అమెరికా ఫైనాన్స్‌లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా
న్యూయార్క్: అమెరికా ఆర్థికరంగంలో భారత సంతతి మహిళలు సత్తా చాటారు. అత్యంత ప్రభావవంత 100 మంది మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు అనుబంధమైన బారన్ నాలుగో వార్షిక జాబితాలో రూపొందించింది. ఆర్థిక సేవల రంగంలో ఉన్నత స్థాయిలకు చేరడంతో పాటు ఈ రంగభవితను మార్చడంలో కీలక పాత్రను పోషించిన అత్యుత్తమ 100 మంది మహిళలను ఇందులో చేర్చారు.
ఈ లిస్ట్‌లో జేపీ మోర్గాన్‌కు అను అయ్యంగార్, ఏరియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన మీనా లక్డావాలా-ఫ్లిన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కుచెందిన రూపాల్ జె భన్సాలి, గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్‌కు చెందిన సోనాల్ దేశాయ్, బోఫా సెక్యూరిటీస్‌కు సెక్యూరిటీస్‌కి చెందిన సవితా సుబ్రమణియన్‌కు స్థానం లభించడం విశేషం. వీరితోపాటు పాకిస్థానీ అమెరికన్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నువీన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సైరా మాలిక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
అను అయ్యంగార్: బారన్ వివరాల ప్రకారం జేపీ మోర్గాన్‌లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయహెడ్గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 2020 జనవరి నుంచి ఈ విభాగానికి కో-హెడ్‌గా పనిచేశారు. స్మిత్ బిజినెస్ అడ్వైజరీ నెట్‌వర్క్‌కు కో-చైర్‌గా కూడా ఉన్నారు. అయ్యంగార్ తన భర్తతో కలిసి న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. స్మిత్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బీఏ, వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఏంబీఏ చేశారు.
రూపాల్ జె భన్సాలీ(55): ఏరియల్ ఇన్వెస్ట్మెంట్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 100 వుమెన్ ఇన్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. మనీ మేనేజింగ్ కోసమే తాను పుట్టానని చెప్పుకునే మహిళలను ఫైనాన్స్‌లో పనిచేసేలా ప్రోత్సహించాలనే ఆసక్తి ఎక్కువ. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్, తరువాత రోచెస్టర్ విశ్వవిద్యాలయంనుండి ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఆమె రోటరీ ఫౌండేషన్ స్కాలర్ కూడా.
సోనాల్ దేశాయ్(58): 2018లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో 137 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డ్రెస్డ్నర్ క్లీన్వోర్ట్ వాసర్స్టెయిన్, థేమ్స్ రివర్ క్యాపిటల్‌లో పనిచేసిన తర్వాత 2009లో ఆమె ఈ సంస్థలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన కరియర్ ప్రారంభించారు.
మీనా లక్డావాలా-ఫ్లిన్ (45): ఒలింపిక్స్‌లో పోటీపడాలనుకునే ఉత్సాహభరితమైన జిమ్నాస్ట్. కానీ మోకాలి గాయం కారణంగా ఆమె దృష్టి ఫైనాన్స్ కెరీర్ వైపు మళ్లింది. అలా ఈక్విటీ సేల్స్ డెస్క్‌లో పనిచేస్తున్న ఫ్రైడ్మాన్, బిల్లింగ్స్ రామ్సే గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. గ్లోబల్ ఇన్‌క్లూజన్, డైవర్సిటీ కమిటీకి కో-ఛైర్‌గా పనిచేశారు. గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి కో-హెడ్గాను, 1999లో జేపీ మోర్గాన్ ఛేజ్‌లో పనిచేశారు. ఆతర్వాత గోల్డ్‌మన్ శాక్స్‌కు మారారు.
సవితా సుబ్రమణియన్ (50): బ్యాంక్ ఆఫ్ అమెరికాలో యూఎస్ ఈక్విటీ, క్వాంటిటేటివ్ స్ట్రాటజీ విభాగ హెడ్‌గా ఉన్నారు. ఈక్విటీలపై యూఎస్ సెక్టార్ కేటాయింపులను సిఫార్సు చేయడం, S&P 500 ఇతర ప్రధాన సూచీలకు అంచనాలను నిర్ణయించడం చేస్తారు. అలాగే సంస్థాగత వ్యక్తిగత క్లయింట్లకు సంస్థ పరిమాణాత్మక ఈక్విటీ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తారు.