ఇదో మహోద్యమం
* రాజధానిలో ఉద్యమంలా ఇంకుడు గుంతలు నిర్మించాలి
* జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ దానకిశోర్ పిలుపు
* ప్రజలను కార్యోన్ముకులను చేసేందుకు ‘సాక్షి’ ప్రయత్నం అభినందనీయం
* ‘సాక్షి-ఆలివ్ మిఠాయి’ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడిప్‌లో విజేతల ఎంపిక
* తొలి ముగ్గురు విజేతలకు బంగారు ఆభరణాలు
* మరో ఐదుగురికి కన్సొలేషన్ బహుమతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో కురిసిన ప్రతి వర్షపునీటి చుక్కను ఒడిసిపట్టేందుకు మహోద్యమంగా ఇంకుడు గుంతలను నిర్మించాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ పిలుపునిచ్చారు.
నగరవాసులు ఇంకుడు గుంతలు సొంతంగా నిర్మించుకునేలా వారిని కార్యోన్ముకులను చేసేందుకు‘సాక్షి’ దినపత్రిక, ఆలివ్ మిఠాయి సంస్థ సామాజిక బాధ్యతతో చేసిన ప్రయత్నం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వ్యక్తులు, సంస్థల ఫొటోలను మే, జూన్ నెలల్లో ‘సాక్షి’ దినపత్రికలో క్రమం తప్పకుండా ప్రచురించిన ఫొటో ఎంట్రీల్లో భాగ్య విజేతలను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.1లోని ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంకుడు గుంతలు నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచిన 8 మంది విజేతలను ప్రకటించారు.
అనంతరం దానకిశోర్ మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో రెండు వేల ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు జల మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. భూగర్భ జలమట్టాలు పెంచేందుకు సామాజిక బాధ్యతతో ప్రతి ఇల్లు, కార్యాలయం, సంస్థల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్కిళ్ల వారీగా పలు కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకిం చేందుకు వెయ్యి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశామన్నారు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్టుగా భూగర్భ జలాలను పెంపొం దించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. గ్రేటర్ పరిధిలో కృష్ణా మూడో దశ, గోదావరి మొదటి దశ పథకాలను పూర్తిచేసి వేసవిలోనూ మహానగర దాహార్తిని తీర్చామన్నారు. రోజువారీగా ఆయా పథకాల ద్వారా 355 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేస్తున్నామన్నారు. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలో లక్షలాది మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు 600 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరవ్యాప్తంగా సరఫరా చేసేందుకు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో స్టోరేజి రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఆపరేషన్స్ డెరైక్టర్ పి.వి.కె.ప్రసాద్, ఎడిటర్ వి.మురళి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, ఆలివ్ మిఠాయి సంస్థ అధినేత దొరైరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, లక్కీడిప్‌లో ఎంపికైన తొలి ముగ్గురు విజేతలకు బంగారు ఆభరణాలు.. మరో ఐదుగురికి కన్సొలేషన్ బహుమతులను త్వరలో అందజేయనున్నారు.