indiramma house bills
-
ఆరంభించని ఇందిరమ్మ ఇళ్లు.. రద్దు!
సాక్షి, విజయవాడ: నిర్మాణం మొదలైన ఇళ్లు సగంలోనే ఆగిపోయాయి. నిధులకు బ్రేకులు పడ్డాయి. మరోవంక... నిర్మాణం మొదలుకాని ఇళ్లకు మంగ ళం పాడేయటానికి కూడా రెడీ అయిపోయారు. ఇదీ... ఇందిరమ్మ ఇళ్ల దుస్థితి. ఎన్నికలు... ప్రభుత్వం మారటం వంటి కారణాలతో మార్చి నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులన్నీ నిలిపేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.363.66 కోట్ల విడుదల ఆగిపోయింది. పులిమీద పుట్రలా 2011కు ముందు మంజూరై ఇప్పటి దాకా ప్రారంభించని ఇళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పిడుగు పాటే. రాష్ట్రంలో 2011 మార్చికి ముందు మంజూరై ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభం కాని పక్కా ఇళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి నివేదికలు పంపాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతా వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
కుటుంబంలో చిచ్చుపెట్టిన ‘ఇందిరమ్మ’ బిల్లు
దమ్మన్నపేట(వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : ఓ వృద్ధుడి పేర మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు అతడి కొడుకుల మధ్య చిచ్చుపెట్టింది. చిన్న కొడుకు బిల్లు తీసుకున్నాడంటూ పెద్ద కొడుకు తండ్రిని ఇంట్లోకి రానివ్వని సంఘటన మండలంలోని దమ్మన్నపేటలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామానికి చెందిన న్యాళం కొమురయ్య(70)కు మొగిళి, ఎల్లగౌడ్, సదయ్యగౌడ్ ముగ్గురు కొడు కులున్నారు. వారు వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొమురయ్య భార్య లచ్చమ్మ పదేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి ఆయన నెల రోజు లకు ఒకరి చొప్పున కొడుకుల వద్ద ఉంటున్నా డు. ఎక్కువ కాలం చిన్నకుమారుడు సదయ్య వద్ద ఉండడంతో అతడి రేషన్‌కార్డులో కొమురయ్య పేరు నమోదైంది. తండ్రి పేరిట మంజూరైన ఇందిరమ్మ పథకం కింద సదయ్య ఇల్లు కట్టు కున్నాడు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించిన డబ్బులను తమకు ఇస్తేనే తిండి పెడుతామని కొమురయ్యతో మొగిళి, ఎల్లగౌడ్ తేల్చిచెప్పారు. నెలరోజులు చిన్న కొడుకు సదయ్య వద్దనే ఉన్న కొమురయ్య ఇటీవల పెద్ద కొడుకు వద్దకు వెళ్లగా పట్టించుకోలేదు. దీంతో ఆయన గ్రామంలోని పెద్దమనుషుల వద్ద తన గోడు ను వెల్లబోసుకున్నాడు. తండ్రి బాధ్యతను ముగ్గురు కొడు కులు సమానంగా చూసుకోవాలని వారు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మనోవేదనకు గురైన కొమురయ్య గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగాడు. కొడుకులకు ఎంత సర్ధిచెప్పినా తనను పట్టించుకోవడం లేద ని, తనకు న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన వారిని వేడుకోవడం అందరిని కలచివేసింది. చివరికి రెండో కుమారుడు ఎల్లగౌడ్ తండ్రిని తనవెంట తీసుకెళ్లాడు. -
‘ఇందిరమ్మ’ బిల్లుల అవకతవకలపై విచారణ
మంచాల, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాల నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మండల పరిధి దాద్‌పల్లి గ్రామం, వెంకటేశ్వర తండాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై ఈ నెల 5న సాక్షి దినపత్రికలో ‘గుటకాయస్వాహా!’ శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. హౌసింగ్ జిల్లా తూర్పు డివిజన్ ఈఈ పరిపూర్ణాచారి, జిల్లా ప్రత్యేక హౌసింగ్ అధికారి ఎస్.విజయ్, ఏఈ రాంచంద్రయ్య శుక్రవారం మధ్యాహ్నం దాద్‌పల్లి గ్రామానికి వచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. బాధితురాలు మందుల బీరమ్మ ను విచారించగా... ఇల్లు బేస్మెంట్ వరకు కట్టినా నయాపైసా బిల్లు ఇవ్వలేదని తెలిపింది. ఉపసర్పంచ్ నర్సింగ్‌రావు తన బ్యాంకు ఖాతా పుస్తకం తీసుకెళ్లారని, తనకు తెలియకుండానే తన ఖాతాలో రూ.43,650 జమకాగా వాటిని తీసుకున్నారని ఆరోపించింది. తాను ఇల్లు పూర్తిగా కట్టుకోకున్నా డబ్బులు ఎందుకు తన ఖాతాలో జమ చేశారు, వాటిని వేరేవారికి బ్యాంకు అధికారులు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసింది. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది. అనంతరం హౌసింగ్ అధికారులు వెంకటేశ్వరతండాకు వెళ్లి జాట్రోత్ మారు అనే గిరిజన మహిళను విచారించారు. తనకు బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉందని, ఇంతవరకూ ఇల్లు కట్టుకోలేదని తెలిపింది. అయితే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పడంతో ఎంపీటీసీ మాజీ సభ్యుడు వెంకటేశ్‌గౌడ్‌కు బ్యాంకు ఖాతా పుస్తకం ఇచ్చానని, తనకు తెలియకుండానే ఖాతాలో జమ అయిన రూ.65వేలు తీసుకున్నారని అధికారుల దృష్టికి తెచ్చింది. ఇరువురు బాధితుల నుంచి హౌసింగ్ అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదులు తీసుకున్నారు. వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా అధికారుల విచారణ తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఏదో కంటితుడుపు చర్యగా ఇద్దర్ని విచారించి వెళ్లిపోవడం తగదని, బాధితులందర్నీ కలిసి విషయం తెలుసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.