రహానేకు పగ్గాలు | Unexpected captaincy offers Rahane ODI revival | Sakshi
Sakshi News home page

రహానేకు పగ్గాలు

Published Tue, Jun 30 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

రహానేకు పగ్గాలు

రహానేకు పగ్గాలు

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఎంపిక
 ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి    హర్భజన్, ఉతప్పలకు చోటు

 
 జింబాబ్వే పర్యటనకు సీనియర్ జట్టుతో పాటు ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు భారత్ ‘ఎ’ జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. తీరా జట్లను ప్రకటించాక చూస్తే రెండూ ‘ఎ’ జట్లనే ప్రకటించినట్లుంది. ధోని, కోహ్లి సహా ఏకంగా ఎనిమిది మంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి... రహానేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేసిన హర్భజన్‌తో పాటు ఉతప్పకు కూడా వన్డే జట్టులోకి తలుపులు తెరిచారు.
 
 న్యూఢిల్లీ: జింబాబ్వేతో మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత సెలక్టర్లు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వన్డే కెప్టెన్ ధోనిలతో పాటు రోహిత్ శర్మ, సురేశ్ రైనా కూడా అందుబాటులో లేకపోవడంతో రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హర్భజన్ సింగ్ వన్డేల్లోనూ పునరాగమనం చేస్తుండగా... ఉతప్ప కూడా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున ఆకట్టుకున్న పేసర్ సందీప్ శర్మ కూడా తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు.
 
 టెస్టు ఓపెనర్ మురళీ విజయ్, లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ, కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండేలకు కూడా అవకాశం కల్పించారు. అయితే జట్టులో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ లేడు. ఉతప్ప, జాదవ్, రాయుడు ముగ్గురూ వికెట్ కీపింగ్ చేస్తారు. వీరిలో దాదాపుగా ఉతప్ప కీపర్‌గా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. జులై 10, 12, 14 తేదీలలో మూడు వన్డేలు... 17, 19న రెండు టి20లు జరుగుతాయి. మ్యాచ్‌లన్నీ హరారేలోనే ఆడతారు. భారత జట్టు: రహానే (కెప్టెన్), మురళీ విజయ్, ఉతప్ప, రాయుడు, తివారీ, కేదార్ జాదవ్, మనీష్ పాండే, హర్భజన్, అక్షర్ పటేల్, కరణ్‌శర్మ, ధావల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్, మోహిత్, సందీప్ శర్మ.
 
 2016 టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేశాం. భవిష్యత్‌లో ఉన్న సిరీస్‌లనూ పరిగణనలోకి తీసుకుని కొందరు క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చాం. బంగ్లాదేశ్‌తో టెస్టులో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని హర్భజన్‌ను వన్డేలకూ ఎంపిక చేశాం. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో మెరుగైన జట్టును ఎంపిక చేశాం. తుది జట్టుపై నిర్ణయం కెప్టెన్ తీసుకుంటాడు. రహానే అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు. తన కెరీర్ అద్భుతంగా సాగుతోంది. కాబట్టి కెప్టెన్సీ విషయంలోనూ అతను ఎలా ఉంటాడో చూడాలనుకుని అవకాశం ఇచ్చాం.
  -సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్
 
 ‘ఎ’ జట్టులో ప్రజ్ఞాన్ ఓజా
 స్వదేశంలోనే జులై 19 నుంచి జరిగే ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్  ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ప్రజ్ఞాన్  ఓజాకు చోటు లభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ఈ టోర్నీ (నాలుగు రోజుల మ్యాచ్‌లు)లో భారత జట్టుకు చతేశ్వర్ పుజారా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లోకేశ్ రాహుల్, ముకుంద్ లాంటి టెస్టు క్రికెటర్లతో పాటు శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ లాంటి యువ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ ద్వారానే రాహుల్ ద్రవిడ్ ‘ఎ’ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ ‘ఎ’ జట్టు: పుజారా (కెప్టెన్), లోకేశ్ రాహుల్, ముకుంద్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నమన్ ఓజా, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ గోపాల్, బాబా అపరాజిత్.
 
 రవిశాస్త్రి డుమ్మా
 భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లడం లేదు. యాషెస్ సిరీస్‌లో టీవీ విశ్లేషకుడిగా వ్యవహరించేందుకు ఆయన ఇంగ్లండ్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ పర్యటనకు శాస్త్రిని బోర్డు నియమించకముందే..ఇంగ్లండ్‌లోని స్కై టీవీతో రవిశాస్త్రి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రిని కొనసాగించాలనే ఉద్దేశం బోర్డుకు ఉన్నట్లు తెలిసింది. అయితే టీవీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కుదరదు కాబట్టి... జింబాబ్వే పర్యటనకు తాను అందుబాటులో ఉండటం లేదని శాస్త్రి బోర్డుకు తెలిపారు. ఆగస్టులో శ్రీలంకలో పర్యటనకు మాత్రం డెరైక్టర్ అందుబాటులో ఉంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement