England Test series
-
ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
పెబ్బేరు: ఇంగ్లండ్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగు ఐదో టెస్ట్ మ్యాచ్‌లకు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పెబ్బేరుకు చెందిన షోయబ్‌కు అవకాశం లభించింది. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నాలుగో టెస్టు, 10 నుంచి 14వ తేదీ వరకు అయిదో టెస్ట్‌కు ముంబైలోని సోనీ నెట్వర్క్ స్టూడియోలో తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు. అతడు వ్యాఖ్యాతగా ఎంపికవడంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఆయనతోపాటు పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
ఐపీఎల్ కోసం మా షెడ్యూల్ మార్చుకోం!
లండన్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్–2021ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుండగా... తమ ఆటగాళ్లను మాత్రం రెండో దశ పోటీలకు అనుమతించేది లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఇరు బోర్డుల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నా... లీగ్ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయలేమని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ చెప్పారు. సెప్టెంబర్ 18నుంచి ఐపీఎల్ మళ్లీ జరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లండ్ తలపడనుంది. ‘ఐపీఎల్ కోసం టెస్టు సిరీస్ తేదీల్లో మార్పులు చేయమని మాకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తీ రాలేదు. భారత్‌తో చివరి టెస్టు ఆడగానే ఆటగాళ్లు బంగ్లాదేశ్ బయల్దేరతారు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్, ఆపై టి20 ప్రపంచ కప్ ఉన్నాయి. మున్ముందు యాషెస్ సిరీస్ కూడా ఉంది కాబట్టి కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మేం విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం. దానర్థం వారికి విరామం ఇచ్చిన సమయంలో ఎక్కడికైనా వెళ్లి క్రికెట్ ఆడుకోమని కాదు’ అని ఐపీఎల్‌నుద్దేశించి గైల్స్ వ్యాఖ్యలు చేశారు. -
Shafali Verma: షఫాలీ వర్మకు ప్రమోషన్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 సంచలనం షఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లు టి20లే ఆడిన 17 ఏళ్ల హరియాణా అమ్మాయి షఫాలీ ఇప్పుడు తొలిసారి భారత టెస్టు, వన్డే జట్లకూ ఎంపికైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత సీనియర్ మహిళల టెస్టు, వన్డే, టి20 జట్లను శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ పూర్తిస్థాయి టూర్లో అమ్మాయిల జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు, వన్డేల జట్లకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా... టి20 జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా ఉంటుంది. భారత్ తరఫున 23 టి20 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి తొలిసారి వన్డే, టెస్టు జట్టులో స్థానం లభించింది. సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ తిరిగి జట్టులోకి వచ్చారు. గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌కు శిఖా పాండే, ఏక్తాబిష్త్లను సెలక్టర్లు దూరం పెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1–4తో... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1–2తో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన రాజేశ్వరి గైక్వాడ్, మాన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష, నుజత్ పర్వీన్, ఆయూషి సోని, సుష్మా వర్మ, శ్వేత వర్మ, యస్తిక భాటియా, హేమలతలను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా ఒకే ఒక్కరు వచ్చారు. జార్ఖండ్ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ మూడు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే రెగ్యులర్ కీపర్ తానియా భాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పర్యటన కోసం అమ్మాయిలు ఈ నెల 18న ముంబైలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్క డే రెండు వారాలు క్వారంటైన్లో గడిపి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ బయలుదేరుతారు. భారత మహిళల టెస్టు, వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్, సిమ్రన్. -
నాలుగు వందలకి పైగా కొడితేనే..
కోల్‌కతా: ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భారత జట్టుకు మాజీ సారథి సౌరవ్ గంగూలీ చిట్కాలు చెబుతున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న జోయ్ రూట్ సేనను ఓడించగలిగే సత్తా భారత్‌కు ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగే టీమిండియా బలమని.. తొలి ఇన్నింగ్స్‌లో 400కి పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దాదా అభిప్రాయపడ్డాడు. ఎన్నో అంచనాల మధ్య 2014లో ఎంఎస్ ధోని నేతృత్వంలో ఇంగ్లండ్‌లో టీమిండియా అడుగుపెట్టింది. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు పరద పారిచంగా.. మురళీ విజయ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం చెందారని అందుకే సిరీస్ 1-3తేడాతో ఘోర ఓటమి చవిచూసిందని వివరించాడు. ఇక గత మూడు టెస్టు(న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్) సిరీస్‌ల్లో ఇంగ్లండ్ గెలవలేదని.. చివరిగా ఆడిన తొమ్మిది టెస్టుల్లో బ్రిటీష్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిందని గుర్తుచేశాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో హాట్ ఫేవరేట్ కోహ్లి సేననే అని అభిప్రాయపడ్డాడు. ధోనిపై కామెంట్స్.. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరశపరిచిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి దాదా మద్దతుగా నిలిచాడు. రిటైర్మెంట్ అనేది అతడి వ్యక్తిగత అభిప్రాయమని, ఎవరూ సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. కానీ, ధోని మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పరుగులు రాబడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. సాహా గాయంపై.. భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయంపై మాజీ సారథి స్పందించాడు. అసలు ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. భువనేశ్వర్, బుమ్రా గాయలతో కీలక సిరీస్‌కు దూరమవడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల గాయాలపై బీసీసీఐ దృష్టి పెట్టాలని సూచించాడు. ఇంగ్లండ్‌లో పొడి పిచ్‌లపై టీమిండియా స్పిన్నర్లు రాణిస్తారని నమ్మకం వ్యక్తం చేశాడు. -
వారెవ్వా... విజయ్
విదేశాల్లో మురళీ తొలి సెంచరీ భారత్ 259/4 ధోని అర్ధసెంచరీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఓపెనర్ మురళీ విజయ్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో గౌరవప్రదంగా తొలిరోజును ముగించింది. నాటింగ్‌హామ్‌లో ఉపఖండం తరహా పిచ్ ఎదురుకావడం... ఇంగ్లండ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో ధోనిసేన ఆత్మవిశ్వాసం పెరిగింది. నాటింగ్‌హామ్: చాలా కాలం తర్వాత మురళీ విజయ్ టెస్టుల్లో సత్తా చాటుకున్నాడు. టాప్ ప్లేయర్లు విఫలమైన పిచ్‌పై అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది. విజయ్ (294 బంతుల్లో 122 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (64 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. విజయ్ నిలకడను చూపెట్టినా రెండో ఎండ్‌లో ధావన్ (24 బంతుల్లో 12) నిరాశపర్చాడు. అయితే పుజారా (69 బంతుల్లో 38; 7 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో లంచ్ వరకు భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కానీ లంచ్ తర్వాత అండర్సన్, బ్రాడ్ రివర్స్ స్వింగ్‌తో చెలరేగారు. ఒక పరుగు తేడాతో పుజారా, కోహ్లి (1) అవుట్ కావడంతో భారత్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయ్‌తో జత కలిసిన రహానే (81 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా భారీ స్కోరు చేయలేకపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. టీ తర్వాత విజయ్ 214 బంతుల్లో కెరీర్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విదేశీ గడ్డపై తనకి ఇదే తొలి శతకం. ఆ తర్వాత ధోని సమయోచితంగా ఆడుతూ కాస్త దూకుడు చూపించి అర్ధసెంచరీ చేశాడు. అండర్సన్ 2 వికెట్లు తీయగా... బ్రాడ్, ప్లంకెట్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన స్టువర్ట్ బిన్నీ భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడుతున్న 281వ ఆటగాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ బ్యాటింగ్ 122; ధావన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12; పుజారా (సి) బెల్ (బి) అండర్సన్ 38; కోహ్లి (సి) బెల్ (బి) బ్రాడ్ 1; రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32; ధోని బ్యాటింగ్ 50; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1-33; 2-106; 3-107; 4-178 బౌలింగ్: అండర్సన్ 21-6-70-2; బ్రాడ్ 19-8-26-1; స్టోక్స్ 19-4-47-0; ప్లంకెట్ 21-4-56-1; అలీ 9-0-50-0; రూట్ 1-0-6-0. -
టెస్టుకు ముందు పరీక్ష!
- మరో ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత్ సిద్ధం - నేటినుంచి డెర్బీషైర్‌తో పోరు డెర్బీషైర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జట్టు బలాబలాలను అంచనా వేసేందుకు భారత జట్టుకు ఇదే చివరి అవకాశం. మంగళవారంనుంచి ఇక్కడ జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్, డెర్బీషైర్‌తో తలపడుతుంది. ఈ మూడు రోజుల మ్యాచ్‌కు ఫస్ట్‌క్లాస్ గుర్తింపు లేకపోవడంతో భారత్ అందుబాటులో ఉన్న 18 మంది ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌నుంచి పెద్దగా ప్రయోజనం పొందని టీమిండియా ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. మరో వైపు ప్రత్యర్థి డెర్బీషైర్ పెద్దగా బలంగా ఏమీ లేదు. ఈ జట్టు కూడా తమ దేశవాళీలో వరుసగా విఫలమవుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం భారత్‌ను ఇబ్బంది పెట్టే అంశం. బౌలింగే కీలకం తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆకట్టుకున్నా...బౌలింగ్ ఎప్పటిలాగే బలహీనంగా కనిపించింది. ధావన్, గంభీర్, పుజారా, రహానే, రోహిత్...ఇలా అంతా గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. అయితే రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు అవకాశాలు మెరుగు పడాలంటే ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలింగ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోని తన బౌలింగ్ వనరులను పూర్తిగా ఉపయోగించడంపై దృష్టి పెట్టాడు. గత మ్యాచ్‌లో విఫలమైన ఇషాంత్ శర్మను మినహాయిస్తే జట్టులో ఐదుగురు ప్రధాన పేసర్లు ఉన్నారు. వీరిలో ఎంతో కొంత అంతర్జాతీయ అనుభవం ఉన్న మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఆరోన్‌లు ఈ మ్యాచ్‌లో రాణించడాన్ని బట్టి టెస్టు జట్టు కూర్పును నిర్ణయించవచ్చు. ఇక ఈశ్వర్ పాండే, పంకజ్ సింగ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.