321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఎత్తివేత
హైటెక్ ఏలికల పాలనలో కంప్యూటర్ విద్య.. మిథ్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన పథకాన్ని పాలకులు కొంతకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థులకు దూరమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయల కంప్యూటర్ పరికరాలు నిరుపయోగంగా మారి, మూలనపడ్డాయి.
కొత్తపేట :పాఠశాలల్లో కంప్యూటర్ విద్యపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తూం డడం విద్యార్థులకు శాపంగా మారింది. గడచిన రెండేళ్లలో జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను దశలవారీగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) స్కీమ్ కింద రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలల్లో 2002లో తొలివిడతగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. అప్పట్లో జిల్లాలోని 53 పాఠశాలల్లో ఇది ఆరంభమైంది. ‘కార్పొరేట్’కు దీటుగా సామాన్య విద్యార్థులు కూడా ఎదగాలని భావించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యను మరిన్న పాఠశాలలకు విస్తరించారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో సైతం దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఐసీటీ రెండో దశ కింద 2008 సెప్టెంబర్‌లో జిల్లాలోని మరో 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. మూడో దశ కింద 2010 జనవరిలో మరో 66 పాఠశాలల్లో దీనిని ప్రారంభించారు. కంప్యూటర్ విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. కంప్యూటర్ విద్య కోసం ప్రతి పాఠశాలకు 11 మోనిటర్లు, 5 ఐదు యూపీఎస్‌లు, మూడు సీపీయూలు, ఒక జనరేటర్, ఒక ప్రింటర్ సమకూర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ఇద్దరు ఫ్యాకల్టీలను నియమించారు. అవసరమైన ఫర్నిచర్ కూడా అందించారు.
రెండో దశపై చిన్నచూపు
కంప్యూటర్ విద్య 1, 3 దశలు బాగానే అమలవుతున్నా, రెండు దశలోని 321 పాఠశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రెండో దశకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలతో ఐదేళ్లకు కుదుర్చుకున్న ఒప్పందం 2013 సెప్టెంబర్‌తో పూర్తయింది. దీనిని పునరుద్ధరించకపోవడంతో ఆయా ఏజెన్సీలు కంప్యూటర్లను పాఠశాలలకు అప్పగించాయి. ఫ్యాకల్టీలను తొలగించాయి. ఫలితంగా జిల్లాలోని 321 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు తెర పడినట్లయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. మూడో దశ అమలవుతున్న 66 పాఠశాలల్లో కూడా వచ్చే జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కానుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కంప్యూటర్ విద్య గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు. మరోపక్క కోట్ల రూపాయల విలువైన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి, మూలకు చేరుతున్నాయి.
కొనసాగించాలి
కంప్యూటర్ విద్యను కొనసాగించాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. విద్యా వలంటీర్ల మాదిరిగా ఫ్యాకల్టీలను నియమించి, కంప్యూటర్ విద్యను అందించాలని పలువురు సూచిస్తున్నారు. వాస్తవానికి ఫ్యాకల్టీ వద్ద ఆయా పాఠశాలల్లోని ఇద్దరు ఉపాధ్యాయులు ఐదేళ్లపాటు శిక్షణ పొందాలి. అనంతరం వారు ఆ పాఠశాలలో కంప్యూటర్ విద్యను బోధించాలి. ఇలా శిక్షణ పొందినట్టు పాఠశాలల రికార్డుల్లో పేర్కొన్నారు కానీ, వాస్తవానికి చాలాచోట్ల అలా శిక్షణ పొందిన దాఖలాల్లేవు. తమ రెగ్యులర్ తరగతులకు ప్రాధాన్యం ఇస్తూ కంప్యూటర్ విద్యను వారు పక్కన పెట్టేశారు.
నియోజకవర్గ కథనాలు జోన్ పేజీల్లో..