‘వాళ్లు’ నిద్రపోతూ పని చేస్తారు!
జపాన్ వాళ్లకు పని రాక్షసులని పేరు. వాళ్లు పని కోసం నిద్రను కూడా త్యాగం చేస్తారంటారు. మరి నిజంగానే నిద్ర పోకపోతే ఆరోగ్యం ఏం కావాలి? జపాన్ వాళ్లు నిద్రే పోరనేది అబద్ధం. అయితే రాత్రవుతూనే మంచం మీద చేరి, సూర్యోదయమవుతూనే మెలకువలోకి రావడం అనే భావనను మాత్రమే వాళ్లు నిద్రగా భావించరు.
బస్సులో నిలబడి ప్రయాణిస్తూ, రైలు కోసం ఎదురుచూస్తూ, లిఫ్టులో పదమూడో అంతస్తుకు ఎక్కుతూ కూడా వాళ్లు ఒక కునుకు తీస్తారు. పోతూ పోతూ ఏదైనా గోడ కనబడితే దానికి చేతిని ఆనించి కూడా ఒక కునుకు తీసి వెళ్తారు. దీన్నే జపాన్లో ‘ఇనెమురి’ అంటారు. నిద్రపోతూనే హాజరుగా ఉండటం అని దీనికి అర్థం చెప్పొచ్చు.
క్లాసులో పాఠం వింటూ, మీటింగులో భాగస్వామి అవుతూ కూడా వాళ్లు ఇనెమురి చేస్తారు. మన దగ్గర కూడా అట్లా చాలామంది పడుకుంటారుగదా అనొచ్చు. అట్లా పడుకునేవాళ్లకు ఆపాదించే గౌరవం ఎంత? కానీ అదే జపనీయులు దాన్ని తక్కువగా చూడరు. సామాజికంగా దానికి ఆమోదం ఉంది. యుద్ధం తర్వాత, ఎక్కువ పని చేయడం గొప్ప గుణం అనే భావనలోంచి ఈ విధానం పుట్టింది. అందుకే, ఎవరైనా అలా నిద్ర పోతున్నారంటే, ‘పాపం, రాత్రంతా బాగా పనిచేసివుంటాడు’ అని సంశయలబ్ధిని వాళ్లు ఇస్తారు.
‘ఈ ఇనెమురి మనం అనుకునే నిద్రలాంటిది కాదు; అలాగని మధ్యాహ్నపు కునుకు కాదు; అది జపాన్కే ప్రత్యేకమైన నిద్రా విధానం. నిద్ర కాని నిద్ర’ అంటారు జపనీయుల నిద్ర అలవాట్ల మీద అధ్యయనం చేసిన డాక్టర్ బ్రిగిట్ స్టెగార్. ‘ఆయా సాంఘిక సందర్భంలో నిష్క్రియత్వంతో పాల్గొంటూనే, తమ వంతు వచ్చినప్పుడు ఠక్కున భాగస్వామి కావడం ఇందులో ఉన్న కిటుకు,’ అంటారు స్టెగార్.
ఇంకొక అంశం ఏమిటంటే, చాలామంది సరిగ్గా నిద్ర పోవాలంటే తమకు ఏకాంతం కావాలంటారు. కానీ జపనీయులు ఇతరుల కంపెనీలో కూడా నిద్రను ఆనందిస్తారు. భూకంపం, సునామీ లాంటివి జపాన్లో సంభవించినప్పుడు కూడా ఇట్లా బహిరంగ సమూహాలుగా నిద్రపోగలగడం వారిని ఉపశమించేలా చేయగలిగింది.