బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్‌కు వాటాలున్నాయి. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్‌లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్‌లో బీపీసీఎల్‌కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి.
దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్‌కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్‌యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది.