‘స్కిల్ ఇండియా’పై పర్యవేక్షణ అవసరం
⇒ కేంద్ర హోంశాఖమాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య
⇒ ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ స్కిల్ సమ్మిట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల అమలు తీరుపై నిత్యపర్యవేక్షణ అత్యవసరమని, తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. స్కిల్ ఇండియా పేరుతో రెండేళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు కొత్తేమీ కాదని.. వేర్వేరు రూపాల్లో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.
‘ద ఇండస్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైన ఇండో గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్ ఎక్స్పో – 2017’కు పద్మనాభయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రానున్న ఐదేళ్లలో 1.27 కోట్ల ఉద్యోగులకు డిమాండ్ ఉంటుందని.. అయితే ప్రస్తుతమున్న ఉద్యోగుల్లోనే తగిన శిక్షణ పొందిన వారు 4.7 శాతం మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఉద్యోగుల్లోని తగిన శిక్షణ లేని వారితోపాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి బయటకొస్తున్న పట్టభద్రులకూ భిన్న అంశాల్లో నైపుణ్యాలు అందించాల్సి ఉందని అన్నారు. 2022 నాటికి ఒక్క నిర్మాణ రంగంలోనే దాదాపు మూడు కోట్ల మంది నిపుణుల అవసరముంటుందని పద్మనాభయ్య వివరించారు.
పాఠశాల స్థాయి నుంచే..:
ఆంధ్రప్రదేశ్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వేర్వేరు అంశాలపై నైపుణ్యాన్ని కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో కె.వి.సత్యనారాయణ తెలిపారు. 2022 నాటికల్లా కనీసం రెండు కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ‘ద ఇండస్ గ్లోబల్’అధ్యక్షుడు ఎస్.బి.అనుమోలు, చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి సి.డి.అర్హ, బియర్డ్సెల్ లిమిటెడ్ ఎండీ భరత్ అనుమోలు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో జరిపిన కృషికి గాను పలువురికి కె.పద్మనాభయ్య అవార్డులు అందజేశారు.