Indian womens T20
-
వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్‌లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్ బౌలర్. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడంపై... చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం. టి20ల్లో ప్రదర్శనపై... హైదరాబాద్ టీమ్‌నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్‌లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్‌తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్‌గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్‌లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం. పేస్ బౌలింగ్ పదునుపై... అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్ నా ‘స్టాక్ బాల్’ కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా. మిథాలీ రాజ్ ప్రభావం... నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది. కరోనా కాలంలో సుదీర్ఘ విరామంపై... ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేకపోయింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్ కోసం వరంగల్‌కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం. ‘పాఠాలు నేర్చుకుంటా’ ‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’ -
Shafali Verma: షఫాలీ వర్మకు ప్రమోషన్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 సంచలనం షఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లు టి20లే ఆడిన 17 ఏళ్ల హరియాణా అమ్మాయి షఫాలీ ఇప్పుడు తొలిసారి భారత టెస్టు, వన్డే జట్లకూ ఎంపికైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత సీనియర్ మహిళల టెస్టు, వన్డే, టి20 జట్లను శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ పూర్తిస్థాయి టూర్లో అమ్మాయిల జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు, వన్డేల జట్లకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా ఉంటుంది. భారత్ తరఫున 23 టి20 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి తొలిసారి వన్డే, టెస్టు జట్టులో స్థానం లభించింది. సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ తిరిగి జట్టులోకి వచ్చారు. గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌కు శిఖా పాండే, ఏక్తాబిష్త్లను సెలక్టర్లు దూరం పెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1–4తో... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1–2తో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన రాజేశ్వరి గైక్వాడ్, మాన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష, నుజత్ పర్వీన్, ఆయూషి సోని, సుష్మా వర్మ, శ్వేత వర్మ, యస్తిక భాటియా, హేమలతలను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా ఒకే ఒక్కరు వచ్చారు. జార్ఖండ్ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ మూడు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే రెగ్యులర్ కీపర్ తానియా భాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పర్యటన కోసం అమ్మాయిలు ఈ నెల 18న ముంబైలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్క డే రెండు వారాలు క్వారంటైన్లో గడిపి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ బయలుదేరుతారు. భారత మహిళల టెస్టు, వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్, సిమ్రన్. -
మహిళా టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించారు. విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్, ఆసియాకప్ టి20 టోర్నీల కోసం మహిళా జట్లను ప్రకటించారు. వెస్టిండీస్‌తో వచ్చే నెల 18 నుంచి జరిగే టి20 సిరీస్‌తో పాటు నవంబర్ 27 నుంచి థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యే ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌కు హర్మన్‌ప్రీత్ సారథిగా వ్యవహరిస్తుంది. అరుుతే వచ్చే నెల 10 నుంచి 16 వరకు వెస్టిండీస్‌తోనే జరిగే మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగుతుంది. మ్యాచ్‌లన్నీ విజయవాడ సమీపంలోని మూలపాడులో జరుగుతారుు.