Infection rate
-
Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు!
ముంబై: జనవరి మూడో వారం నాటికి మహారాష్ట్రలో రెండు లక్షల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావచ్చని అడిషనల్ చీఫ్ సెక్రటరీ డా. ప్రదీప్ వ్యాస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ మూడో వేవ్ ప్రమాదకారి కాదని ప్రజలు నిర్లక్ష్యం వహించడం తగదని, వ్యాక్సిన్ వేయించుకోనివారికి ప్రాణాంతకం కావొచ్చని, వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాడు 9,170 కరోనావైరస్ కొత్త కేసులు నమోదవ్వగా, ఏడుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గత 11 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియల హాజరుపై గురువారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. తాజా ఆంక్షల ప్రకారం వివాహాలు లేదా ఏదైనా ఇతర సామాజిక, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 50 మందికి మించకూడదు. అలాగే అంత్యక్రియలకు హాజరయ్యేవారి గరిష్ట సంఖ్య 20కి పరిమితం చేయబడింది. సోమవారంనాటికి దేశంలోనే అధిక సంఖ్యలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
థర్డ్ వేవ్?.. ఆర్–వాల్యూ 1 దాటితే డేంజర్ బెల్స్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే థర్డ్ వేవ్ ఆందోళన మొదలైంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ రేటు ఆర్–నెంబర్ బాగా పెరిగిపోతూ ఉండడంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదేమోనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ ఆఖరి వారం వరకు ఆర్–నెంబర్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడంతో ఇన్నాళ్లూ ఇంటిపట్టునే ఉన్న జనం పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల బాట పట్టడంతో సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏమిటీ ఆర్–నెంబర్ ఒక కోవిడ్ రోగి నుంచి ఎంత మందికి వైరస్ సంక్రమిస్తుందో ఆర్– నెంబర్ ద్వారా తెలుస్తుంది. మే 15 నాటికి ఆర్–నెంబర్ 0.78 నుంచి జూన్ 26 వచ్చేసరికి 0.88కి పెరిగిపోయిందని చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అధ్యయనం వెల్లడించింది. ఈ ఆర్–వాల్యూ 1 దాటితే కరోనా డేంజర్ బెల్స్ మోగినట్టుగానే భావించాలి. అప్పుడు కరోనా కేసులు మరింతగా వ్యాప్తి చెందుతాయి. మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సితాభ్ర సిన్హా చెప్పారు. ప్రతీ 100 మంది కోవిడ్ రోగుల నుంచి మేలో సగటున 78 మందికి వైరస్ సోకితే, అది ఇప్పుడు 88కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసులు తగ్గుదల నిలిచిపోయింది. కేరళ, మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మన దేశంలో కేరళ, మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్–వాల్యూ ఒకటి కంటే తక్కువగానే ఉంది. కేరళలో ఈ ఆర్–వాల్యూ 1.1గా ఉంటే మహారాష్ట్రలో 1గా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడో వంతు కేరళ నుంచే వస్తున్నాయి. 50శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. కేరళలో 14 జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ రాష్ట్రం నుంచి ఒక్కో రోజు 15 వేల కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, మేఘాలయా, మణిపూర్, మిజోరంలలో కేసుల్లో పెరుగుదల ఉంది. కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట గోవా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ’దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రతీ రోజూ 40 వేలు దాటి కేసులు రావడం చిన్న విషయం కాదు. ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసుల్ని చూసిన మనకి ఈ సంఖ్య చిన్నదిగా అనిపించవచ్చు. కానీ వరుసగా కొద్ది రోజుల పాటు 10వేలకు దిగువకి కేసులు వచ్చినప్పుడే మనం సురక్షితంగా ఉన్నట్టు. దీనికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. ’ –వి.కె.పాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ కన్వర్ యాత్ర సూపర్ స్ప్రెడర్గా మారనుందా? కరోనా రెండో వేవ్‌కి ముందు ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకి అనుమతినివ్వడం వివాదాస్పదమైంది. ఇప్పుడు అదే తప్పు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తోంది. కోవిడ్ హాట్ స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ జూలై 25 నుంచి 15 రోజుల పాటు జరగనున్న కన్వర్ యాత్రకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అనుమతులిచ్చారు. కన్వర్ యాత్ర అంటే శివభక్తులు హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి పవిత్ర జలాల్ని కావడలతో మోసుకుంటూ వెళ్లి తమ స్వగ్రామాల్లో ఉండే శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా నుంచి కోట్లాది మంది హరిద్వార్‌కి వచ్చి గంగా జలాలను తీసుకువెళతారు. గతంలో ఈ యాత్రకి 2 నుంచి 5 కోట్ల మంది వరకు హాజరైనట్టుగా ఒక అంచనా. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు ఈ యాత్రకి హాజరైతే ఆచరణలో నిబంధనలు పాటించడం అసాధ్యమని ఉత్తరాఖండ్ సామాజికవేత్త అనూప్ నౌటియాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కుంభమేళాకి 30 రోజుల్లో 70 లక్షల మంది హాజరైతే కన్వర్ యాత్ర జరిగే 15 రోజుల్లోనే 3 నుంచి 4 కోట్ల మంది వరకు హాజరు కావచ్చునని ఈ యాత్ర కరోనా వైరస్‌ని మరింతంగా వ్యాప్తి చేస్తుందని ఆందోళనలైతే ఉన్నాయి. తీర్థ సింగ రావత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ యాత్రని రద్దు చేస్తే ధామి అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారు. ఈ యాత్రని రద్దు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని, వారి ప్రాణాలకే భద్రత కల్పించడానికే తాము ప్రాధాన్యతనిస్తామని ధామి చెప్పుకొచ్చారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీలో మరింత తగ్గిన ఇన్ఫెక్షన్ రేటు
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇన్ఫెక్షన్ రేటు నియంత్రణ, పాజిటివ్ కేసుల తగ్గుదల శాతంలోనూ ముందడుగు వేసింది. తాజాగా రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చూస్తే రోజురోజుకు ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాటి గణాంకాల ప్రకారం ఏపీలో 74,551 టెస్టులు చేయగా.. 1,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఇన్ఫెక్షన్ రేటు కేవలం 1.58 శాతం మాత్రమే ఉన్నట్టు నమోదైంది. దేశంలో సగటు ఇన్ఫెక్షన్ రేటు 4.20 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటి వరకూ 6,65,819 టెస్టులు చేయగా 27,964 పాజిటివ్ కేసులు తేలాయి. అత్యధిక ఇన్ఫెక్షన్ రేటు మధ్యప్రదేశ్‌లో నమోదైంది. ఒక్కరోజులో 6,517 టెస్టులు సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 6517 టెస్టులు చేశారు. మొత్తం 80 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో పాజిటివ్ కేసుల శాతం 1.22 శాతంగా నమోదైంది. 86 శాతం కేసులు మూడు జిల్లాల్లోనే సోమవారం నమోదైన కేసులు కూడా రెడ్జోన్లలోనే నమోదయ్యాయి. మొత్తం 80 కేసుల్లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే 69 కేసులున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల్లోనే 86.25 శాతం కేసులు నమోదయినట్లయింది. ఏపీలో లెక్కలు ఇలా ► తాజా పాజిటివ్ కేసుల ప్రకారం రాష్ట్రంలో 20 శాతం రికవరీ రేటు నమోదైంది ► మృతుల రేటు 3.8 నుంచి 2.83కు తగ్గింది ► సగటున పది లక్షల జనాభాకు 1396 మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు ► దేశంలో పది లక్షల జనాభాకు 480 టెస్టులు జరుగుతున్నాయి ► కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంటెయిన్మెంట్ నియంత్రణకు మరింత పకడ్బందీ చర్యలు. -
రోజుకో రంగు!
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో రంగుల దుప్పట్లు ►14 దవాఖానలు.. 6477 పడకలకు 33708 దుప్పట్లు సిద్ధం ►నేడు పంపిణీ చేయనున్న మంత్రులు సిటీబ్యూరో: సర్కారు దవాఖానాలన్నీ ఇక రంగులమయం కానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్రేటును తగ్గించడంతో పాటు వాటిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటు గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గులాబి, మంగళవారం తెలుపురంగు, బుధవారం లేత నీలంరంగు, గురువారం ముదురు నీలం రంగు....ఇలా రోజుకో కలర్ దుప్పటి చొప్పున రోగులకు అందించనున్నారు. ఈ మేరకు నగరంలోని 14 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6477 పడకల కోసం 33708 దుప్పట్లను సిద్ధం చేశారు. పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. aరంగుల దుప్పట్ల కారణంగా పడకలపై చద్దర్లను మారుస్తున్న విషయం రోగులకు ఇట్టే అర్థం అవుతుంది. రోజులతరబడి ఒకే దుప్పటి ఉంచడానికి వీలుండదు. కాగా సోమవారం ఉదయం 8 గంటలకు గాంధీ ఆస్పత్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రంగుల దుప్పట్లను రోగులకు అందజేయనుండగా, ఉస్మానియాలో ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ పి.కృష్ణమూర్తి రోగులకు రంగుల దుప్పట్లను అందజేయనున్నారు. ఇక మిగతా ఆస్పత్రుల్లో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోనికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొంటారు.