థర్డ్‌ వేవ్‌?.. ఆర్‌–వాల్యూ 1 దాటితే డేంజర్‌ బెల్స్‌! | Third wave of COVID-19 definitely underway | Sakshi
Sakshi News home page

థర్డ్‌ వేవ్‌?.. ఆర్‌–వాల్యూ 1 దాటితే డేంజర్‌ బెల్స్‌!

Published Mon, Jul 12 2021 3:24 AM | Last Updated on Mon, Jul 12 2021 8:25 AM

Third wave of COVID-19 definitely underway - Sakshi

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే థర్డ్‌ వేవ్‌ ఆందోళన మొదలైంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమణ రేటు ఆర్‌–నెంబర్‌ బాగా పెరిగిపోతూ ఉండడంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదేమోనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ ఆఖరి వారం వరకు ఆర్‌–నెంబర్‌ రేటు తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడంతో ఇన్నాళ్లూ ఇంటిపట్టునే ఉన్న జనం పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల బాట పట్టడంతో సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఏమిటీ ఆర్‌–నెంబర్‌  
ఒక కోవిడ్‌ రోగి నుంచి ఎంత మందికి వైరస్‌ సంక్రమిస్తుందో ఆర్‌– నెంబర్‌ ద్వారా తెలుస్తుంది. మే 15 నాటికి ఆర్‌–నెంబర్‌ 0.78 నుంచి జూన్‌ 26 వచ్చేసరికి 0.88కి పెరిగిపోయిందని చెన్నైలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ అధ్యయనం వెల్లడించింది. ఈ ఆర్‌–వాల్యూ 1 దాటితే కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగినట్టుగానే భావించాలి. అప్పుడు కరోనా కేసులు మరింతగా వ్యాప్తి చెందుతాయి. మూడో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సితాభ్ర సిన్హా చెప్పారు. ప్రతీ 100 మంది కోవిడ్‌ రోగుల నుంచి మేలో సగటున 78 మందికి వైరస్‌ సోకితే, అది ఇప్పుడు 88కి పెరిగింది. దీంతో యాక్టివ్‌ కేసులు తగ్గుదల నిలిచిపోయింది.  


కేరళ, మహారాష్ట్రలో డేంజర్‌ బెల్స్‌
మన దేశంలో కేరళ, మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్‌–వాల్యూ ఒకటి కంటే తక్కువగానే ఉంది. కేరళలో ఈ ఆర్‌–వాల్యూ 1.1గా ఉంటే మహారాష్ట్రలో 1గా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడో వంతు కేరళ నుంచే వస్తున్నాయి. 50శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి.
కేరళలో 14 జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ రాష్ట్రం నుంచి ఒక్కో రోజు 15 వేల కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, మేఘాలయా, మణిపూర్, మిజోరంలలో కేసుల్లో పెరుగుదల ఉంది.  

కరోనా హాట్‌ స్పాట్‌ రాష్ట్రాలు
కేరళ, మహారాష్ట గోవా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌   ’దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రతీ రోజూ 40 వేలు దాటి కేసులు రావడం చిన్న విషయం కాదు. ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసుల్ని చూసిన మనకి ఈ సంఖ్య చిన్నదిగా అనిపించవచ్చు. కానీ వరుసగా కొద్ది రోజుల పాటు 10వేలకు దిగువకి కేసులు వచ్చినప్పుడే మనం సురక్షితంగా ఉన్నట్టు. దీనికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. ’    
–వి.కె.పాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌

కన్వర్‌ యాత్ర సూపర్‌ స్ప్రెడర్‌గా మారనుందా?
కరోనా రెండో వేవ్‌కి ముందు ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకి అనుమతినివ్వడం వివాదాస్పదమైంది. ఇప్పుడు అదే తప్పు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చేస్తోంది. కోవిడ్‌ హాట్‌ స్పాట్‌ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ జూలై 25 నుంచి 15 రోజుల పాటు జరగనున్న కన్వర్‌ యాత్రకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అనుమతులిచ్చారు. కన్వర్‌ యాత్ర అంటే శివభక్తులు హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి పవిత్ర జలాల్ని కావడలతో మోసుకుంటూ వెళ్లి తమ స్వగ్రామాల్లో ఉండే శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా నుంచి కోట్లాది మంది హరిద్వార్‌కి వచ్చి గంగా జలాలను తీసుకువెళతారు. గతంలో ఈ యాత్రకి 2 నుంచి 5 కోట్ల మంది వరకు హాజరైనట్టుగా ఒక అంచనా.

కోవిడ్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు ఈ యాత్రకి హాజరైతే ఆచరణలో నిబంధనలు పాటించడం అసాధ్యమని ఉత్తరాఖండ్‌ సామాజికవేత్త అనూప్‌ నౌటియాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కుంభమేళాకి 30 రోజుల్లో 70 లక్షల మంది హాజరైతే కన్వర్‌ యాత్ర జరిగే 15 రోజుల్లోనే 3 నుంచి 4 కోట్ల మంది వరకు హాజరు కావచ్చునని ఈ యాత్ర కరోనా వైరస్‌ని మరింతంగా వ్యాప్తి చేస్తుందని ఆందోళనలైతే ఉన్నాయి. తీర్థ సింగ రావత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈ యాత్రని రద్దు చేస్తే ధామి అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారు. ఈ యాత్రని రద్దు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని, వారి ప్రాణాలకే భద్రత కల్పించడానికే తాము ప్రాధాన్యతనిస్తామని ధామి చెప్పుకొచ్చారు.  

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement