లండన్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్–2021ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుండగా... తమ ఆటగాళ్లను మాత్రం రెండో దశ పోటీలకు అనుమతించేది లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఇరు బోర్డుల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నా... లీగ్ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేమని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ చెప్పారు. సెప్టెంబర్ 18నుంచి ఐపీఎల్ మళ్లీ జరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లండ్ తలపడనుంది. ‘ఐపీఎల్ కోసం టెస్టు సిరీస్ తేదీల్లో మార్పులు చేయమని మాకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తీ రాలేదు. భారత్‌తో చివరి టెస్టు ఆడగానే ఆటగాళ్లు బంగ్లాదేశ్ బయల్దేరతారు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్, ఆపై టి20 ప్రపంచ కప్ ఉన్నాయి. మున్ముందు యాషెస్ సిరీస్ కూడా ఉంది కాబట్టి కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మేం విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం. దానర్థం వారికి విరామం ఇచ్చిన సమయంలో ఎక్కడికైనా వెళ్లి క్రికెట్ ఆడుకోమని కాదు’ అని ఐపీఎల్‌నుద్దేశించి గైల్స్ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment