టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది.
సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది.
మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది.
కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్‌సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్‌ను జింబాబ్వే పర్యటనకు హెడ్‌కోచ్‌గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment