతో చేరతాడు. భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్ 94.00 సగటుతో 188 పరుగులు చేశాడు. ‘గిల్లో ప్రత్యేక ప్రతిభ ఉంది. చాలా కాలం తర్వాత నేను ఇష్టంగా ఒక కుర్రాడి బ్యాటింగ్ చూస్తున్నాను. 2019 ప్రపంచ కప్ తర్వాత అతను భారత జట్టులోకి రావడం ఖాయం’... గిల్ పంజాబ్ సహచరుడు, భారత స్టార్ యువరాజ్ సింగ్ వారం రోజుల క్రితమే చేసిన వ్యాఖ్య ఇది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో చాలా ముందుగా శుబ్‌మన్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. టీనేజర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చి ‘భవిష్యత్తు తార’గా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న భారత యువ ఆటగాళ్లలో శుబ్‌మన్ గిల్ కూడా ఒకడు. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో పంజాబ్ తరఫున మొదటి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్న గిల్ వరుసగా రెండేళ్ల పాటు బీసీసీఐ ‘బెస్ట్ జూనియర్ క్రికెటర్’ అవార్డు అందుకున్నాడు. ముఖ్యంగా కెరీర్ పరంగా అతనికి గత ఏడాది కాలం అద్భుతంగా సాగింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లోనే జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలోనే 124 సగటుతో 372 పరుగులు చేసిన గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచి జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందే ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన అండర్–19 వన్డే సిరీస్‌లో కూడా 4 ఇన్నింగ్స్‌లలోనే 351 పరుగులు, ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి మరో 278 పరుగులు చేయడం గిల్‌పై అందరి దృష్టీ పడేలా చేసింది. ఆ తర్వాత ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.1.8 కోట్లకు గిల్‌ను తీసుకుంది. అప్పటి నుంచి ఇక సీనియర్ విభాగంలో ఎలా రాణిస్తాడనే దానిపైనే ఆసక్తి నెలకొంది. సాంప్రదాయ శైలిలో బ్యాటింగ్ చేస్తూనే ప్రతీ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటను మార్చుకొని అన్ని రకాల షాట్లు ఆడగలగడం గిల్ ప్రత్యేకత. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన శుబ్‌మన్ ప్రతీ మ్యాచ్‌లో కనీసం అర్ధ సెంచరీ చేయడం విశేషం. ముఖ్యంగా తమిళనాడుపై చేసిన 268 పరుగుల ఇన్నింగ్స్ అతని సాధికారితను చాటితే... హైదరాబాద్‌పై 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 154 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 148 పరుగులు అతని కెరీర్లో ఇప్పటివరకు అతి పెద్ద హైలైట్. తుది జట్టులో అవకాశం లభిస్తే భారత్ సీనియర్ జట్టు తరఫున ఆడుతున్నాననే ఒత్తిడిని నేను ముందుగా అధిగమించాలి. ఇది కొంత కష్టమే కానీ నేను మానసికంగా సిద్ధంగా ఉన్నా. ఏడాది క్రితం అండర్–19 ప్రపంచకప్ ఆడాను. ఇటీవలే పర్యటించిన న్యూజిలాండ్ గడ్డపై తొలి సిరీస్‌కు ఎంపిక కావడం మంచిదే. అక్కడ బాగా రాణించాను కాబట్టి నా టెక్నిక్‌లో పెద్దగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. టీమిండియా చాన్స్‌ను అసలు ఊహించలేదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఎంపికయ్యానో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఆడిన అన్ని స్థాయిలలో రాణించాను కాబట్టి అంతర్జాతీయ క్రికెట్లో కూడా బాగా ఆడగలననే నమ్మకముంది. – శుబ్‌మన్ గిల్ -
‘ ఆ ఒక్క’ స్థానంలో ఎవరు?
♦ అజింక్య రహానే, మనీశ్ పాండే మధ్య పోటీ ♦ టి20 ప్రపంచకప్‌కు నేడు భారత జట్టు ఎంపిక ♦ ఆసియా కప్ టోర్నీకి కూడా న్యూఢిల్లీ: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లోనే భారత జట్టు కూర్పుపై ఒక అంచనా వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మార్పు కూడా లేకుండా అదే 11 మంది ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. కెప్టెన్ ధోని కూడా దాదాపు ఇదే టీమ్ అంటూ ప్రస్తుత సభ్యులకే తన ఓటు వేశాడు. కాబట్టి సొంతగడ్డపై జరిగే టి20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఎంపికలో ఎలాంటి సంచలనాలకు పెద్దగా అవకాశం లేదు. ఆసీస్‌ను చిత్తు చేసిన టీమ్‌పై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు (శుక్రవారం) ఇక్కడ సమావేశమవుతోంది. పనిలో పనిగా ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే జట్టును కూడా ప్రకటిస్తారు. అయితే బంగ్లాదేశ్ పరిస్థితులకు, భారత్‌కు పెద్దగా తేడా ఉండకపోవడం, ఈసారి ఆసియా కప్ ఫార్మాట్ కూడా టి20 కావడంతో రెండు వేర్వేరు జట్లు కాకుండా ఒకే టీమ్‌ను రెండింటికీ ఎంపిక చేసే అవకాశం ఉంది. కుర్రాళ్లు ఖాయం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లలో బరిలోకి దిగిన జట్టులో రెగ్యులర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. ధోని మద్దతును బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ స్థానానికి కూడా వచ్చిన ప్రమాదమేమీ లేదు. తమ ప్రదర్శనతో కొత్త కుర్రాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తమ స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆశిష్ నెహ్రాపై కూడా మేనేజ్మెంట్కు నమ్మకముంది. అయితే ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైన జట్టులో అజింక్య రహానే, మనీశ్ పాండేలు ఇద్దరూ ఉన్నారు. విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో పాండేకు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు ప్రపంచకప్ కోసం ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు తప్పుకోవాల్సిన పరిస్థితి. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో రహానే నిలకడగా రాణిస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగా, ఇటీవలి సిడ్నీ వన్డే ఇన్నింగ్స్, టి20 శైలి బ్యాటింగ్ పాండేకు ఉన్న అనుకూలతలు. చివరి ఓవర్లలో రహానే హిట్టింగ్ సామర్థ్యంపై స్వయంగా ధోనికే సందేహాలు ఉన్నా... ఒక జూనియర్ కోసం అతడిని ఉన్నపళంగా పక్కన పెడతారా అనేది సందేహమే. ఇర్ఫాన్ పఠాన్ ఆశలు... ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో కొత్త ఆటగాడు పవన్ నేగి కూడా ఉన్నాడు. అతడిని ఇదే సిరీస్ వరకు పరిమితం చేస్తే ఆ స్థానంలో మరో ఆటగాడికి వరల్డ్ కప్ అవకాశం ఉంది. నెహ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహం ఉండటంతో మరో లెఫ్టార్మ్ సీమర్‌ను ఎంపిక చేయవచ్చు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చిన ఇర్ఫాన్ పఠాన్ ఆ స్థానం ఆశిస్తున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉంటే మొహమ్మద్ షమీ తిరిగొచ్చే అవకాశం కూడా ఉంది. -
రహానేకు పగ్గాలు
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి హర్భజన్, ఉతప్పలకు చోటు జింబాబ్వే పర్యటనకు సీనియర్ జట్టుతో పాటు ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు భారత్ ‘ఎ’ జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. తీరా జట్లను ప్రకటించాక చూస్తే రెండూ ‘ఎ’ జట్లనే ప్రకటించినట్లుంది. ధోని, కోహ్లి సహా ఏకంగా ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి... రహానేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేసిన హర్భజన్‌తో పాటు ఉతప్పకు కూడా వన్డే జట్టులోకి తలుపులు తెరిచారు. న్యూఢిల్లీ: జింబాబ్వేతో మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత సెలక్టర్లు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వన్డే కెప్టెన్ ధోనిలతో పాటు రోహిత్ శర్మ, సురేశ్ రైనా కూడా అందుబాటులో లేకపోవడంతో రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హర్భజన్ సింగ్ వన్డేల్లోనూ పునరాగమనం చేస్తుండగా... ఉతప్ప కూడా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆకట్టుకున్న పేసర్ సందీప్ శర్మ కూడా తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు. టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ, కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండేలకు కూడా అవకాశం కల్పించారు. అయితే జట్టులో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లేడు. ఉతప్ప, జాదవ్, రాయుడు ముగ్గురూ వికెట్ కీపింగ్ చేస్తారు. వీరిలో దాదాపుగా ఉతప్ప కీపర్‌గా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. జులై 10, 12, 14 తేదీలలో మూడు వన్డేలు... 17, 19న రెండు టి20లు జరుగుతాయి. మ్యాచ్‌లన్నీ హరారేలోనే ఆడతారు. భారత జట్టు: రహానే (కెప్టెన్), మురళీ విజయ్, ఉతప్ప, రాయుడు, తివారీ, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హర్భజన్, అక్షర్ పటేల్, కరణ్‌శర్మ, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్, మోహిత్, సందీప్ శర్మ. 2016 టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశాం. భవిష్యత్‌లో ఉన్న సిరీస్‌లనూ పరిగణనలోకి తీసుకుని కొందరు క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చాం. బంగ్లాదేశ్‌తో టెస్టులో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని హర్భజన్‌ను వన్డేలకూ ఎంపిక చేశాం. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో మెరుగైన జట్టును ఎంపిక చేశాం. తుది జట్టుపై నిర్ణయం కెప్టెన్ తీసుకుంటాడు. రహానే అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు. తన కెరీర్ అద్భుతంగా సాగుతోంది. కాబట్టి కెప్టెన్సీ విషయంలోనూ అతను ఎలా ఉంటాడో చూడాలనుకుని అవకాశం ఇచ్చాం. -సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ ‘ఎ’ జట్టులో ప్రజ్ఞాన్ ఓజా స్వదేశంలోనే జులై 19 నుంచి జరిగే ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్ ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజాకు చోటు లభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ఈ టోర్నీ (నాలుగు రోజుల మ్యాచ్‌లు)లో భారత జట్టుకు చతేశ్వర్ పుజారా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లోకేశ్ రాహుల్, ముకుంద్ లాంటి టెస్టు క్రికెటర్లతో పాటు శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ లాంటి యువ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ ద్వారానే రాహుల్ ద్రవిడ్ ‘ఎ’ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ ‘ఎ’ జట్టు: పుజారా (కెప్టెన్), లోకేశ్ రాహుల్, ముకుంద్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నమన్ ఓజా, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ గోపాల్, బాబా అపరాజిత్. రవిశాస్త్రి డుమ్మా భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లడం లేదు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా వ్యవహరించేందుకు ఆయన ఇంగ్లండ్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ పర్యటనకు శాస్త్రిని బోర్డు నియమించకముందే..ఇంగ్లండ్‌లోని స్కై టీవీతో రవిశాస్త్రి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రిని కొనసాగించాలనే ఉద్దేశం బోర్డుకు ఉన్నట్లు తెలిసింది. అయితే టీవీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కుదరదు కాబట్టి... జింబాబ్వే పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని శాస్త్రి బోర్డుకు తెలిపారు. ఆగస్టులో శ్రీలంకలో పర్యటనకు మాత్రం డెరైక్టర్ అందుబాటులో ఉంటారు. -
సీనియర్లకు విశ్రాంతినిస్తారా!
సందిగ్ధంలో సెలక్షన్ కమిటీ జింబాబ్వే పర్యటనకు నేడు భారత జట్టు ఎంపిక న్యూఢిల్లీ: ఒకవైపు సుదీర్ఘ సీజన్ తర్వాత బాగా అలసిపోయామంటూ ధోని తదితరులు విశ్రాంతి కోరుతున్నారు. మరోవైపు చిన్న సిరీసే కదా ఆడితే ఏముంది, తర్వాత నాలుగు నెలలు ఎలాగూ విశ్రాంతి ఉందనేది బోర్డు పెద్దల వాదన. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం (నేడు) ఇక్కడ సమావేశం కానుంది. ఈ టూర్లో భాగంగా భారత్, జింబాబ్వే మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇదే సమావేశంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును కూడా ఎంపిక చేస్తారు. కెప్టెన్ ఎవరు? జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకుండా తమకు విశ్రాంతి ఇవ్వాలని ఇప్పటికే ధోని, విరాట్ కోహ్లి, అశ్విన్ రవిచంద్రన్, ఉమేశ్ యాదవ్, రోహిత్ శర్మ బోర్డును కోరినట్లు సమాచారం. అయితే వీరిలో కోహ్లి, అశ్విన్‌లతో పాటు గాయాలకు గురి కాకుండా ఉమేశ్‌కు కూడా బ్రేక్ లభించవచ్చు. ధోని టెస్టుల నుంచి ఎలాగూ తప్పుకున్నాడు కాబట్టి ఈ సిరీస్‌కు అతను ఉంటే మంచిదని, ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వన్డేలు లేవని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా రోహిత్ శర్మకు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే కమిటీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఒక వేళ ధోనికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రైనా, రోహిత్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చు. 2010 జింబాబ్వే టూర్లో సురేశ్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించినా... భవిష్యత్తు కెప్టెన్‌గా సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం రోహిత్ శర్మను పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఎవరికి చాన్స్! జట్టులో ఖాయంగా ఉండే ఆటగాళ్లలో అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ ఉన్నారు. అశ్విన్ తప్పుకుంటే జమ్మూ కశ్మీర్ ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌కు చోటు దక్కవచ్చు. హర్భజన్ టెస్టు టీమ్‌లో ఉన్నా, యువ ఆటగాడిగా రసూల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్, సంజు శామ్సన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత ‘ఎ’ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో ముక్కోణపు సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో మరీ జూనియర్లు కాకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో తనకు పటిష్టమైన జట్టును ఇవ్వాలని ద్రవిడ్ కోరినట్లు తెలిసింది. ఈ టీమ్‌కు పుజారా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే నెల 19 నుంచి చెన్నై, వాయనాడ్‌లలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు.