infrared camera
-
తల్లి కోసం పులి కూనల కలవరం
ఆత్మకూరు రూరల్: నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది. పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి³ పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్ నుంచి వదులుతారు. ఆ నాలుగూ ఆడ కూనలే పెద్ద పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి. వీటిలో మగ, ఆడ కూనలు ఉంటాయి. వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. బతికిన వాటిలో సాధారణంగా ఒక్కొక్క ఆడ, మగ కూనలు ఉండవచ్చు. పెద్ద పులుల సంరక్షణ, సంతతి పెరుగుదలలోనూ ఆడ పులులదే ప్రధాన పాత్ర. గుమ్మడాపురంలో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఒక ఆడపులి తన జీవిత కాలంలో (అడవిలో అయితే 18 ఏళ్లు) 20 పులులను పునరుత్పత్తి చేయగలదు. చేరదీస్తుందో.. లేదో! వన్యప్రాణుల్లో పెద్ద పులి, దొమ్మల గొండి (హైనా) తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు రానీయవు. పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలను తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. కాగా, మనిషి ముట్టిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరిస్తున్నారు. దీంతో పులి పిల్లల వంటిని తడపనున్నారు. అన్ని సందర్భాల్లో వర్తించదు మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ పేర్కొన్నారు. తల్లికి, పిల్లలకు మధ్య ఉండే బలమైన బంధం, ప్రత్యేక పరిస్థితులు దీనికి మినహాయింపు కావచ్చన్నారు. అందువల్ల పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభిస్తాం పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని అటవీ శాఖ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్లో గర్భంతో ఉన్న పులిని ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించామన్నారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చన్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల వన్యప్రాణి వైద్య నిపుణులు డాక్టర్ తోయిబా సింగ్ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారన్నారు. కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటి ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చోంగ్ టెరాన్, విఘ్నేష్ పాల్గొన్నారు. -
పండోరా క్లస్టర్
అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్ క్లస్టర్’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది. అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి. -
NASA: తారల తాండవం!
న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్) సాయంతో బంధించింది. మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది. -
నగరంపై నిఘా నేత్రం
అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో నిఘా రాత్రివేళల్లో దృశ్యాల నిక్షిప్తం హైదరాబాద్ తరహాలో కంట్రోల్ రూమ్ తిరుపతి క్రైం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో నేరాలను అరికట్టడానికి, ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడానికి పోలీసు శాఖ భారీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వేగంగా నేరస్తులను పట్టుకోవడానికి అత్యాధునిక సీసీ కెమెరాలను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. గతంలో అర్బన్ ఎస్పీగా ఉన్న రాజశేఖరబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పోలీసు శాఖ నిధుల నుంచి రూ.50 లక్షలు వెచ్చించి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సీసీ కెమెరాలను తెప్పించారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి వచ్చిన 150 కెమెరాలను 150 జంక్షన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుతో 100 మీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయితే గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుంది. మంచి క్వాలిటీతో ఉండే ఈ కెమెరాలతో రాత్రి వేళల్లో జరిగే దృశ్యాలను సైతం చిత్రీకరించవచ్చు. 24 గంటలు పహారా కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్‌లోని మూడో అంతస్తులో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైదారబాద్ కమిషనరేట్‌లో ఉన్న విధంగానే ఈ కంట్రోల్ రూమ్‌లో నిఘా ఉంటుంది. క్రైం విభాగం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి పోలీసు సిబ్బందిని ఈ కంట్రోల్ రూముల్లో విధుల్లో నియమించనున్నారు. ఆయా విభాగాల సిబ్బంది వారివారి విభాగాల కోణంలోనే ఈకెమెరాలలోని దృశ్యాలను విశ్లేషిస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలపై కూడా నిఘా ఉంటుంది. రోడ్లపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయి. కంట్రోల్ రూమ్‌కు అదనపు బాధ్యతలు ఏదైనా వాహనం చోరీకి గురైతే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, అనంతరం ఎలా చోరీ జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే నేరుగా ఈస్టు పోలీసు స్టేషన్ భవనంలోని నూతన కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందిని కలిస్తే సరిపోతుంది. అక్కడున్న పెద్ద స్క్రీన్‌లో వాహనం పెట్టిన పాయింట్ ప్రాంతాలను సీసీ కెమెరాలు వీక్షిస్తే కచ్చితంగా నేరస్తుడిని గుర్తించవచ్చు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో పోలీసుల పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూమ్‌లో బాధితులు స్వయంగా కెమెరాలో వీక్షించుకునేలా అవకాశం కల్పించనున్నారు. తద్వారా నేర నిర్ధారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. వేగవంతంగా కొత్త సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.