న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సమీకరిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం భయాలను మంత్రి ప్రస్తావిస్తూ.. మౌలికరంగ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధుల సమస్య లేదన్నారు. ‘‘సంపన్నుల నిధులను ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. షేర్ మార్కెట్‌కు వెళతాం.
చిన్న ఇన్వెస్టర్ల నుంచి రూ.లక్ష, రూ.2లక్షల చొప్పున నిధులు సమీకరిస్తాం. వారికి హామీతో కూడిన 8 శాతం రేటును ఆఫర్ చేస్తాం. ఈ విధంగా భారీ ఎత్తున నిధులు పొందగలం’’ అని ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా మంత్రి వెల్లడించారు. నిర్మాణ రంగ పరికరాల మార్కెట్ రూ.50,000 కోట్లుగా ఉంటుందని, చమురు ధరలు పెరిగిపోవడంతో ఇది సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. హానికారకమైన డీజిల్ వినియోగం నుంచి బయటకు రావాలని పరిశ్రమకు సూచించారు.
మెథనాల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని భవిష్యత్తుగా పేర్కొంటూ.. ఈ విభాగంలో భారత ఆటోమొబైల్ కంపెనీల వాటా పెరిగి, విదేశీ కంపెనీల వాటా తగ్గుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత కంపెనీలు వాహనాల ఉత్పత్తిని స్థానికంగా చేపట్టడం వాటికి అనుకూలిస్తుందన్నారు. దేశంలో విస్తారంగా బొగ్గు నిల్వలు ఉన్నా కానీ, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అందుకే 60 బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment