
వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్‌ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్‌ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్‌ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్‌ఏ
ఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్‌ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్‌ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్‌ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.
అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్‌ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్‌ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే.
Comments
Please login to add a commentAdd a comment