నకిలీ పేర్లతో నాసిరకం
కేజీబీవీల్లో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 391 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో విద్యార్థులకు నాసిరకం పుస్తకాలు అంటగట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పుస్తక ఏజెన్సీలతో కలిసి ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దాదాపు 80 వేల మంది విద్యార్థులకు అందించాల్సిన ‘రాయల్ అట్లాస్’ పుస్తకాలకు బదులు అదే పేరును తలపించే ‘రాయల అట్లస్’ అనే నాసిరకం పుస్తకాలను ఇచ్చినట్లు బయట పడింది.
అలాగే ఆక్స్ఫర్డ్ వంటి డిక్షనరీలకు బదులు రాఘవేంద్ర పబ్లిషర్స్‌కు చెందిన నాసిరకం డిక్షనరీలను పంపిణీ చేసినట్టు వెల్లడైంది. నోట్‌బుక్స్ లోనూ విద్యార్థులకు కోత పెట్టారు. విద్యా శాఖ ఇటీవల క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయి. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడించారు.