న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 416 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,01 కోట్లు ఆర్జించింది. సహజవాయు ధరలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 3,922 కోట్లను తాకింది.
గత క్యూ2లో రూ. 2,016 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు 100 శాతం పెరిగిపోయినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో నేచురల్ గ్యాస్ కొనుగోలు వ్యయాలు రూ. 930 కోట్ల నుంచి రూ. 2,610 కోట్లకు ఎగశాయి. అయితే గ్యాస్ రోజువారీ సగటు అమ్మకాలు 7.24 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల నుంచి 8.09 ఎంఎంఎస్‌సీఎండీకి బలపడినట్లు వెల్లడించింది. సీఎన్‌జీ అమ్మకాలలో 15 శాతం, పైప్‌డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ) విక్రయాలలో 3 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment