ప్రభుత్వ బ్యాంకుల కోసం త్వరలో ‘ఇంద్రధనుష్ 2.0’
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా పరిపుష్టం చేసి, బాసెల్–3 మూలధన నిబంధనలకు అనుగుణంగా వాటిని రీక్యాపిటలైజేషన్ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇంద్రధనుష్ 2.0’ అనే సమగ్ర పథకాన్ని ప్రకటించనుంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష (ఏక్యూఆర్) మార్చి చివరి నాటికి పూర్తవుతుందని, అనంతరం ఇంద్రధనుష్ 2.0ను ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనకు ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షను 2015 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగా రుణాలు చెల్లించడంలో విఫలమైన పెద్ద ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) గుర్తించి, అందుకు తగిన మొత్తంలో నిధుల కేటాయింపులను ఖాతాల్లో చూపించాలని కోరింది.
ఇందుకోసం 2017 మార్చిని గడువుగా విధించింది. ఆర్బీఐ చేపట్టిన ఆస్తుల నాణ్యత సమీక్ష ముగిసిన వెంటనే ఇంద్రధనుష్ 2.0 కింద బ్యాంకులకు సంబంధించి సవరించిన మూలధన కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2015లో ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ రోడ్ మ్యాప్ ప్రకారం నాలుగేళ్ల కాల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయం అందుతుంది. బాసెల్–3 మూలధన అవసరాలకు, అంతర్జాతీయ రిస్క్ నిబంధనలకు అదనంగా ప్రభుత్వ సాయానికి అదనంగా బ్యాంకులు రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది.