వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి | Sakshi Interview About Indian womens T20 pace bowler Arundhati Reddy | Sakshi
Sakshi News home page

వన్డేల్లోనూ సత్తా చాటుతా పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి

Published Fri, May 21 2021 4:30 AM | Last Updated on Fri, May 21 2021 4:30 AM

Sakshi Interview About Indian womens T20 pace bowler Arundhati Reddy

సాక్షి, హైదరాబాద్‌: అరుంధతి రెడ్డి... భారత మహిళల టి20 టీమ్‌లో సత్తా చాటి తన స్థానం పదిలం చేసుకున్న పేస్‌ బౌలర్‌. గత మూడేళ్లుగా టి20 ఫార్మాట్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్‌ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది.ఇకపై వన్డేల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్న 23 ఏళ్ల పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...

ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక కావడంపై...
చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్‌లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టి20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ చాన్స్‌ వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం.

టి20ల్లో ప్రదర్శనపై...
హైదరాబాద్‌ టీమ్‌నుంచి మొదలు పెట్టి ఇండియా ‘ఎ’ వరకు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నాకు జాతీయ జట్టులో అవకాశం లభించింది. మూడేళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌నుంచి చూస్తే ఇప్పుడు నా ఆట ఎంతో మెరుగైంది. నా తొలి సిరీస్‌లో శ్రీలంకతో ఆడిన మూడో మ్యాచ్‌తోనే నాకు మంచి గుర్తింపు దక్కింది. కొత్త బంతితో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నేను రెండు కీలక వికెట్లతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాను. అయితే ఇంకా నేను ఆశించిన ‘అత్యుత్తమ మ్యాచ్‌’ ఇంకా రాలేదనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంతగా శ్రమించినా చివరకు ఫలితం లభించదు. అయితే నా ఆటను సెలక్టర్లు గుర్తించారు కాబట్టే టి20ల్లో రెగ్యులర్‌గా మారడంతో పాటు ఇప్పుడు వన్డేల్లోనూ పిలుపు లభించింది. ఇక తక్కువ సమయంలోనే రెండు ప్రపంచకప్‌లలో ఆడే అవకాశం రావడం నా అదృష్టం.  

పేస్‌ బౌలింగ్‌ పదునుపై...
అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్‌ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్‌ నా ‘స్టాక్‌ బాల్‌’ కాగా...అవుట్‌ స్వింగర్లు, ఆఫ్‌ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్‌ఎస్‌ గణేశ్‌ వద్ద కోచింగ్‌ మొదలు పెట్టిన నాకు రైల్వేస్‌ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్‌ అబ్సలమ్‌ వద్ద ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా.

మిథాలీ రాజ్‌ ప్రభావం...
నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్‌ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్‌ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది.  

కరోనా కాలంలో  సుదీర్ఘ విరామంపై...
ఎన్నో ఇతర క్రీడల్లాగే మహిళల క్రికెటర్లందరం కూడా గత ఏడాదంతా ఆటపరంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. టి20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టు సంవత్సరం పాటు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేకపోయింది.   ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌ సౌకర్యాలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోయింది. ఇక ప్రాక్టీస్‌ చేద్దామంటే అకాడమీలూ మూసేశారు. పైగా కరోనాతో భయం కూడా. దాంతో ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. చివరకు నేను ప్రాక్టీస్‌ కోసం వరంగల్‌కు వెళ్లిపోయాను. నా సహచర ప్లేయర్‌ ప్రణీషకు సొంత పిచ్, నెట్స్‌ ఉండటంతో అక్కడకు వెళ్లి సాధన చేసేదాన్ని. ఈ సారి జాగ్రత్తలూ తీసుకుంటూ ఆటపై దృష్టి పెట్టగలుగుతున్నాం.  

‘పాఠాలు నేర్చుకుంటా’
‘ఇటీవల లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్‌’గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను ‘నోబాల్‌’ వేయకుంటే మా జట్టు గెలిచేదేమో’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement