సిక్కా పోస్టు బరిలో ఆ నలుగురు?
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్‌కు విశాల్ సిక్కా ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. తనపై పదేపదే వస్తున్న మాటలదాడిని, నిరాధారణమైన ఆరోపణలను తట్టుకోలేక ఇన్ఫోసిస్ సీఈవో పోస్టుకు రాజీనామా చేస్తున్నానంటూ సిక్కా అనూహ్య నిర్ణయం ప్రకటించారు. సిక్కా అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్ హోర్హోల్డర్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఆందోళనలతో ఇన్ఫీలో ఉన్న షేర్లను అమ్మేశారు కూడా. అయితే ఈ ఆందోళనలన్నింటిన్నీ చక్క పెట్టడానికి ఓ సమర్థుడైన వ్యక్తి సీఈవోగా సిక్కా పోస్టులోకి రావాల్సి ఉంటుంది. ఆ సీఈవోకు కంపెనీ బాధ్యతలే కాక, ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు, వీసాల విషయంలో ఇతర దేశాలు తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలు అతిపెద్ద సవాళ్లుగా నిలువనున్నాయి. కానీ సిక్కా పోస్టులోకి వచ్చేదెవరు? ఆ పోస్టుకు ఎవరెవరు? సమర్థులు. సిక్కా జాబ్‌ను విజయవంతంగా నడిపించేదెవరంటే..? ప్రస్తుతం నలుగురు పేర్లు అందరి నోళ్లలో నలుగుతున్నాయి. ఈ నలుగురిలో ఒక్కరు ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా రావొచ్చంటూ కంపెనీకి చెందిన అధికారులే చెబుతున్నారు.
వారెవరంటే... ఒకరు ప్రస్తుతం ఇన్ఫోసిస్ తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, రెండో వ్యక్తి సీఎఫ్ఓ రంగనాథ్ డీ మావినకేరి, తర్వాత వ్యక్తి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఓఓ రవి కుమార్ ఎస్, ఇక నాలుగో వ్యక్తి బీఎఫ్ఎస్ఐ హెడ్ మోహిత్ జోషి అని తెలిసింది. ఈ నలుగురు సిక్కా పోస్టుకు బరిలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. బయట వ్యక్తిని మాత్రం ఇన్ఫోసిస్ సీఈవోగా తీసుకురాదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కో-చైర్మన్‌గా ఉంటున్న రవి వెంకటేషన్ ఈ పదవి చేపట్టవచ్చని ఊహాగానాలు వచ్చాయి. కానీ వెంకటేషన్నే ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. తనకు ఆ హాట్ సీటులో కూర్చోవడం ఇష్టంలేదంటూ తేల్చిచెప్పారు. ఇప్పటికే తామున్న వ్యూహంలోకి రాగల సమర్థుడైన నాయకుడు తమకు కావాలంటూ వెంకటేషన్ చెప్పారు.
ఆ నలుగురే ఎందుకు?
తాత్కాలిక సీఈవోగా పదవిలోకి వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, 1986 నుంచి ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ హెడ్ వంటి అతిపెద్ద నాయకత్వ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.
ఇక సీఎఫ్ఓ రంగనాథ్, ఇన్ఫోసిస్ పనిచేయబట్టి దాదాపు 15 ఏళ్లయింది. ప్రస్తుతం కార్పొరేట్ ఫైనాన్స్, విలీనాలు, కొనుగోళ్లు, కార్పొరేట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటిలో బాధ్యతలు చేపడుతున్నారు.
అన్ని ఇండస్ట్రి సెగ్మెంట్లలో ఇన్ఫోసిస్‌ను గ్లోబల్‌గా ఓ స్థానంలో నిల్చోబెట్టిన ఘనత డిప్యూటీ సీఓఓ కుమార్‌ది.
బీఎఫ్ఎస్ఐ అధినేత, ప్రెసిడెంట్ జోషి సంస్థ వ్యాప్తంగా జరిగే విక్రయ కార్యకలాపాలను, రిపోర్టింగ్ ప్రక్రియలను చూసుకుంటున్నారు.