Insurance Development Control Board
-
ఏసీబీకి చిక్కిన బీమా అధికారి
ఖమ్మంక్రైం: బీమా శాఖలో పనిచేస్తున్న ఓ అవినీతి చేప సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని లక్ష్యంగా పెట్టుకొని ఏళ్లతరబడి వారి వద్ద లంచాలు తింటున్న ఉన్నతాధికారి బండారం ఎట్టకేలకు బట్టబయలు అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన కొండపర్తి బుచ్చయ్య ఎస్ఐగా పనిచేసి మే నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. అతనికి రాపర్తినగర్‌లోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి రూ.1,89,238లు రావలసివుంది. వీటి కోసం ఆయన గత నెల 18 నుంచి బీమా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కార్యాలయంలో ఉన్నతాధికారి ఏడీ మోహన్‌రావును కలువగా తనకు ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తే బీమా సొమ్మును రిలీజ్చేస్తామని తెలిపాడు. తాను పోలీస్ అధికారిని అని కూడా చెప్పాడు. ఇక్కడ ఎవరైనా ఒకటే.. లంచం ఇస్తేనే పని అవుతుందని మోహన్‌రావు తేల్చిచెప్పాడు. ఆయనకు ముట్ట చెబితేనే .. ఏసీబీకి పట్టుబడ్డ మోహన్‌రావు గతంలో నిజామాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో పనిచేసాడు. తన కార్యాలయానికి బీమా డబ్బు కోసం వచ్చే ఉద్యోగ విరమణ పొందిన వారికి రావలసిన సొమ్ము చెల్లించాలంటే ఈ అధికారికి లంచం ఇవ్వాల్సిందే. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ఈ అధికారికి లంచం ముట్టజెప్పితేనే, లేదంటే చెప్పులు అరిగిపోవాల్సిందే. కార్యాలయం చుట్టూ తిరగలేక చివరకు ఏడీ మోహన్‌రావు అడిగిన లంచం చెల్లిస్తూ ఉంటారు. ఇలా చిక్కిన అవినీతి చేప.. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ బుచ్చయ్యను పదేపదే లంచం అడుగుతుండగా చివరకు విసిగిపోయిన ఆయన ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించాడు. దీంతో మోహన్‌రావును అరెస్ట్ చేయడానికి సిబ్బంది పథకం వేసారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ అధ్వర్యంలో రసాయనం పూసిన ఐదువందల రూపాయలు ఎనిమిదివేలను బుచ్చయ్యకు సోమవారం ఇచ్చి పంపారు. బుచ్చయ్య వెళ్లి ఏడీ మోహన్‌రావును కలిసి ఎనిమిది వేల రూపాయలను ఇచ్చాడు. అదే సమయంలో అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది ఒక్కసారిగా దాడి చేసి మోహన్‌రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో కార్యాలయంలో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ బృందం వెళ్లేవరకు ఎల్ఐసీ ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. మోహన్‌రావును ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం హాజరుపరుస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వరంగల్ ఏసీబీ సీఐలు çవెంకట్, క్రాంతికుమార్ సిబ్బంది చారి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈ-సేవా కేంద్రాల ద్వారా చిన్న పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం తక్కువగా ఉండి ఏజెంట్లు విక్రయించడానికి అంతగా ఆసక్తి చూపని చిన్న పాలసీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) ప్రకటించింది. సంక్లిష్టమైన పథకాలు కాకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే పథకాలను ఎంపిక చేసి వాటిని ఈ-సేవా, మీ-సేవా వంటి ఉమ్మడి కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని, వచ్చే రెండు మూడు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఇందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, చిన్న ప్రీమియాలున్న జీవిత బీమా పాలసీలతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన ట్రాక్టర్, మోటార్ ఇన్సూరెన్స్ పథకాలను ఈ సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. బీమా ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేసే యోచనలో ఉన్నామని, ప్రస్తుతం ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ జీవిత బీమా మార్కెట్ విలువ జీడీపీలో 3.8%గా ఉందని, ఇది ఆరు శాతానికి చేరే అవకాశాలున్నాయన్నారు. బ్యాంకులు మంచి పాలసీలు సూచించాలి బ్యాంకులు తమ ఖాతాదారులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని పాలసీల్లో మంచిదాన్ని సూచించాలే కాని ఒకే కంపెనీకి చెందిన పాలసీని సూచించడం సరికాదని విజయన్ అన్నారు. బ్యాంకులు ఏజెంట్‌గా కాకుండా బ్రోకరుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే బ్యాంక్ అష్యూరెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసి ఈ నెలాఖరు వరకు సూచనలు ఆహ్వానించిందని, వచ్చే రెండు మూడు నెలల్లో తుది మార్గదర్శకాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.