సృజనాత్మకతను వెలికి తీయడమే విద్య
⇒ నిత్యవిద్యార్థిగా ఉపాధ్యాయులు
⇒ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆశాభావం
⇒ ఆహ్లాదకరంగా పాఠశాల విద్య: సద్గురువు జగ్గి వాసుదేవ్
⇒ ఇషాయోగా కేంద్రంలో విద్యా సదస్సు
కోయంబత్తూరు నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఇన్నొవేటింగ్ ఇండియాస్ స్కూలింగ్’ అనే అంశంపై కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జాతీయస్థాయి సమావేశాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, సద్గురువు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే నా లక్ష్యం. ఒకప్పుడు సమాజం అన్నీ చేసుకునేది. ఆ తరువాత ప్రభుత్వమే అన్నీ చేయాలనే భావన బయలుదేరింది. కానీ నేడు విద్యావిధానంలో సమాజ బాధ్యత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, నిర్వాహుకుల్లోనే లోపాలు ఉన్నాయి. ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించడం లేదు. ఒక పాఠశాలకు తనిఖీకి వెళ్లి ఎవ్వరీని బదిలీ చేయను, శిక్షించను, పూర్తిగా నమ్ముతాను అని చెప్పిన తరువాత ఉత్తీర్ణతశాతం గణణీయంగా పెంచిచూపారు.
అనుకూలతాధోరణి పెంచుకుంటే ఏదైనా సాధ్యం. కొలంబస్ అమెరికాను కనుగొనేందుకు బయలుదేరలేదు, భారత దేశం కోసం బయలుదేరితే అమెరికా తగిలింది, అంతటి ఆకర్షణ భారత దేశంలో ఉంది. గత 70 ఏళ్లలో ఎంతో విద్యావ్యాప్తి జరిగింది. అయితే బ్రిటీష్‌వారు అందరికీ విద్యను బోధించలేదు. తమ వద్ద చాకిరికి పనికి వచ్చేవారికి మాత్రమే చదువు చెప్పారు. దాదాపుగా అదే విద్యావిధానం నేటికీ కొనసాగుతుండగా, ప్రస్తుతం నాణ్యమైన విద్యపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పరీక్షల పరంగా విద్యార్దుల్లో మానసిక వత్తిడులు సరికాదు. నేను కేంద్ర మంత్రికాగానే అందరూ నన్ను సన్మానిస్తామని అన్నారు.
విద్యార్థులను పాఠ్యపుస్తకాల్లో ముం చెత్తడం కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడమే అసలైన విద్యాబోధన.. విద్యావిధానంలో అదే మనం సాధించాల్సిన సంస్కరణ అని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. నేను ఇంతటి వాడు కావడానికి కారణమైన టీచర్లను సన్మానిస్తానని చెప్పాను. అందుకే గురుపూర్ణిమ రోజున పార్లమెంటు సభ్యుల్లోని 60 మంది ప్రొఫెసర్లను సన్మానించాను. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన నా 92 ఏళ్ల వయసున్న నా తల్లి నేటికి చదువుతుంది, బోధిస్తుంది, నేర్చుకుంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్దిగా కూడా ఉండాలని అయన అన్నారు.
విద్యాలయాలు బాధా నిలయాలు కారాదు: సద్గురువు
ఈషా యోగా కేంద్ర వ్యవస్థాపకులు సద్గురువు జగ్గి వాసుదేవ్ ప్రసంగిస్తూ, లేలేత బాల్య దశను విద్యాబోధనలతో భయపెడుతూ విద్యాలయాలను బాధా నిలయాలుగా మార్చరాదని ఉద్బోధించారు. బోధనాసిబ్బంది వల్లనే పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు భయపడుతున్నారు. వాస్తవానికి పిల్లలను సంతోషంగా ఉంచడం ఎంతో సులభం. పెద్దలు సైతం 24 గంటలపాటూ చీకు చింతాలేకుండా ఆలోచించండి వందేళ్లకు సమానమైన శక్తి లభిస్తుంది. ప్రతివారికి సంతోషంగా ఉండాలని ఉంటుంది, ఎలా ఉండాలో తెలియదు. అడిగితే మాత్రం తాము సంతోషంగా ఉన్నామని చెబుతారు.
మట్టి వద్దు, చెట్టు వద్దు, మామిడి పండు మాత్రం కావాలంటే ఎలా. చదువుచెప్పేపుడు విద్యార్దులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోండి. భయపెడుతూ చెప్పే బోధనా పద్దతుల వల్లనే విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్దులను తమ జీవితాలను అనుభవించేందుకు అవకాశం కల్పించండి. 98 శాతం మార్కులు వస్తే ఆ 2 శాతం ఎందుకు రాలేదని ప్రశ్నించే తత్వం తల్లిదండ్రుల్లో పోవాలి. పిల్లలను భిన్నంగా చూడటం అలవాటు చేసుకోండి.
ఈషాయోగా స్కూళ్లు అన్నింటిలా సాధారణమైనవే, అంకిత భావంతో పనిచేసే అందులోని సిబ్బంది వల్లనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాగే మా విద్యార్దులు వారికి ఇష్టమైన రీతిలో చదువుచెప్పిస్తున్నాము, మాకు ఇష్టమైనట్లు కాదు. మరే దేశంలోనూ లేనట్లుగా అనేక భాషల సమ్మేళనం భారతదేశానికి గర్వకారణం. అయితే ప్రతి ఒక్క విద్యార్ది ఇంగ్లీషు దానితోపాటూ ఒక ప్రాంతీయ లేదా స్థానిక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. బ్రిటీష్‌వాళ్లు మనకు ఎంత ద్రోహం చేసినా ఇంగ్లీషు భాష ఇచ్చి మేలు చేశారు.
ఆలోచింపజేసిన చర్చగోష్టి:
ప్రారంభోత్సవ కార్యక్రమానంతరం ఉదయం 11.30 నుండి రాత్రి 7 గంటల వరకు రెండు దశల్లో సాగిన విద్యావేత్తల, మేధావుల చర్చాగోష్టి అందరినీ ఆలోజింపజేసింది. చర్చగోష్టిలో తెరీ ప్రకృతి స్కూల్ గుర్గావ్ (డిల్లీ) డైరక్టర్ లతా వైద్యనాధన్, స్పెరనామిక్స్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) చైర్మన్ రాకేష్‌కౌల్, సృష్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక డైరక్టర్ గీతా నారాయణన్, వసంత్ వ్యాలీ స్కూల్ చైర్పర్సన్ రేఖాపురి, మిలినియం ఎడ్యుకేషన్ మేనేజిమెంట్ ఫౌండర్ సీఈఓ బిందురాణా, ఈషా విద్య అకడమిక్ డైరక్టర్, సీఈఓ కరడిపాత్ సీఈఓ సీపీ విశ్వనాధ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూషనల్ సొసైటీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, ట్రైనింగ్ మాజీ సంచాలకులు జేఎస్ రాజ్‌పుత్, యూజీసీ మాజీ వైస్‌చైర్మన్ దేవరాజ్, ఎడ్యుకమ్ సీఎండీ శాంతను ప్రకాష్, మలయాళం యూనివర్సిటీ వైస్ చాన్సలర్, మాజీ ఐఏఎస్ అధికారి కే జయకుమార్ తదితరులు ప్రస్తుత విద్యావిధానం, తీసుకురావాల్సిన మార్పులు గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ఈషా విద్య ఎడ్యుకేటింగ్ రూరల్ ఇండియా, ఈషా సంస్కృతి పాఠశాలల విద్యార్దులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్దులకు, బోధనా సిబ్బందికి పతకాలు, ప్రశంశాపత్రాలు అందజేశారు.