బీఎస్ఎన్ఎల్ మరో విప్లవాత్మక సర్వీసులు
న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నెట్ వర్క్స్ లేని రిమోట్ ప్రాంతాల్లో వాయిస్ సర్వీసులు అందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సర్వీసులను లాంచ్ చేసింది. తొలుత వీటిని ప్రభుత్వ ఏజెన్సీలకు ఆఫర్ చేసి, అనంతరం దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్మార్ శాట్ - ఉపగ్రహ సమాచార సమూహం ద్వారా ఈ సర్వీసులను నెట్ వర్క్స్ లేని ప్రాంతాల్లో అందించనుంది. విపత్తు నిర్వహణ సంస్థలు, రాష్ట్ర పోలీసు, రైల్వే, బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్, ఇతర ఏజెన్సీలకు తొలి దశలో ఈ ఫోన్ సర్వీసులను అందిస్తామని లాంచింగ్ సందర్భంగా టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. టెలికాం డిపార్ట్ మెంట్, బీఎస్ఎన్ఎల్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఓ విప్లవాత్మక అడుగని అభివర్ణించారు.. విమానం, ఓడల్లో ప్రయాణించే వారు కూడా తర్వాత ఈ సర్వీసులను వాడుకోవచ్చన్నారు.
వాయిస్, ఎస్ఎంఎస్ తో నేటి(బుధవారం) నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్ మాత్రమే శాటిలైట్ సర్వీసులను అందిస్తోంది. ఇంటర్నేషనల్ మొబైల్ శాటిలైట్ ఆర్గనైజేషన్(ఇన్మార్ శాట్) 1979లో అమెరికాలో ఏర్పాటుచేశారు. దీనిలో భారత్ కూడా ఒకానొక వ్యవస్థాపక సభ్యురాలు. భద్రత విషయాల పరంగా విదేశీ ఆపరేటర్లు సరఫరాల చేసిన కొన్ని శాటిలైట్ ఫోన్లను పారామిలటరీ బలగాలు వాడుతున్నారు. అన్ని కనెక్షన్లను బీఎస్ఎన్ఎల్ కు ట్రాన్సఫర్ చేస్తామని, కాల్ రేట్లను కూడా బీఎస్ఎన్ఎల్ కంపెనీనే నిర్ణయిస్తుందని ఇన్మార్ శాట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ శర్మ తెలిపారు. ఈ కాల్ రేటు రేంజ్ నిమిషానికి 30-35 రూపాయల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.