టీడీపీలో ‘కొత్త’ ముసలం
► పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న పాత నేతలు
► ఆళ్లగడ్డ నియోజకవర్గ ముఖ్యులతో గంగుల భేటీ
► పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన
► నంద్యాల, కోడుమూరు నియోజకవర్గాలోనూ ఇదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తెలుగుదేశం పార్టీలో అంసతృప్తి సెగ పెరుగుతోంది. పార్టీలో కొత్తగా చేరిన నేతలు, పాత నేతల మధ్య రోజురోజుకూ విభేదాలు పెరుగుతున్నాయి. ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉండి నిలబడిన తమకు జరుగుతున్న అవమానాలపై పాత నేతలు మండిపడుతున్నారు. తమ పరిస్థితిని అనుచరులు, పార్టీ నేతలకు వివరించేందుకు ఒక్కొక్కరూ సిద్ధమవుతున్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి తాజాగా తన అనుచరులు, ముఖ్యనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీలో ఆయన ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో వారికి వివరించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామని వారి సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా మీ వెంటే ఉంటామని వారు గంగులకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి రాం రాం చెప్పేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నెల 12వ తేదీన నియోజకవర్గంలోని అందరితో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించినున్నట్టు తెలిసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు కూడా ఇదే రీతిలో అధికార పార్టీకి దూరం కానున్నారని తెలుస్తోంది.
నంద్యాలలో రాజుకున్న అసంతృప్తి సెగ
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీలో ముసలం పుట్టగా.. నంద్యాలలో కూడా అసంతృప్తి అగ్గిరాజుకుంది. తాజాగా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో శిల్పా సోదరులు సమావేశమయ్యారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి రాదన్న అభిప్రాయం సర్వత్రా ఉన్న సందర్భంలో పార్టీలోకి తాము వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసినట్టు తెలిసింది.
అటువంటి తమను కాదని మధ్యలో వచ్చిన వారికి ఏకంగా మంత్రి పదవి అప్పగిస్తే పార్టీలో ఏ ముఖంతో తాము కొనసాగాలో అర్థం కావడం లేదని వాపోయినట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా తమను కాదని, కనీసం ప్రోటోకాల్ కోసమైనా తమను కార్యక్రమాలకు పిలవకపోవడం తమను మరింత పలుచన చేస్తోందని వాపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్దుకుని పనిచేయాలని సీఎం సూచించినట్టు అధికార పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే కింది స్థాయిలో ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని అధిష్టానం గ్రహించాలని ఆ పార్టీలోని పలువురు నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి సమాధానంతో శిల్పా సోదరులు సంతృప్తి చెందలేదని సమాచారం.
అన్ని చోట్లా ఇదే పరిస్థితే..
ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో కూడా టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు కొత్త పింఛన్లను ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్ల కోసం ధర్నా చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ప్రకటించారు. కర్నూలు నియోజకవర్గంలో పరిస్థితి ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. తెలివైన నాయకులైతే తనను కలుపుకుని పనిచేస్తారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎంపీ టీజీ వ్యాఖ్యానించారు. శ్రీశైలం నియోజకవర్గంలో కూడా తమ వారికి పార్టీలో పదవులు ఇవ్వాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యే అనుచరులు కోరుతున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని టీడీపీలో నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.