integrated tribal development agency
-
ఐటీడీఏ విఫలం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించి న లక్ష్యం నెరవేర్చలేక పోయింది. ప్రభుత్వం ఏటా రూ.కోట్లు గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తోంది. ఐటీడీఏ అధికార యంత్రాంగం వాటిని వినియోగించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు దాదాపు రూ.23.46 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.10.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా నిధులు గిరిజనులకు అందకుండా మురిగి పోనున్నాయి. రూ.23.46 కోట్లతో ప్రణాళికలు జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో 44 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 4.95 లక్షలకుపైగా గిరిజన జనాభా ఉంది. వీరికి ఐటీడీఏ అమలు చేసే అభివృద్ధి పథకాలు వర్తిస్తాయి. వీరి అభివృద్ధి కోసం ఐటీడీఏ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాయ పథకాల కింద వ్యవసాయం, చిన్ననీటి పారుదల, స్వయం ఉపాధి, నూతన కల్పన, రవాణ, భూమి కొనుగోలు వంటి పథకాలు, ఐఎస్బీ, పశుసంవర్థకం, మత్స్య, నైపుణ్య శిక్షణలు ఇలా ఆర్థిక సహయ పథకాలకు రూప కల్పన చేసింది. ఈ పథకాల ద్వారా 3,570 యూనిట్లతో గిరిజనులకు మేలు చేకూర్చాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యేక సహాయనిధి, టీఎస్పీ ద్వారా రూ.5.33 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్(వోజీఐఏ) ద్వారా రూ.5.04 కోట్లు, బ్యాంక్, ఎంఎంఎస్ ఇతర రకాలుగా రూ.13.08 కోట్లు కలిపి మొత్తం రూ.23.46 కోట్లతో గిరిజనుల ఆర్థిక సహాయానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో విఫలమైంది. గిరిజనాభివృద్ధిపై పట్టింపేది? జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పని చేస్తోంది. 44 మండలాల్లో ఉన్న గిరిజనులకు కేంద్ర స్థానం ఐటీడీఏనే. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కో సం ఐటీడీఏ పలు పథకాలు రూపొందించి అమలు చే యాలి. అదికాక వారి అభివృద్ధి కోసం సబ్సిడీతో కూడి న రుణాలు అందిస్తూ చేయూత ఇవ్వాలి. ఇందుకోసం ఐటీడీఏ దాదాపు రూ.23.46 కోట్లతో 3,570 యునిట్లు అందించాలని నిర్ణయించి ఆచరణలో విఫలమైంది. ఆర్థిక సంవత్సరం నెలాఖరు వరకు కేవలం 893 యునిట్ల ను 900 మంది గిరిజనులకు అందించింది. ఇందుకో సం కేవలం రూ.10.51 కోట్లు ఖర్చు చేశారు. అయితే నూతన కల్పన పథకాలు, భూమి కొనుగోలు, నైపుణ్య శిక్షణలో ఒక్క గిరిజనులకు ఐటీడీఏ లబ్ధి చేకూర్చలేక పోయింది. మార్చితో 2013-14ఆర్థిక సంవత్సరం ము గియడంతో 2,677 యూనిట్లు గిరిజనులకు అందకుం డా పోగా మిగతా రూ.12.95 కోట్ల నిధులు మిగిలిపోయాయి. అయితే మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఖర్చు చేయలేక పోయామని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ని సాకులు చెప్పినా గిరిజనులకు మాత్రం అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. -
నల్లమలలో పర్యాటక కేంద్రాలు
ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నల్లమలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆత్మకూరు అటవీ పరిధిలోని రుద్రకోడు క్షేత్రం, స్మృతివనం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి అయిన నల్లమలలో ఎకో ఫ్రెండ్లీ టూరిజంను ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ముందుకు వచ్చిందన్నారు. అందులో భాగంగానే రెండు రోజుల పాటు స్థలాలను పరిశీలించామన్నారు. అయితే ఇవన్నీ పర్యాటక శాఖ అనుమతులతోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటి ఏర్పాటు కోసం జిల్లాకు ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా కోటి రూపాయలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఆత్మకూరు ప్రాంతంలోని స్మృతివనం, రుద్రకోడు క్షేత్రం, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం, శ్రీశైలం ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల వివరాలు తెలిపేందుకు గైడ్లను నియమిస్తామన్నారు. స్మృతివనం పరిసర ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 563లోని ఆరు ఎకరాల స్థలంలో పది గృహాలు, ఒక డార్మెటరీ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం కర్నూలు నుంచి రోళ్లపాడు మీదుగా రుద్రకోడు, స్మృతివనం ప్రాంతాలను చూపిస్తామన్నారు. విద్యార్థులను బాగా చదివించండి: ఐటీడీఏ పీఓ చెంచులు తమ పిల్లలను బాగా చదివించాలని ఐటీడీఏ పీఓ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. రుద్రకోడు గూ డెంలో పర్యటించిన ఆయన చెంచులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరి శీలించి స్వయం సహాయక సంఘాల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఓ మురళీధర్, ఐటీడీఏ స్పెషలాఫీసర్ కేజీ.నాయక్ పాల్గొన్నారు. -
మలేరియా కార్యాలయానికి గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. ఫలితంగా కార్యాలయం ఐటీడీఏపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది దోమల నివారణకు అధికారులు రూ.24లక్షలతో బడ్జెట్ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. సకాలంలో నిధులు విడుదల కాలేదు. దీంతో చేసేదేమీ లేక దోమల నివారణ కోసం ఏటీడీఏను ఆశ్రయించారు. ఐటీడీఏ బడ్జెట్ నుంచి జూలైలో పీవో సుమారు 12.28లక్షలు ముందస్తు రుణంగా ఇచ్చారు. మొదటి విడతగా దోమల నివారణకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు 879 గ్రామాల్లో పిచికారీ చేయించారు. మలివిడత అవసరానికి నెల క్రితం మరో రూ.3లక్షలు తీసుకున్నారు. తీరా ప్రభుత్వం గత నెలలో రూ.12లక్షలు బడ్జెట్ విడుదల చేయడంతో ఆ నిధులను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉండడంతో కార్యాల యంలో మళ్లీ నిధుల కొరత ఏర్పడినట్లయింది. ఆశ కార్యకర్తలకు దోమల నివారణ బాధ్యత ప్రభుత్వం ప్రతిసారి దోమల నివారణకు స్ప్రే బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించేది. ఈసారి గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు అప్పగించారు. గ్రామాల్లో స్ప్రే కోసం రెండు విడుతలుగా 14టన్నుల ఏసీఎం(ఆల్ట్రా సైప్లోత్రిన్) మందు వచ్చింది. ఏజెన్సీలో పిచికారీ చేయడానికి స్టీరఫ్ పంపులు లేకపోవడంతో ఐటీడీఏ సబ్‌సెంటర్లకు వచ్చే అన్‌టైడ్ నిధుల నుంచి తర్వాత చెల్లించేలా ఒక్కో పంపునకు రూ.3,590 వెచ్చించి 50 కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో గ్రామా ల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దోమల మందు స్ప్రేకు ఇంటికి రూ.14 వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. సిబ్బంది కొరత మలేరియా కార్యాలయంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎంవో రెండు పోస్టులు, ఎంపీహెచ్‌ఈవో, హెల్త్‌అసిస్టెంట్, డ్రైవర్, మెకానికల్ అధికారి ఒక్కో పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు 6, ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో జిల్లాలో మలేరియా వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. కార్యాలయానికి వాహ న సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న రెండు వాహనాలు చెడిపోయా యి. కార్యాలయ అవసరాలకు కొత్త వాహనం కావాలని 2008 నుంచి అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. దోమతెరలజాడే లేదు జిల్లాలో రోజురోజుకు మలేరియా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 2008 నుంచి జిల్లాలో దోమతెరల పంపిణీ నిలిచిపోయింది. గతంలో ఇచ్చిన 84 వేల తెరలు మినహా ఇప్పటికీ పంపిణీ లేకుండా పోయింది. మూడేళ్లుగా జిల్లా అధికారులు లక్షా 65 వేల దోమతెరలు కావాలంటూ ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలే అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వియాత్నం నుంచి పది లక్షల దోమతెరలు తెప్పించి పంపిణీకీ శ్రీకారం చుట్టినా ఆదిలాబాద్ జిల్లాను విస్మరించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఖమ్మం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు పంపిణీ చేసింది.