న్యూఢిల్లీ: భారత మహిళల టి20 సంచలనం షఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లు టి20లే ఆడిన 17 ఏళ్ల హరియాణా అమ్మాయి షఫాలీ ఇప్పుడు తొలిసారి భారత టెస్టు, వన్డే జట్లకూ ఎంపికైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత సీనియర్ మహిళల టెస్టు, వన్డే, టి20 జట్లను శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ పూర్తిస్థాయి టూర్‌లో అమ్మాయిల జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు, వన్డేల జట్లకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా ఉంటుంది. భారత్ తరఫున 23 టి20 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి తొలిసారి వన్డే, టెస్టు జట్టులో స్థానం లభించింది.
సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ తిరిగి జట్టులోకి వచ్చారు. గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌కు శిఖా పాండే, ఏక్తాబిష్త్‌లను సెలక్టర్లు దూరం పెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1–4తో... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1–2తో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన రాజేశ్వరి గైక్వాడ్, మాన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష, నుజత్ పర్వీన్, ఆయూషి సోని, సుష్మా వర్మ, శ్వేత వర్మ, యస్తిక భాటియా, హేమలతలను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు.
మొత్తంగా తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా ఒకే ఒక్కరు వచ్చారు. జార్ఖండ్ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ మూడు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే రెగ్యులర్ కీపర్ తానియా భాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పర్యటన కోసం అమ్మాయిలు ఈ నెల 18న ముంబైలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్క డే రెండు వారాలు క్వారంటైన్‌లో గడిపి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ బయలుదేరుతారు.
భారత మహిళల టెస్టు, వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్.
భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్, సిమ్రన్.
Comments
Please login to add a commentAdd a comment