పరిశ్రమలకు సత్వరం అనుమతులివ్వండి
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. సింగిల్ విండో విధానానికి సంబంధించి పది రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటే అరవై ఐదు రోజులపాటు మీ వద్దనే ఉంచుకుంటున్నారు. చివరకు వాటిలో ఏదో ఒకటి మిస్సైందంటూ పక్కన పెట్టేస్తున్నారు. ఇలా పనిచేస్తే జిల్లాకు ఎక్కడ నుంచి పెట్టుబడులు వస్తాయని’ కలెక్టర్ విజయకుమార్ పరిశ్రమలశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సమయంలో వచ్చిన వాటిని పరిశీలించి ఏమైనా ఫారాలు అందించకుంటే వెంటనే అందించేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేయడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి శనివారం అధికారులు తమ కార్యాలయాల్లో ఉండి దరఖాస్తులను స్క్రూట్నీ చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎంఈజీపీ పథకం కింద 237 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఒక్క బ్యాంకు ద్వారా కాకుండా అన్ని బ్యాంకులకు లక్ష్యాలు కేటాయించి యూనిట్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధానానికి ఎల్డీఎం కంట్రోలింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మురళీమోహన్తోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.