
రోజుకో రంగు!
►ప్రభుత్వ ఆస్పత్రుల్లో రంగుల దుప్పట్లు
►14 దవాఖానలు.. 6477 పడకలకు 33708 దుప్పట్లు సిద్ధం
►నేడు పంపిణీ చేయనున్న మంత్రులు
సిటీబ్యూరో: సర్కారు దవాఖానాలన్నీ ఇక రంగులమయం కానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌రేటును తగ్గించడంతో పాటు వాటిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటు గా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గులాబి, మంగళవారం తెలుపురంగు, బుధవారం లేత నీలంరంగు, గురువారం ముదురు నీలం రంగు....ఇలా రోజుకో కలర్ దుప్పటి చొప్పున రోగులకు అందించనున్నారు. ఈ మేరకు నగరంలోని 14 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6477 పడకల కోసం 33708 దుప్పట్లను సిద్ధం చేశారు. పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
aరంగుల దుప్పట్ల కారణంగా పడకలపై చద్దర్లను మారుస్తున్న విషయం రోగులకు ఇట్టే అర్థం అవుతుంది. రోజులతరబడి ఒకే దుప్పటి ఉంచడానికి వీలుండదు. కాగా సోమవారం ఉదయం 8 గంటలకు గాంధీ ఆస్పత్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రంగుల దుప్పట్లను రోగులకు అందజేయనుండగా, ఉస్మానియాలో ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ పి.కృష్ణమూర్తి రోగులకు రంగుల దుప్పట్లను అందజేయనున్నారు. ఇక మిగతా ఆస్పత్రుల్లో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోనికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొంటారు.