
టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఇదివరకే ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.
అయితే ఈ పర్యటనకు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్‌మన్ గిల్ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్‌లతో పాటు ఐపీఎల్-2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం.
వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment