ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించి న లక్ష్యం నెరవేర్చలేక పోయింది. ప్రభుత్వం ఏటా రూ.కోట్లు గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తోంది. ఐటీడీఏ అధికార యంత్రాంగం వాటిని వినియోగించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు దాదాపు రూ.23.46 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.10.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా నిధులు గిరిజనులకు అందకుండా మురిగి పోనున్నాయి.
రూ.23.46 కోట్లతో ప్రణాళికలు
జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో 44 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 4.95 లక్షలకుపైగా గిరిజన జనాభా ఉంది. వీరికి ఐటీడీఏ అమలు చేసే అభివృద్ధి పథకాలు వర్తిస్తాయి. వీరి అభివృద్ధి కోసం ఐటీడీఏ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాయ పథకాల కింద వ్యవసాయం, చిన్ననీటి పారుదల, స్వయం ఉపాధి, నూతన కల్పన, రవాణ, భూమి కొనుగోలు వంటి పథకాలు, ఐఎస్‌బీ, పశుసంవర్థకం, మత్స్య, నైపుణ్య శిక్షణలు ఇలా ఆర్థిక సహయ పథకాలకు రూప కల్పన చేసింది. ఈ పథకాల ద్వారా 3,570 యూనిట్లతో గిరిజనులకు మేలు చేకూర్చాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యేక సహాయనిధి, టీఎస్‌పీ ద్వారా రూ.5.33 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్(వోజీఐఏ) ద్వారా రూ.5.04 కోట్లు, బ్యాంక్, ఎంఎంఎస్ ఇతర రకాలుగా రూ.13.08 కోట్లు కలిపి మొత్తం రూ.23.46 కోట్లతో గిరిజనుల ఆర్థిక సహాయానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో విఫలమైంది.
గిరిజనాభివృద్ధిపై పట్టింపేది?
జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పని చేస్తోంది. 44 మండలాల్లో ఉన్న గిరిజనులకు కేంద్ర స్థానం ఐటీడీఏనే. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కో సం ఐటీడీఏ పలు పథకాలు రూపొందించి అమలు చే యాలి. అదికాక వారి అభివృద్ధి కోసం సబ్సిడీతో కూడి న రుణాలు అందిస్తూ చేయూత ఇవ్వాలి. ఇందుకోసం ఐటీడీఏ దాదాపు రూ.23.46 కోట్లతో 3,570 యునిట్లు అందించాలని నిర్ణయించి ఆచరణలో విఫలమైంది.
ఆర్థిక సంవత్సరం నెలాఖరు వరకు కేవలం 893 యునిట్ల ను 900 మంది గిరిజనులకు అందించింది. ఇందుకో సం కేవలం రూ.10.51 కోట్లు ఖర్చు చేశారు. అయితే నూతన కల్పన పథకాలు, భూమి కొనుగోలు, నైపుణ్య శిక్షణలో ఒక్క గిరిజనులకు ఐటీడీఏ లబ్ధి చేకూర్చలేక పోయింది. మార్చితో 2013-14ఆర్థిక సంవత్సరం ము గియడంతో 2,677 యూనిట్లు గిరిజనులకు అందకుం డా పోగా మిగతా రూ.12.95 కోట్ల నిధులు మిగిలిపోయాయి. అయితే మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఖర్చు చేయలేక పోయామని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ని సాకులు చెప్పినా గిరిజనులకు మాత్రం అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం.