indiara gandhi
-
Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది?
సంజయ్ గాంధీ.. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు. సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న జన్మించారు. రాజీవ్ గాంధీ ఈయన సోదరుడు. సంజయ్ గాంధీ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీని కలుసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అది 1973వ సంవత్సరం.. అప్పటికి సంజయ్ గాంధీ వయసు 27 ఏళ్లు. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని సంజయ్ గాంధీ ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికే ఆయన ఇద్దరు యువతులతో ప్రేమ వ్యహారాలు నడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తొలుత సంజయ్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. తరువాత ఆయన జర్మన్ యువతి సబీన్ వాన్ స్టీగ్లిట్జ్ ప్రేమలో పడ్డారు. ఆమె సోనియాగాంధీకి స్నేహితురాలుసోనియా స్నేహితురాలు సబీన్తో..ఆ సమయంలో సబీన్ ఢిల్లీలో టీచర్‌గా పనిచేసేవారు. ఆమె తరచూ రాజీవ్,సోనియాల ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో సంజయ్‌గాంధీ..సబిన్తో మాట్లాడేవారు. కొంతకాలం తరువాత వారిలో చిగురించిన ప్రేమను గమనించిన సోనియా వారిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించారట. అయితే అప్పట్లో సంజయ్ గాంధీ.. మారుతి కారు భారత్‌కు తీసుకురావాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సబీనాతో పెళ్లికి అంత ప్రాథాన్యత ఇవ్వలేదు. దీంతో సబీన్ యూరప్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని విమనాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజయ్ ఆ విమానంలోని పైలెట్‌తో రేడియోలో మాట్లాడి, సబీన్ను తిరిగి రమ్మని అభ్యర్థించారు. అలా ఆమె వెనక్కు వచ్చింది. అయితే తరువాతి కాలంలో సంజయ్- సబిన్ మధ్య విబేధాలు వచ్చి వారు విడిపోయారు.మోడలింగ్ రంగంలో మేనకకు అవార్డులు1973, సెప్టెంబర్ 14న సంజయ్ తన స్నేహితుని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని స్నేహితుడు సంజయ్‌కు మేనకా ఆనంద్ అనే యువతిని పరిచయం చేశారు. ఆమె రిటైర్డ్ సిక్కు కల్నల్ కుమార్తె. మోడలింగ్ చేస్తూ, ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టు కావాలనేది ఆమె కల. అలా పరిచయమైన మేనకతో సంజయ్ ప్రేమలో పడ్డారు. ఇది సంజయ్ అన్నయ్య రాజీవ్ గాంధీ, వదిన సోనియాలకు అంతగా నచ్చలేదు. మేనక ప్రవర్తన వారికి నచ్చలేదు. కొన్నాళ్ల తరువాత సంజయ్ తన తల్లి ఇందిరకు మేనకను పరిచయం చేశాడు. ఇందిరాగాంధీని కలిసే సమయంలో మేనకా చాలా భయపడ్డారు. తొలిసారి ఇందిరను కలుసుకున్న మేనక తాను మోడల్ననే విషయాన్ని ఆమెకు చెప్పలేదు.మేనక గురించి తెలుసుకున్న ఇందిరదీనికి ముందు కూడా సంజయ్ పలువురు యువతులను ఇందిరకు పరిచయం చేశారు. మేనక కూడా ఇలాంటి స్నేహితురాలే అయివుంటుందని ఇందిరా గాంధీ తొలుత భావించారు. అయితే తరువాత సంజయ్ తన తల్లి ఇందిరను ఒప్పించి, మేనకతో తన వివాహానికి 1974, జూలై 29న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ హడావుడిలో ఇందర.. మేనక కుటుంబం గురించి తెలుసుకోలేకపోయారు. నిశ్చితార్థ వేడుక పూర్తయ్యాక, ఇరు కుటుంబాలకు ఇందిర ఇంట్లో విందు జరిగింది. అప్పడు ఇందిర స్వయంగా మేనక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు.భర్తను ప్రధానిగా చూడాలనుకున్న మేనకఅప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇందిర మరేమీ చేయలేక మౌనం వహించారు. 1974, సెప్టెంబర్ 23న సంజయ్ గాంధీ, మేనకా గాంధీల వివాహం జరిగింది. అయితే మేనక ప్రవర్తన సోనియాకు నచ్చేది కాదని వినికిడి. ఏదో ఒకరోజు తన భర్త సంజయ్ ప్రధాని అవుతారని మేనక అందరికీ చెబుతుండేవారట. సంజయ్, మేనకలకు 1980లో వరుణ్‌గాంధీ జన్మించాడు. ఇది జరిగిన మూడు నెలలకు 1980 జూన్‌లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. రెండేళ్ల తరువాత ఇందిరాగాంధీ ఇంటి నుంచి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకుని మరో ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సోనియా, మేనకల మధ్య సత్సంబంధాలు లేవని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు? -
నానమ్మను గుర్తు చేసిన ప్రియాంక.. ఫోటోలు వైరల్
ఉత్తరప్రదేశ్: ఐరన్ లేడీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అనగానే ఆమె హెయిర్ స్టైల్‌తో పాటు ఆమె మెడలో ధరించే రుద్రాక్ష మాల తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. చాలా ఫోటోల్లో ఆమె మెడలోని రుద్రాక్ష మాల స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత సడెన్‌గా ఈ చర్చ ఎందుకంటే.. ప్రస్తుతం ట్విట్టర్లో ప్రియాంక గాంధీ ఫోటోలు తెగ వైరలవుతోన్నాయి. ఇక ఈ ఫోటోలో అందరిని ఆకర్షిస్తోన్నది ఏంటంటే ప్రియాంక చేతికి ధరించి ఉన్న రుద్రాక్ష మాల. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ‘‘మీ నానమ్మని గుర్తు చేశారు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నేడు మౌనీ అమావాస్య సందర్భంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని సాగర సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి.. పూజలు చేశారు. ఆ తర్వాత శంకరాచార్య స్వామీ స్వారూపానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తమ కుమార్తె మిరాయ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరాధనా మిశ్రాతోపాటు మరికొందరితో కలిసి పడవలో ఎక్కి నదిలో విహరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక బుధవారం ప్రియాంక గాంధీ మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా సహారాన్పూర్లో నిర్వహించిన రైతుల మహాపంచాయతీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు నిరసనకారులను ‘‘ఆందోళన్ జీవి’’ అంటూ అవమానించారని ఆరోపించారు. అలానే కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట యమపాశాలని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. ఈ చట్టాలను రద్దు చేస్తానని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ప్రభుత్వం రైతులను అర్థం చేసుకోవడం లేదని.. వారి పక్షాన నిలబడటం లేదని ఆరోపించారు. రైతులను దేశ ద్రోహులంటున్నవారే అసలైన దేశ ద్రోహులని మండిపడ్డారు ప్రియాంక గాంధీ. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే పార్టీని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ తరచుగా రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. చదవండి: కమలపై ప్రియాంక ట్వీట్: 50 ఏళ్ల కిందటే ఏడు గుర్రాల జోడీ -
‘థరూర్ జీ.. ఇండియా గాంధీ ఎవరు?’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దేని గురించైనా చెప్పేటప్పుడు పూర్తి అవగాహనతో, సరైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి. అలా కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, చేతికి దొరికిన ఫోటోను షేర్ చేస్తే.. ఆనక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆంగ్ల భాషపై థరూర్‌కున్న పట్టు ఆమోఘం. కొత్త కొత్త పదాలతో ట్వీట్ చేస్తూ నెటిజనులను అలరిస్తుంటారు శశిథరూర్. అయితే ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు లభిస్తున్న విశేష ఆదరణ గురించి బీజేపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి కౌంటర్ ఇచ్చేందుకు శశిథరూర్ చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. వివరాలు.. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ రష్యా పర్యటన సందర్భంగా తీసిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘1954లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండియా గాంధీ యూఎస్ వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇప్పుడున్నంత ప్రత్యేక పీఆర్ ప్రచారం, మీడియా పబ్లిసిటీ ఏమి లేని రోజుల్లోనే వారిని చూడటానికి ఎంతమంది అమెరికా ప్రజలు వచ్చారో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు శశి థరూర్. ఈ ట్వీట్లో నెటిజన్లు రెండు తప్పిదాలను గుర్తించారు. ఒకటి ఇందిరా గాంధీ పేరును ఇండియా గాంధీగా పేర్కొన్నారు. రెండోది ఫోటోకు సంబంధించిన సమాచారం పూర్తిగా తప్పు. ఈ ఫోటోను 1956 మాస్కో పర్యటన సందర్భంగా తీసింది. ఈ తప్పులను గుర్తించిన నెటిజన్లు శశి థరూర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. Nehru & India Gandhi in the US in 1954. Look at the hugely enthusiastic spontaneous turnout of the American public, without any special PR campaign, NRI crowd management or hyped-up media publicity. pic.twitter.com/aLovXvCyRz — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 ‘థరూర్ జీ ఇండియా గాంధీ ఎవరు’... ‘ఈ ఫోటో 1954 అమెరికాలో తీసింది కాదు.. రష్యా, మాస్కోలో 1956లో తీశారు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై థరూర్ స్పందించారు. ‘ఈ ఫోటో అమెరికాలో తీసింది కాదు.. రష్యాలో తీసిందని నాకు తెలిసింది. మాజీ ప్రధానులకు విదేశాల్లో విశేష జనాదరణ ఉందని చెప్పడమే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. మోదీని గౌరవిస్తున్నారు అంటే దేశాన్ని గౌరవిస్తున్నట్లే ’అంటూ మరో ట్వీట్ చేశారు థరూర్. I am told this picture (forwarded to me) probably is from a visit to the USSR and not the US. Even if so, it still doesn't alter the message: the fact is that former PMs also enjoyed popularity abroad. When @narendramodi is honoured, @PMOIndia is honoured; respect is for India. https://t.co/9KQMcR0zTD — Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019 -
‘నేను ఇందిరను కాదు.. ఆమెలానే సేవ చేస్తాను’
లక్నో : ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ నన్ను నానమ్మతో పోల్చకండి అంటున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కార్యకర్తలు తనను తన నానమ్మ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై స్పందిస్తూ.. ఈ విధంగా వ్యాఖ్యనించారు ప్రియాంక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా నానమ్మతో నన్ను పోల్చడం తగదు. నేను ఏ విషయంలోనూ ఆమెతో పోటీ పడలేను. కానీ ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నానమ్మ మనసులో చాలా బలంగా ఉండేది. అదే లక్షణం నాకు, నా సోదరునికి కూడా అబ్బింది. దాన్ని మాత్రం మా నుంచి ఎవరు వేరు చేయలేరు. అందుకు మీరు అనుమతించినా.. ఇవ్వకపోయినా ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంక బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ ఐదేళ్లలో వారు తమ అభివృద్ధి గురించి ఆలోచించారు తప్ప ప్రజలకు చేసిందేమి లేదని మండిపడ్డారు. బీజేపీ తీరు పట్ల దేశంలో అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం వల్ల నిజంగా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. కాన్పూర్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. కానీ నేటికి ఇక్కడ నిరుద్యోగం, రైతులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లండన్‌లో ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు
లండన్: ఈ రోజు లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట పెంచింది ఇందిరా గాంధీ అన్నారు. "గరీబి హఠావో" నినాదంతో భారత దేశంలో పేదిరిక నిర్ములనకు పునాధులువేసి, దళిత గిరిజన బలహీనవర్గాల అండగా ఉంటూ భూ పంపిణీకి పునుకొని, బ్యాంకుల జాతీయికరణతో పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారని, ఇందిరమ్మ తరతరాలకు ఆదర్శనీయం అని తెలిపారు . దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ, భారత దేశం ఐక్యత, సమీకృత అభివృద్ధి, మత సామరస్యం , పేదల అభ్యుదయo కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అని తెలిపారు . దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకత్వం ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం ఎన్నారైకు చాలా కృషిని అభినందిస్తూ, కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో ప్రతి ఎన్నారై కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల్లో, సంస్కృతి ప్రచారంలో, ప్రజా సమస్యలపై పోరాటంలో లండన్ ఎన్నారై సంస్థలు స్ఫూర్తినీయం అని తెలిపారు. ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. పుట్టుక, చావు మాత్రమే ఇందిరమ్మది, బతుకు అంతా దేశం కోసమే ఇందిరమ్మ కృషి చేశారన్నారు. దేశ ప్రజలకు ఒక దైర్యంగా ఖ్యాతి గాంచారు. దేశ అభివృద్ధిలో ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయ అని కొనియాడారు. కార్యక్రమంలో ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పువ్వులు సమర్పించి చిన్నారుల సమక్షంలో 100 వ పుట్టిన రోజుకు ప్రత్యేకంగా తయారు చేపించిన భారీ కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. వంశీచంద్ రెడ్డి సమక్షంలో ఎన్నారై మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు . అస్ర అంజూమ్, సరిత, జి శ్రీధర్ రెడ్డిలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. సలహాదారులు గంగసాని ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కో కన్వీనర్లు చిట్టెం అచ్యుత రెడ్డి, రంగుల సుధాకర్ గౌడ్, రాకేష్ బిక్కుమళ్ల, మంగళారపు శ్రీధర్ బాబు, అస్ర అంజూమ్, సరిత, పోటాటి శ్రీకాంత్ రెడ్డి, కొత్త రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నర్సింహా రెడ్డి జాన్సర్, బలరాం, హితేష్ గుప్తా, సుదర్శన్ రెడ్డి, గట్ట మధులు ఇందిరమ్మ గురించి ప్రసంగించి కార్యక్రమం విజయవంతం లో కీలకపాత్ర పోషించారు. అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు లండన్ విచ్చేసిన వంశీ చంద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
నృత్య నూతనం
‘థాంక్యూ ఇందిరా! ఐ హావ్ సీన్ కంప్లీట్ ఇండియా ఇన్ రాధా అండ్ రాజారెడ్డీస్ డ్యాన్స్ ఇన్క్లూడింగ్ యూ’.. ఇది ఫిడెల్ క్యాస్ట్రో కూచిపూడి కపుల్ రాధారెడ్డి, రాజారెడ్డిల కూచిపూడి ప్రదర్శన గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చెప్పిన మాటలు. ఇంతకుమించిన కితాబు ఇటు కూచిపూడికి, అంతకన్నా గొప్ప పరిచయం అటు ఆ జంటకూ ఉండదేమో! తమ జీవననృత్యం గురించి సిటీప్లస్‌తో ముచ్చటించారు. ప్రణయమూర్తులనగానే పురాణాల్లోని రాధాకృష్ణులు, రతీమన్మథులు ఎలా గుర్తొస్తారో.. కూచిపూడి లాస్యంలో లయబద్ధంగా సాగిపోయే జంట అనగానే రాధా, రాజారెడ్డిలు కనిపిస్తారు. అందుకేనేమో ‘మేమిద్దరం కూచిపూడిని పెళ్లాడాం’ అంటారు రాజారెడ్డి. భార్యభర్తల అభిరుచులు ఒకటే అయి.. అవి వారికి ప్రాణమైతే ఆ కాపురం ఆదర్శ ప్రాయం అవుతుంది. కలహకలాపాలు.. నాట్యానికి గుర్తింపు లేని ప్రాంతంలో, కుటుంబాల్లో పుట్టిన ఈ ఇద్దర్ని కలిపింది మూడుముళ్ల బంధం. ఒక్కరిగా మారిన ఆ ఇద్దరి ధ్యాస నాట్యం మీదే. కూచిపూడిని ఆరాధిస్తూ సాగిన ఆ జీవితం.. ఆనంద లాస్యమైంది. ఈ కాపురంలో కలహాలు భామాకలాపంతో చల్లబడితే, గిల్లికజ్జాలు తరంగంతో సద్దుమణుగుతాయి. ‘రాధకు జెలసీ ఎక్కువ. నా కన్నా బాగా కనపడాలని, నాట్యంలో నన్ను ఓడించాలని, వేదికపై ఎవరినీ లెక్క చేయదు. అలా నాట్యంలో లీనమై పోతుంది. విలువైన సలహాలిస్తుంది’ అని తన భార్య గొప్పదనాన్ని ప్రశంసిస్తారు రాజారెడ్డి. ‘ఆయన కంపోజిషన్‌లో నాకు నచ్చనిది ఉంటే చేయను. అలాగే అతని నాట్యంలో కాని, మేకప్‌లో కాని ఫలానాది బాగా లేదు అంటే అంతే వినయంగా దాన్ని సరిదిద్దుకుంటాడు’ అని భర్తలోని వినమ్రతను మెచ్చుకుంటారు రాధారెడ్డి. నాట్య సంగమం.. నిజానికి రాధారెడ్డికి నాట్యం నేర్పిందే రాజారెడ్డి. ‘ ఈ రెబల్ స్టూడెంట్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు నా మాస్టార్’ అంటూ భర్త సహకారాన్ని గుర్తు చేసుకుంటారామె. ‘మా మధ్య తగాదా ఏ వంటగదిలోనో, హాల్లోనో మొదలుకాదు..గ్రీన్‌రూమ్‌లో స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్తో ఎండ్ అవుతుంది. మా పంతం నాట్యంతోనే నెగ్గించుకుంటాం’ అని జీవననృత్యం వెనుక ఉన్న సత్యాన్ని వివరిస్తారు రాజారెడ్డి. ఆయనకు నాట్యం, వైవాహిక బంధం రెండూ ఒకటే. ‘అందుకే మా జంట అంతగా కుదిరింది. ఇన్నేళ్లయినా మా జీవితం తాజాగా కనబడుతోంది’ అంటారు. రాధారెడ్డి మాత్రం ‘నాకు నాట్యం వేరు, మా జీవితం వేరు. ప్రదర్శనప్పుడు ఆయన నాకు పార్ట్నర్ మాత్రమే. ఇంట్లో నా భర్త. ఈ తేడాను చూస్తాను కాబట్టే రాజా నాకెప్పటికప్పుడు కొత్తగా క నిపిస్తాడు. మా సక్సెస్ సీక్రెట్ ఆ కొత్తదనమే’ అని చెప్తారు. సప్తపది.. ఇష్టపది.. ‘డ్యాన్స్ అని భార్యని పట్టుకుని ఊరు కాని ఊరు పోతున్నవ్? ఎట్ల బతుకుతర్రా? ఆ డ్యాన్సేమన్నా కూటికొచ్చేదా?’ అని రాజారెడ్డి పెద్దలు ఆయనను హెచ్చరించారు. ‘గజ్జె కట్టుకొని ఇంటింటికి పొయ్యి ఆడతాడట.. ఇసంటోడు మనకొద్దు..’ అని రాధారెడ్డికి వాళ్ల పెద్దలూ నచ్చచెప్పారు. ఆ పెద్దల మాట చెల్లలేదు. ఏడడుగులతో ఒక్కటైన ఈ జంట ఏడేడు జన్మల బంధానికి దారి ఏర్పరచుకుంది. కూచిపూడిలో తామేంటో నిరూపించు కుంది. అలీనోద్యమ సమావేశాలప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడిని చివరన ఏర్పాటు చేస్తే.. మనసారా ఆస్వాదించొచ్చు అని అభ్యర్థించారు. వన్స్‌మోర్ వన్స్‌మోర్ అంటూ పదిసార్లు ఈ జంటకాళ్లకు గజ్జె కట్టించారు. ‘మీరసలు ఢిల్లీ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు’ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆప్యాయతతో వాళ్లను ఆజ్ఞాపించింది. ‘రాధా.. నువ్ కాస్త పొట్టిగా ఉంటావ్, పెద్దంచు చీర కట్టకు’ అని ప్రేమతో సలహాలిచ్చే సన్నిహితురాలిని చేసింది వీళ్ల ప్రతిభే. ప్రతి ప్రదర్శన హనీమూనే.. ‘ఏ జంటకైనా హనీమూన్ ఒక్కసారే. కానీ మాకు ప్రతిప్రదర్శన హనీమూనే’ అంటారు రాజారెడ్డి. ‘డ్యాన్స్ లేకపోతే నేనెంత లేనో.. రాజా లేకపోతే కూడా అంతే శూన్యం’ అని చెప్తారు రాధారెడ్డి. - సరస్వతి రమ