infrastructure projects
-
ప్రాజెక్టుల్లో జాప్యంతో రూ.4.52 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల్లో జాప్యం వాటి నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచేస్తోంది. రూ.150 కోట్లు, అంతకుమించి వ్యయంతో కూడిన మొత్తం 1,529 ప్రాజెక్టులకు గాను 384 ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల.. రూ.4.52 లక్షల కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక వెల్లడించింది. అలాగే, మొత్తం 662 ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నట్టు పేర్కొంది. ‘‘1,529 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.21,25,851 కోట్లు. కానీ, నిర్మాణం పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.25,78,197 కోట్లకు చేరనుంది. అంటే రూ.4,52,345 కోట్ల అదనపు వ్యయం కానుంది’’అని వివరించింది. 2022 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ.13,78,142 కోట్లుగా ఉంది. 662 ప్రాజెక్టుల్లో 1–12 నెలల ఆలస్యంతో నడుస్తున్నవి 133 ఉన్నాయి. 124 ప్రాజెక్టులు 13–24 నెలలు, 276 ప్రాజెక్టులు 25–60 నెలలు, 129 ప్రాజెక్టులు వాస్తవ గడువుతో పోలిస్తే 61 నెలలకు మించి ఆలస్యంగా సాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టులకు కావాల్సిన రుణాల సమీకరణలో ఆలస్యం కారణాలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
రోడ్ల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లలోకి వస్తాం
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సమీకరిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం భయాలను మంత్రి ప్రస్తావిస్తూ.. మౌలికరంగ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధుల సమస్య లేదన్నారు. ‘‘సంపన్నుల నిధులను ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. షేర్ మార్కెట్‌కు వెళతాం. చిన్న ఇన్వెస్టర్ల నుంచి రూ.లక్ష, రూ.2లక్షల చొప్పున నిధులు సమీకరిస్తాం. వారికి హామీతో కూడిన 8 శాతం రేటును ఆఫర్ చేస్తాం. ఈ విధంగా భారీ ఎత్తున నిధులు పొందగలం’’ అని ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి వెల్లడించారు. నిర్మాణ రంగ పరికరాల మార్కెట్ రూ.50,000 కోట్లుగా ఉంటుందని, చమురు ధరలు పెరిగిపోవడంతో ఇది సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. హానికారకమైన డీజిల్ వినియోగం నుంచి బయటకు రావాలని పరిశ్రమకు సూచించారు. మెథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని భవిష్యత్తుగా పేర్కొంటూ.. ఈ విభాగంలో భారత ఆటోమొబైల్ కంపెనీల వాటా పెరిగి, విదేశీ కంపెనీల వాటా తగ్గుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత కంపెనీలు వాహనాల ఉత్పత్తిని స్థానికంగా చేపట్టడం వాటికి అనుకూలిస్తుందన్నారు. దేశంలో విస్తారంగా బొగ్గు నిల్వలు ఉన్నా కానీ, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అందుకే 60 బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు. మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్లకు ఇది అదనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయన్నారు. ఇంధన రంగంలో రూ.25 లక్షల కోట్ల ప్రాజెక్టులు రానున్నాయని, రోడ్ల నిర్మాణంలో రూ.20 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రానున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (దాదాపు రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంధన, రోడ్లు, రైల్వేకు పెద్దపీట కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల్లో ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు అగ్ర ప్రాధాన్యం లభించింది. ‘‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (ఎన్ఐపీ) కింద గుర్తించిన రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం సమన్వయంతో ఎన్ఐపీ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ఉపాధి కల్పన, జీవన సౌఖ్యం కలగడంతోపాటు, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రావడం వల్ల సమగ్ర వృద్ధికి వీలు పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి విడత వార్షిక అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం వచ్చే ఏడాది ద్వితీయ భాగంలో ఉంటుందని తెలిపారు. -
కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఎఫ్‌డీఐలపై సమీక్ష
న్యూఢిల్లీ: వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో టెలికంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై కేంద్రం దృష్టి సారించింది. వ్యూహాత్మక ప్రాంతాలు, సరిహద్దుల్లో వివిధ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐతో పాటు వివిధ శాఖలు, ఏజెన్సీలు ఈ కసరత్తులో పాల్గొంటున్నట్లు వివరించాయి. ప్రస్తుతం చాలామటుకు పరిశ్రమల్లో ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అయితే, ఈశాన్య రాష్ట్రాలు సహా కీలకమైన ప్రాంతాల్లోని ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఎంత వరకూ శ్రేయస్కరమన్నది కేంద్రం పరిశీలిస్తోంది. సాధారణంగా చాలా మటుకు దేశాలు వ్యూహాత్మక ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ సంస్థలకు అనుమతులివ్వవు. -
మౌలిక ప్రాజెక్టులకు పటిష్ట విధానం
త్వరితగతిన పూర్తి చేయాలి: మోదీ ► ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి ► మౌలిక రంగాల్లో పురోగతిపై సుదీర్ఘ సమీక్ష న్యూఢిల్లీ: దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు పటిష్టమైన విధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటివరకూ ప్రయాణ సదుపాయం లేని ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులను సాధ్యమై నంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేయాలని, వాటిని భారత్‌లో వినియోగించే అంశాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, డిజిటల్ తదితర రంగాల్లో పురోగతిపై మంగళవారం రాత్రి ప్రధాని సుమారు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి సబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) బుధవారం ప్రకటన విడుదల చేసింది. సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ రంగాల్లో విశేషమైన పురోగతి సాధించినట్టు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రోజుకు సగటున 130 కి.మీ.మేర రహదారుల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. దీంతో 2016–17లో పీఎంజీఎస్‌వై కింద అదనంగా 47,400 కిలోమీటర్ల మేర రహదారులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇదే సమయంలో 11,641 నివాస ప్రాంతాలకు రహదారుల సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. గ్రామీణ రహదారుల్లో 4 వేల కిలోమీటర్లకుపైగా గ్రీన్ టెక్నాలజీని వినియోగించి నిర్మించినట్టు వెల్లడించారు. నిరంతరం పర్యవేక్షించాలి.. గ్రామీణ రహదారుల నిర్మాణం.. వాటి నాణ్యత ఎలా ఉంటోందనే విషయాన్ని పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 26 వేలకుపైగా జాతీయ రహదారులను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. అలాగే 953 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించినట్టు వివరించారు. 2 వేల కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ, వెయ్యి కిలోమీటర్ల మేర గేజ్ మార్పిడి ప్రక్రియ పూర్తిచేసినట్టు తెలిపారు. 115 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం, 34 వేల బయో టాయిలెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మోదీ ఆదేశించారు. రైల్వేలో అవినీతిపై ప్రధాని సీరియస్ రైల్వే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావటంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. తమ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో ఉందని మోదీ అన్నట్లు ప్రకటన పేర్కొంది. ఈ సమావేశంలో ముంబై మెట్రో, తిరుపతి–చెన్నై హైవేతోపాటుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైలు, రోడ్డు ప్రాజెక్టులు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యుత్ సరఫరా లైన్లపైనా సమీక్ష చేశారు. రైల్వేల్లో సమస్యలు, ఫిర్యాదుల కోసం, ప్రమాదాలు జరిగినప్పుడు వివరాల కోసం కూడా ఏకీకృత టెలిఫోన్ నెంబరు ఏర్పాటుచేసుకోవాలని ప్రధాని సూచించారు. చిన్నారులకు సమస్యాత్మకంగా మారిన వ్యాధులకు టీకాల కోసం ఉద్దేశించిన ‘మిషన్ ఇంద్రధనుష్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్ర సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. స్వచ్ఛ్ భారత్, అమృత్లపైనా సమీక్షించిన మోదీ.. 2022 కల్లా నవభారత నిర్మాణం కోసం స్పష్టమైన ప్రణాళికలు, లక్ష్యాలను రూపొందించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు. -
కీలక విదేశీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలకమైన ఇన్ఫ్రా ప్రాజెక్టులకు బిడ్డింగ్ చేసే దేశీ కంపెనీలకు రాయితీపై రుణాలు అందించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ రుణాల రీపేమెంటుకు సదరు దేశ ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద దేనికి రాయితీ రుణం అందించవచ్చన్నది ఆయా ప్రాజెక్టును బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంకు కాకుండా ఇతరత్రా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా వ్యూహాత్మక ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే యోచనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. రెండేళ్ల తర్వాత ఈ స్కీమును పునఃసమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. -
సంక్షిప్తం..
ఐపీఓకు జీవీఆర్ ఇన్ఫ్రా న్యూఢిల్లీ: జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించిన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి మంగళవారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యోచిస్తోంది. ఈ ఐపీఓలో తాజా షేర్లతో పాటు ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 43.22 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేయనున్నారు. మూల ధన అవసరాలు. రుణ భారం తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వ్యాపార అవసరాల కోసం ఈ ఐపీఓ నిధులను వినియోగించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఇన్ఫీబీమ్ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఇన్ఫీబీమ్ రూ.450 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓ మార్గంలో నిధులు సమీకరించనున్న తొలి ఈ కామర్స్ కంపెనీ ఇదే కానున్నది. ఐగేట్ సీఈవో పదవికి అశోక్ వేమూరి రాజీనామా న్యూఢిల్లీ: ఐగేట్ కంపెనీ సీఈవో పదవి నుంచి అశోక్ వేమూరి వైదొలిగారు. భారత్‌లో అధిక ఉనికిని కలిగిన అమెరికాకు చెందిన ఐగేట్ కంపెనీని 4 బిలియన్ డాలర్లకు ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని ఈ ఏడాది జూలై 1న కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అశోక్ వేమూరి గతంలో ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తర్వాత ఆయన 2013, సెప్టెంబర్‌లో ఐగేట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఐగేట్, క్యాప్‌జెమిని విలీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. భారీ లాభాలతో హెచ్డీఎఫ్సీ ఎన్సీడీలు, వారంట్ల లిస్టింగ్ ముంబై: హెచ్డీఎఫ్సీ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ)ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించగా, వారంట్ల ద్వారా రూ.5,400 కోట్లు రానున్నాయి. ఈ వారంట్లు, ఎన్సీడీలు భారీ ప్రీమియంతో లిస్టయ్యాయని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ చెప్పారు. రూ. 1 కోటి ముఖ విలువ ఉన్న 5,000 ఎన్సీడీలను 1.43 శాతం కూపన్ రేటుకు ఆఫర్ చేశామని, మంగళవారం 8.54 శాతం వద్ద ట్రేడవుతోందని పేర్కొన్నారు.