ఈ-సేవా కేంద్రాల ద్వారా చిన్న పాలసీలు | Irda plans pilot to roll out small policies through e-Seva | Sakshi
Sakshi News home page

ఈ-సేవా కేంద్రాల ద్వారా చిన్న పాలసీలు

Published Sat, Dec 28 2013 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

విజయన్

విజయన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం తక్కువగా ఉండి ఏజెంట్లు విక్రయించడానికి అంతగా ఆసక్తి చూపని చిన్న పాలసీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏ) ప్రకటించింది. సంక్లిష్టమైన పథకాలు కాకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే పథకాలను ఎంపిక చేసి వాటిని ఈ-సేవా, మీ-సేవా వంటి ఉమ్మడి కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని, వచ్చే రెండు మూడు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఇందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, చిన్న ప్రీమియాలున్న జీవిత బీమా పాలసీలతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన ట్రాక్టర్, మోటార్ ఇన్సూరెన్స్ పథకాలను ఈ సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు.

 శుక్రవారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. బీమా ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేసే యోచనలో ఉన్నామని, ప్రస్తుతం ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ జీవిత బీమా మార్కెట్ విలువ జీడీపీలో 3.8%గా ఉందని, ఇది ఆరు శాతానికి చేరే అవకాశాలున్నాయన్నారు.

బ్యాంకులు మంచి పాలసీలు సూచించాలి
బ్యాంకులు తమ ఖాతాదారులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని పాలసీల్లో మంచిదాన్ని సూచించాలే కాని ఒకే కంపెనీకి చెందిన పాలసీని సూచించడం సరికాదని విజయన్ అన్నారు. బ్యాంకులు ఏజెంట్‌గా కాకుండా బ్రోకరుగా వ్యవహరించాలన్నారు.  ఇప్పటికే బ్యాంక్ అష్యూరెన్స్‌కు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసి ఈ నెలాఖరు వరకు సూచనలు ఆహ్వానించిందని, వచ్చే రెండు మూడు నెలల్లో తుది మార్గదర్శకాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement