utnur
-
ఆదిలాబాద్: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!
సాక్షి, ఆదిలాబాద్: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్‌తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది. -
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
ఆదిలాబాద్ : రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం జైత్రాం తండాలో ఇరు వర్గాల ఘర్షణ విషయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సంజీవ్, బ్రహ్మానంద్లను జిల్లా ఎస్పీ విష్ణు సస్పెండ్ చేశారు. -
అడవి బిడ్డల ‘స్వయంపాలన’!
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీలు ముందుగా చెప్పినట్లుగానే గూడేల్లో స్వయం పాలనను ప్రారంభించారు. మావ నాటే మావ రాజ్.. మావ నాటే మావ సర్కార్.. అనే నినాదంతో అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో చర్చలు విఫలమైన తర్వాత గూడేల్లో స్వయం పాలనను గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పిన తుడుందెబ్బ నేతలు.. ఆ దిశగానే కదిలారు. కుమురంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాల మధ్య స్వయం పాలనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ గూడేల్లో చాలాచోట్ల ఇలాంటి సంబరాలే జరిగాయి. అధికారులు, టీచర్ల అడ్డగింత: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడేల్లో శుక్రవారం ఉదయం నుంచే ఉద్యమం ప్రారంభించారు. గూడేల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల నుంచి వెళ్లిపోవాలంటూ లంబాడా ఉపాధ్యాయులను కోరారు. శనివారం నుంచి అసలు రావద్దని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లో, కుమురంభీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో లంబాడా ఉపాధ్యాయులను రానివ్వలేదు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన సాగలేదు. నార్నూర్ మండలంలోని జమాడలో ఆదివాసీలపై లంబాడా ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్యకు లంబాడా ఉపాధ్యాయులు సమాచారం అందించగా.. ఎలాంటి వివాదం చేయకుండా ఐటీడీఏకు తిరిగి రావాలని వారికి చెప్పినట్లు సమాచారం. నేడు తుడుందెబ్బ జెండాల ఆవిష్కరణ ఆదివాసీ సంఘాలు ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గూడేలన్నింటిలో తుడుందెబ్బ జెండాను ఆవిష్కరించాలని ఆదివాసీలు నిర్ణయించారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తును మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నిషేధిత గ్రామం.. మావ నాటే మావ రాజ్.. మావ నాటే మావ సర్కార్.. అవర్ విలేజ్ అవర్ రూల్.. అవర్ విలేజ్ సెల్ఫ్ గవర్నమెంట్.. అండర్ యాక్ట్ 243, 244(1) పెసా చట్టాన్ని అనుసరించి పైన తెలుపబడిన నినాదం మా ఊళ్లో అమలులో ఉన్నది. కావున అనుమతి లేనిదే లోనికి ప్రవేశించకూడదు. పెసా కార్యకర్త, గ్రామ పటేల్‌ను సంప్రదించాలి. ఇట్లు మార్లవాయి గ్రామస్తులు..’’ఇది కుమురంభీం జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ పొలిమేరలో శుక్రవారం వెలసిన బోర్డు. -
పోలీస్ పహారాలో ఉట్నూరు ఏజెన్సీ
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలుగా ఉన్న ఉట్కూరు, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో భారీ బందోబస్తు కల్పించారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సర్పూర్, కెరమెరిలో 144 సెక్షన్ విధించారు. ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ కలమేష్సింగనవార్ ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉట్నూరు ఏజెన్సీలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. -
మావోలతో జతకడితే ఖబర్దార్
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టులు, అనుబంధ సంఘలతో సంబంధాలు నేరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రాంత ప్రజలను డీజీపీ హెచ్చరించారు. ఆదివాసీలు-లంబాడాల గొడవల నేపధ్యంలో మావోలు అదనుగా తీసుకునే అవకాశం ఉందని ఆయన పోలీసులను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఉట్నూరులో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, లంబాడీ - ఆదివాసీల వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీఐజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జనజీవనం, విద్యార్థుల చదువుకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు మహేందర్‌రెడ్డి సూచించారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తెలుత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా అక్కడి పరిస్థితి ఉంది. కాగా... ఘర్షణలను ముందే పసిగట్టలేకపోవడం, వాటిని అదుపు చేయలేకపోయారన్న కారణంతో మూడు జిల్లాల కలెక్టర్లు, ఓ డీఐజీని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఘర్షణలను అరికట్టలేకపోయారన్న అపవాదును పోలీస్ శాఖ మూటకట్టుకున్న నేపధ్యంలో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
వాగులో పడి ముగ్గురి మృతి
-
వాగులో పడి ముగ్గురి మృతి
ఉట్నూర్ (ఆదిలాబాద్) : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక యువకుడు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 15 మంది సభ్యులు సోమవారం ఉదయం సమీపంలోని కన్నాపూర్ వాగు వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఎస్కే రేష్మా(9), ఎస్కే నసీమాబాను(15), ఎస్కే ముజాహిద్(18)లు వాగులో పడిపోయారు. రక్షించేలోగానే వారు నీట మునిగి చనిపోయారు. -
ఆదిలాబాద్ ఉట్నూరు వద్ద రోడ్డు ప్రమాదం
-
ప్రచార ఖర్చు లెక్క చెప్పాల్సిందే..
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల అడుగులో అడుగై.. నీడలా వెంటాడే యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. ఓటర్లను ఆకర్షించేందుకు గతంలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసేవారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోరింగ్‌లు, గోడరాతలతో ప్రచారాన్ని హోరెత్తించేవారు. ఫలితంగా ప్రచార వ్యయం పరిమితి దాటిపోయేది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క చెప్పేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్ష, జెడ్పీటీసీ అభ్యర్థి రూ.2లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అభ్యర్థి గుండుపిన్ను కొనుగోలు చేసినా ఆ విషయం అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టారు. ప్రచారంలో ఎంతమంది పాల్గొంటున్నారు, వారికి రోజు ఎంత ఖర్చు చేస్తున్నారు, తదితర క్షేత్ర స్థాయి సమాచారాన్ని నిఘా సిబ్బంది అధికారులకు చేరవేస్తున్నారు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు అందించిన ఒకటి, రెండు ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి సమర్పించాలి. వీటిని అభ్యర్థి లేదా అతని తరఫు ఏజెంట్లు(లెక్కల నిర్వహణ కోసం నియమించిన వారు) అందించవచ్చు. వీటిని స్వీకరించిన అధికారులు ఎన్నికల ఖర్చు పరిశీలనకు పంపిస్తారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. నాలుగు రకాలుగా నిఘా బరిలో ఉన్న అభ్యర్థులపై అధికార యంత్రాంగం నాలుగు రకాలుగా నిఘా పెట్టింది. వీరు అభ్యర్థులు పాటిస్తున్న ఎన్నికల నిబంధనలు, చేస్తున్న ఖర్చు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొదటిది.. ఎంసీసీ(మాడల్ కోడ్ కండక్ట్) ఈ విభాగంలో ఎంపీడీవో, వీడియో గ్రాఫర్, ఇద్దరు పోలీసులు ఉంటారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది పరిశీలిస్తారు. రెండోది.. ఫ్లయింగ్‌స్క్వాడ్ ఈ విభాగంలో డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి, వీడియోగ్రాఫర్, ఒక పోలీసు ఉంటారు. వీరు అభ్యర్థుల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. మూడోది.. ఎస్ఎస్టీ(సర్వేలైన్ స్టాటిస్టికల్ టీం) ఇందులో డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి, పోలీసు, వీడియో గ్రాఫర్ ఉంటారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర అంశాలు పరిశీలిస్తుంటారు. నాలుగోది.. వీడియో వింగ్ టీం పత్రికల్లో, టీవీల్లో అభ్యర్థుల ప్రచారంపై వస్తున్న ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్, పత్రిక ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం తదితర అంశాలను పరిశీలించి నివేదిస్తారు. ఖర్చు వివరాలు తెలుపకుంటే చర్యలు అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఖర్చు వివరాలు తెలుపకుంటే కఠిన చర్యలు ఉంటాయి. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనుమతి లేకుండా అతని విజయం కోసం ఎవరైన ఖర్చు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. -
ఐటీడీఏ విఫలం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించి న లక్ష్యం నెరవేర్చలేక పోయింది. ప్రభుత్వం ఏటా రూ.కోట్లు గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తోంది. ఐటీడీఏ అధికార యంత్రాంగం వాటిని వినియోగించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు దాదాపు రూ.23.46 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ.10.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా నిధులు గిరిజనులకు అందకుండా మురిగి పోనున్నాయి. రూ.23.46 కోట్లతో ప్రణాళికలు జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో 44 మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 4.95 లక్షలకుపైగా గిరిజన జనాభా ఉంది. వీరికి ఐటీడీఏ అమలు చేసే అభివృద్ధి పథకాలు వర్తిస్తాయి. వీరి అభివృద్ధి కోసం ఐటీడీఏ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాయ పథకాల కింద వ్యవసాయం, చిన్ననీటి పారుదల, స్వయం ఉపాధి, నూతన కల్పన, రవాణ, భూమి కొనుగోలు వంటి పథకాలు, ఐఎస్బీ, పశుసంవర్థకం, మత్స్య, నైపుణ్య శిక్షణలు ఇలా ఆర్థిక సహయ పథకాలకు రూప కల్పన చేసింది. ఈ పథకాల ద్వారా 3,570 యూనిట్లతో గిరిజనులకు మేలు చేకూర్చాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యేక సహాయనిధి, టీఎస్పీ ద్వారా రూ.5.33 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్(వోజీఐఏ) ద్వారా రూ.5.04 కోట్లు, బ్యాంక్, ఎంఎంఎస్ ఇతర రకాలుగా రూ.13.08 కోట్లు కలిపి మొత్తం రూ.23.46 కోట్లతో గిరిజనుల ఆర్థిక సహాయానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో విఫలమైంది. గిరిజనాభివృద్ధిపై పట్టింపేది? జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ పని చేస్తోంది. 44 మండలాల్లో ఉన్న గిరిజనులకు కేంద్ర స్థానం ఐటీడీఏనే. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కో సం ఐటీడీఏ పలు పథకాలు రూపొందించి అమలు చే యాలి. అదికాక వారి అభివృద్ధి కోసం సబ్సిడీతో కూడి న రుణాలు అందిస్తూ చేయూత ఇవ్వాలి. ఇందుకోసం ఐటీడీఏ దాదాపు రూ.23.46 కోట్లతో 3,570 యునిట్లు అందించాలని నిర్ణయించి ఆచరణలో విఫలమైంది. ఆర్థిక సంవత్సరం నెలాఖరు వరకు కేవలం 893 యునిట్ల ను 900 మంది గిరిజనులకు అందించింది. ఇందుకో సం కేవలం రూ.10.51 కోట్లు ఖర్చు చేశారు. అయితే నూతన కల్పన పథకాలు, భూమి కొనుగోలు, నైపుణ్య శిక్షణలో ఒక్క గిరిజనులకు ఐటీడీఏ లబ్ధి చేకూర్చలేక పోయింది. మార్చితో 2013-14ఆర్థిక సంవత్సరం ము గియడంతో 2,677 యూనిట్లు గిరిజనులకు అందకుం డా పోగా మిగతా రూ.12.95 కోట్ల నిధులు మిగిలిపోయాయి. అయితే మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఖర్చు చేయలేక పోయామని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ని సాకులు చెప్పినా గిరిజనులకు మాత్రం అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. -
మృత్యుకూపాలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : బంగారు భవిష్యత్తు కోసం గిరిజన విద్యాలయాల్లో చేరుతున్న విద్యార్థులు మృత్యుఒడికి చేరుతున్నారు. విద్యనందించాల్సిన గిరిజన ఆవాసాలు ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. తమ లక్ష్యం సాధించకుండానే ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తు న్నాయి. తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. బా గా చదువుకుని సమాజానికి, తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకొస్తారనుకుంటే మ ధ్యలోనే వెళ్లి‘పోతున్నారు’. ప్ర ధానంగా గిరిజన విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినీవిద్యార్థులకు భద్రత లేకపోవడమే కారణం. గురువులు విద్యార్థుల భవిష్యత్తుకు, ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదు. సిబ్బంది ఇష్టారాజ్యం ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా దాదాపు 45,571 మంది గిరిజ న విద్యార్థులు ఆశ్రమ, గురుకుల, కేజీబీవీ, రెసిడెన్షియ ల్, మినీ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఉచిత భోజన వసతితో కూడిన విద్య అంది స్తోంది. వీరి పరిరక్షణ బాధ్యతను ఆయా సిబ్బంది, గిరిజన సంక్షేమ అధికారులు చూసుకుంటారు. చాలా చోట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బం ది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం పాలైన పట్టించుకోవడం లేదు. విద్యార్థులు రాత్రి, పగలు అనుమతి లేకుండా బయటకు వెళ్లిన అడిగే వారు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. 46 మంది విద్యార్థులు బలి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విద్యాలయాల్లో 2006 సె ప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 మంది విద్యార్థులు అనారోగ్యం, జ్వరం, ఆత్మహత్య, ప్రమాదాలు, పాముకాటుతో మృతిచెందారు. వీరిలో అధికంగా అనా రోగ్యంతో ఆశ్రమాల్లో చదువుతూ మృతిచెందిన వారు ఉండటం కలవరానికి గురిచేస్తోంది. విద్యాలయాల్లో చ దువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి చేయిదాటితే త ప్పా సిబ్బంది, వైద్య సిబ్బంది పట్టించుకోరనే ఆరోపణ లున్నాయి. సకాలంలో స్పందించి కనీసం వారి తల్లిదం డ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించి ఉంటే చాలా మంది బతికే వారు. ఇదీకాక విద్యార్థులకు మెనూ ప్ర కారం భోజనం అందించకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతున్నారు. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల వారీగా డ బ్బులు విడుదల చేస్తున్నా అధికారులు, సిబ్బంది కుమ్మ క్కై నాణ్యమైన ఆహారం, వైద్యం, విద్య అందించడం లే దు. బోధకులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, వార్డెన్లు స్థానికంగా ఉండక పోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్ష ణ కరువవడం విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. గిరిజన విద్యను పర్యవెక్షించే డీడీటీడబ్ల్యూ పోస్టు ఖాళీగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిబంధనలు గాలికి.. గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులను తల్లిదండ్రులు కలవాలంటే వార్డెన్ అనుమతి తీసుకుని, వారి వివరాలు మూమెంట్ రిజిస్టర్లో పొందుపరిచాకే కలవనియాలి. కానీ, ఈ విధానం అమలుకావడం లేదు. విద్యాలయాల్లో విద్యార్థులు చేరే ముందు వారి తల్లిదండ్రులకు ఐడీ కార్డు జారీ చేస్తారు. మరోకటి పాఠశాలలో పెడతారు. ఆ కార్డులో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటాయి. ఆ ఫొటోలో ఉన్న వారు కార్డు తీసుకొస్తేనే విద్యార్థులను కలువడానికి లేదా ఇళ్లకు పంపడానికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ కానరావడం లేదు. విద్యాలయాల్లో రాత్రివేళ విధులు నిర్వహించే సిబ్బంది సరిగ్గా ఉండటం లేదు. సమస్యలు వస్తే పట్టించుకునే వారు కరువయ్యారు. సాయంత్రం వేళ విద్యార్థుల హాజరు వార్డెన్ తీసుకోవాలి. కాని ఆ పనిని విద్యార్థులకు అప్పగించడంతో విద్యార్థులు ఎవరున్నారో తెలియని పరిస్థితి. విద్యార్థులను బయటకు పంపించడానికి వీలు లేదు. ముఖ్యంగా బాలుర విద్యాలయాల్లోని విద్యార్థులు తమ ఇష్టారీతిన బయటకు వస్తున్నారు. -
చీకట్లోనే..
ఉట్నూర్/కాసిపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని సంకల్పించింది. 0 నుంచి 50 యూనిట్ల లోపు కరెం టు వినియోగించుకున్న కుటుంబాలకు ఎస్టీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద బిల్లు మాఫీ చేస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, ఏజెన్సీ అధికారులకు అప్పగించిం ది. వీరు 20,260 ఎస్సీ, 17,734 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని రచ్చబండ సందర్భంగా తెలిపారు. రూ.18.20 కోట్లు మాఫీ 0-50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలను సెప్టెంబర్ నుంచే అధికారులు గుర్తిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే ఆరునెలలు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న కుటుంబాల వారు చెల్లించిన బిల్లులను తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏ రూపకంగా చెల్లిస్తుందనేది ప్రభుత్వం ప్రకటించనుంది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు రూ.18.20 కోట్ల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మండలాల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలు వారి కుల ధ్రువీకరణ పత్రాలు విద్యుత్ కార్యాలయాల్లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు ప్రచారం కల్పించక పోవడంతో కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం లేదు. పూర్తిస్థాయిలో బిల్లు చెల్లిస్తున్నారు. కొందరు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ గూడాలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేస్తున్నారు. వారం రోజులుగా చీకట్లోనే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వర్తించే కాసిపేట మండలం ఇప్పలగూడ, రేగులగూడ గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు గ్రామాల్లో 33 కుటుంబాలకు చెందిన 180 మంది బిక్కుబిక్కమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రయిందంటే అందరూ ఒకటే చోట చేరుతున్నారు. దీపాల వెలుతురులో వంటలు చేసుకుని భోజనం చేస్తున్నారు. చంటి పిల్లలను వేసుకుని చీకట్లోనే నిద్రిస్తున్నారు. విషపురుగులు, క్రూరమృ గాలు రాకుండా మంటలు వేసుకుంటున్నారు. భయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అసలే తూర్పు ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దాని భారిన పడితే అందరూ మృత్యువాత పడే అవకాశం ఉంది. జైపూర్ పవర్ ప్లాంటు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ఏజెన్సీలో ఉండే గ్రామాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రూ. వేలల్లో బిల్లులు అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని కరెంటు కట్ చేశారు. ఇక మాకు 30 యూనిట్లు కూడా కరెంటు వినియోగం కాదు. మేమందరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అర్హులమే. 50 యూనిట్లలోనే అందరం కరెంటు వినియోగించుకుంటాం. బిల్లులు మాత్రం రూ.వేలల్లో వస్తున్నాయి. విద్యుత్ అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మేము కూలీకి వెళ్లేచ్చే వరకు బిల్లు మాత్రం తలుపులకు ఉంటుంది. తొమ్మిది నెలల నుంచి బిల్లుకట్టని మాట వాస్తవామే సబ్‌ప్లాన్‌లో మాఫీ చేయడం తరువాత ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు బిల్లులు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు యాభై యునిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు కాకముందే ఆయా గూడాలకు విద్యుత్ నిలిపి వెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైన అధికారులు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని గిరిజనులు పేర్కొంటున్నారు. -
సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ వివాదంపై హైకోర్టు ఇచ్చిన స్టేను మంగళవారం ఎత్తివేసింది. ఎస్టీ కాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై సుమన్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విధితమే. 2009 సాధారణ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ అప్పటి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉయికే సంజీ వ్తోపాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నదీం విచారణ చేపట్టి ఆమె మహారాష్ట్రలోని బీసీ కులానికి చెందిన మహిళ అని 2009 అక్టోబర్‌లో తీర్పునిచ్చారు. కలెక్టర్ తీర్పును సవాలు చేస్తూ సుమన్‌రాథోడ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇదే సమయంలో 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మిరా హరినాయక్ హైకోర్టులో కేసు వేయడంతో 2010 డిసెంబర్లో సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ తీర్పు వెలువడింది. పైకోర్టుకు అప్పీ లు చేసుకునే అవకాశం కల్పించడంతో అదే నెలలో సుమన్‌రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 2012 సెప్టెం బర్లో కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విస్తృత ధర్మాసనం త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అయితే మంగళవారం 2009 అక్టోబర్‌లో అప్పటి కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై విధించిన స్టేను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు యథావిధిగా ఉంది. అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం ఉంది.. - సుమన్‌రాథోడ్ మంగళవారం సాయంత్రం సుమన్‌రాథోడ్ తన నివాసం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై ఉన్న ఎస్టీ కాదనే వివాదంపై కలెక్టర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్టేను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. -
వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత
ఉట్నూర్, (జన్నారం)/సిర్పూర్(టి)/లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ : జన్నారం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన ప్రేమ జంట శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వీరిని మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం మంగేళకు చెందిన రోండి రంజిత్ (21), పడిగెల వనజ (16) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రంజిత్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగా వనజ పదో తరగతితో చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతోంది. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ, పెళ్లికి పెద్దలు అంగీకరించబోరని భయపడ్డారు. ఈ క్రమంలో వారిద్దరూ శనివారం జన్నారం మండల కేంద్రానికి చేరుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి బస్టాండ్ ప్రాంతం నుంచి కాలినడకన వస్తూ పాతబస్టాండ్ మార్కెట్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే హఠాత్తుగా కింద పడిపోయూరు. అక్కడే ఉన్న వారు 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయూరు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. అబ్బారుు వద్ద లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ప్రేమజంటది మంగేళ గ్రామంగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. వీరి మృతికి పూర్తి వివరాలు తెలియరాలేదని, బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. ఎవరి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో స్థానికులు చలించిపోయూరు. తాతామనవడు మృతి సిర్పూర్(టి)కి చెందిన ఎంఏ అజీజ్ (75), కోడలు జాకీరా (40), మరికొంత మంది బంధువులతో కలిసి మంచిర్యాలలోని పెద్ద కొడుకు అజీజ్ వద్దకు గురువారం వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి రైలు ద్వారా సిర్పూర్(టి)కి వచ్చారు. వారిని తీసుకురావడానికి జాకీరా కొడుకు, అజీజ్ మనవడు ఎంఏ అల్లూష్ (18) ఆటో తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు. వారిని తీసుకుని వస్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అజీజ్, అల్లూష్ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. అజీజ్ వికలాంగ ధ్రువీకరణ పత్రం పొందేందుకు మంచిర్యాలకు వెళ్లాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది. కిలోమీటరు దూరంలో ఉన్న ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదం జరగడం అందరినీ కలిచివేసింది. కుటుంబ కలహాలతో.. లక్సెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పేరం గురువయ్య (40), ఉమ (35) దంపతులు. వీరికి ఇరవై ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి సౌజన్య, మేఘన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొద్ది రోజులుగా గురువయ్య అతిగా మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుండే వాడు. రోజూ ఎందుకు తాగుతున్నావు.. ఎందుకు గొడవ పెడుతున్నావని ఉమ మందలిస్తుండేది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావడానికి తోట వద్దకు వెళ్లారు. కూరగాయలు తెంపాలని గురువయ్యను ఉమ కోరగా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ అక్కడే ఉన్న పురుగుల మందు తాగారు. ఇరువురిని స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా ఉమ చనిపోయింది. గురువయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మృతురాలి తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే లతీఫ్ తెలిపారు. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్‌తో ఆందోళనలు ఉధృతం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఇద్దరి అధికారుల మధ్య ముదిరిన విభేదాలు ఐటీడీఏను అస్తవ్యస్తంగా మార్చాయి. ఐటీడీఏ పీవో జనార్దన్‌కు, డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదట నుంచి మనస్పర్థాలు ఉన్నాయని ప్రచారం ఉంది. రషీద్‌ను పీవో మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. పీవో చర్యలను నిరసిస్తూ ఐటీడీఏ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది లేక వెలవెల బోతోంది. పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు, ఇతరులు వెనుదిరిగి పోతున్నారు. సమస్యలు పరిష్కరించకుం టే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తొమ్మిది ఐటీడీఏలలో ఆందోళన నిర్వహిస్తామని ట్రైబల్ వెల్ఫెర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గోపాల్, కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. పరిస్థితి చేయిజారక ముందే ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సఖ్యత లేదని ప్రచారం.. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదటి నుంచే సఖ్యత లేదనే ప్రచారం ఐటీడీఏలో ఉంది. ఈ క్రమంలో పీవో నివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్, వంద మందికిపైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రషీద్‌కు పీవోకు పడక పోవడంతో జూలై 31న అనారోగ్యం కారణం చూపుతూ రషీద్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారని ప్రచారం ఉంది. రషీద్ స్థానంలో అప్పటి ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతలు చేపట్టారు. అయన పదవీ విరమణతో ఏవో భీమ్ డీడీటీడబ్ల్యూగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమశాఖలో సుపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నారాయణరెడ్డిని ఆశ్రమాలకు సరుకులు సకాలంలో సరఫరా చేయడం లేదని అక్టోబర్ 31న సస్పెండ్ చేశారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో తెలియక ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డీడీ విధుల్లో చేరడంతో.. అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీడీటీడబ్ల్యూ రషీద్ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. వేతన చెల్లింపులో సాంకేతికలోపం ఏర్పడటంతో అయనను ప్రభుత్వం తిరిగి యథాస్థానికి పంపించింది. గత నెల 28న రషీద్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 5న విధుల్లో చేరారు. అప్పటికే డీటీఏఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిజన సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తూ సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 9 నుంచి ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐటీడీఏ పీవో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడంతో 13 నుంచి 16వ తేదీ వరకు రషీద్ ఇన్చార్జి పీవోగా వ్యవహరించారు. ఈ సమయంలో 15న డీటీఏఫ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే జీవో ఎంఎస్ నంబర్ 274 ప్రకారం రషీద్‌ను పీవో సస్పెండ్ చేశారు. డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేకున్నా జీవో నంబర్ 274ను ఆధారంగా చూపుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఉద్యోగులంత ఏకమై ఆందోళన ఐటీడీఏ పీవో తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఏకమయ్యారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడం, నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకుండా విచారణ పేరిట కాలయాపన చేయడంపై ఆందోళన బాట పట్టారు. డీడీటీడబ్ల్యూ, గజిటెడ్, నాన్‌గజిటెడ్, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట అందోళన నిర్వహిస్తున్నారు. పీవో కిందిస్థాయి ఉద్యోగులతో పనులు చేయిస్తూ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలి కాని ఇలా చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. పీవో వైఖరి మార్చుకోకపోతే న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది. గిరిజనుల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. -
గిరిజన యూనివర్సిటీపై ఆశలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ కోసం జీవో నంబర్ 783ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే ఏడో నంబర్ జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణ సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఆదిలోనే అడ్డుకట్ట జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడంతో ఇతర జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనివర్సిటీ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లా భద్రాచలం, విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జిల్లాలోనే గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లో అందోళనలు జరిగాయి. వర్సిటీ ఏర్పాటు కోరుతూ హైదరాబాద్ వరకు ప్రస్తుత ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశారెడ్డి తన పదెళ్ల కుమారుడు సాయికుమార్‌తో కలిసి 340 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అటకెక్కిందని అంతా భావించారు. తాజాగా కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం.. కేంద్ర కేబినెట్ నోట్లోని పదకొండో అంశంలో విద్యాపరమైన అంశాల్లో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉండటంతో జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. గిరిజనులు అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కొత్త రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఎటురునాగారం, మహబూబ్‌నగర్ జిల్లా సుండిపేటలో ఐటీడీఏలు ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిలో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లాలనే. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిదికి పైగా ఆదివాసీ గిరిజన తెగలు జీవిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో మనకంటే తక్కువగా గిరిజనులు ఉన్నారు. జిల్లాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్దాన్లు 26,029, మన్నెవార్లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, ఎరుకల 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున జనాభా నివసిస్తున్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు కావడం వల్ల గిరిజనులు అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వర్సిటీ వల్ల గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచస్థాయిలో గిరిజనులు వివిధ రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులపైనే భారం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ రావాలంటే జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన బెట్టి జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నిస్తే యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అన్ని సౌకర్యాలున్న ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది మన జిల్లా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తెస్తారో చూడాలి. -
మలేరియా కార్యాలయానికి గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం జిల్లా మలేరియా కార్యాలయానికి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. ఫలితంగా కార్యాలయం ఐటీడీఏపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది దోమల నివారణకు అధికారులు రూ.24లక్షలతో బడ్జెట్ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. సకాలంలో నిధులు విడుదల కాలేదు. దీంతో చేసేదేమీ లేక దోమల నివారణ కోసం ఏటీడీఏను ఆశ్రయించారు. ఐటీడీఏ బడ్జెట్ నుంచి జూలైలో పీవో సుమారు 12.28లక్షలు ముందస్తు రుణంగా ఇచ్చారు. మొదటి విడతగా దోమల నివారణకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు 879 గ్రామాల్లో పిచికారీ చేయించారు. మలివిడత అవసరానికి నెల క్రితం మరో రూ.3లక్షలు తీసుకున్నారు. తీరా ప్రభుత్వం గత నెలలో రూ.12లక్షలు బడ్జెట్ విడుదల చేయడంతో ఆ నిధులను ఐటీడీఏకు చెల్లించాల్సి ఉండడంతో కార్యాల యంలో మళ్లీ నిధుల కొరత ఏర్పడినట్లయింది. ఆశ కార్యకర్తలకు దోమల నివారణ బాధ్యత ప్రభుత్వం ప్రతిసారి దోమల నివారణకు స్ప్రే బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించేది. ఈసారి గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు అప్పగించారు. గ్రామాల్లో స్ప్రే కోసం రెండు విడుతలుగా 14టన్నుల ఏసీఎం(ఆల్ట్రా సైప్లోత్రిన్) మందు వచ్చింది. ఏజెన్సీలో పిచికారీ చేయడానికి స్టీరఫ్ పంపులు లేకపోవడంతో ఐటీడీఏ సబ్‌సెంటర్లకు వచ్చే అన్‌టైడ్ నిధుల నుంచి తర్వాత చెల్లించేలా ఒక్కో పంపునకు రూ.3,590 వెచ్చించి 50 కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో గ్రామా ల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దోమల మందు స్ప్రేకు ఇంటికి రూ.14 వెచ్చిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. సిబ్బంది కొరత మలేరియా కార్యాలయంలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఏఎంవో రెండు పోస్టులు, ఎంపీహెచ్‌ఈవో, హెల్త్‌అసిస్టెంట్, డ్రైవర్, మెకానికల్ అధికారి ఒక్కో పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు 6, ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో జిల్లాలో మలేరియా వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. కార్యాలయానికి వాహ న సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న రెండు వాహనాలు చెడిపోయా యి. కార్యాలయ అవసరాలకు కొత్త వాహనం కావాలని 2008 నుంచి అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. దోమతెరలజాడే లేదు జిల్లాలో రోజురోజుకు మలేరియా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 2008 నుంచి జిల్లాలో దోమతెరల పంపిణీ నిలిచిపోయింది. గతంలో ఇచ్చిన 84 వేల తెరలు మినహా ఇప్పటికీ పంపిణీ లేకుండా పోయింది. మూడేళ్లుగా జిల్లా అధికారులు లక్షా 65 వేల దోమతెరలు కావాలంటూ ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రతిపాదనలు బుట్టదాఖలే అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వియాత్నం నుంచి పది లక్షల దోమతెరలు తెప్పించి పంపిణీకీ శ్రీకారం చుట్టినా ఆదిలాబాద్ జిల్లాను విస్మరించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఖమ్మం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు పంపిణీ చేసింది. -
వలస బాట.. ఉపాధి వేట..
ఉట్నూర్/బెజ్జూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఏటా కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది కూడా వందల గ్రామాల నుంచి వేలాది మంది కూలీలు వలస వెళ్లారు. ఎప్పుడు మార్చి, డిసెంబర్ నెలల్లో వలసలు మొదలయ్యేవి. ఈ ఏడాది ముందుగానే ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని రైతులు, కూలీలు పయనం అవుతున్నారు. ఈసారి జిల్లాలో, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. పంటలు కుళ్లిపోయి రెండు, మూడు సార్లు విత్తనాలు విత్తిన సరైనా దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్తున్నారు. పదెకరాల రైతులు కూడా కూలీలుగా మారుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చూపించలేదు. ఇటు వ్యవసాయం గిట్టుబాటక, అటు పని దొరుకక పొట్టచేత పట్టుకుని పిల్లా పాపలతో పల్లె జనం వలస బాట పడుతున్నారు. పొరుగు ప్రాంతాలకు పయనం తాజాగా బెజ్జూర్ మండలం ఇందిర్గాం, ఎల్కపల్లి, చిన్నసిద్ధాపూర్, నాగుల్వాయి, రేచిని, ఇప్పలగూడ, నాగపెల్లి గ్రామాలకు చెందిన కూలీలు వలసబాట పట్టారు. వీరితోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఉరిలో ఉపాధి కరువై ఏటా ముంబై, చంద్రాపూర్, కీన్వర్ట్, మెవాడ్, నాందేడ్, బల్లార్షా, యావత్మాల్, మధ్యప్రదేశ్‌లతోపాటు రాష్ట్రంలోని ఖమ్మం, గుంటూర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. వీరు వ్యవసాయ, పౌల్ట్రీ పరిశ్రలు, భవన నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ గుడిసెలు వేసుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అరిగోస పడుతున్నారు. వలస వెళ్లే గ్రామాలు ఇవే.. జిల్లా వ్యాప్తంగా ఏటా వందల గ్రామాల నుంచి కూలీలు వలస పోతున్నారు. వేమనపల్లి మండలంలో రాజారం, సుంపుటం, కల్లెంపల్లి, రాచర్ల, కెరమెరి మండలంలో ఆగర్‌వాడ, ఇంద్రానగర్, సుర్ధాపూర్, కైరి, నీంగూడ రింగన్ఘట్, బెజ్జూర్ మండలం నుంచి నాగుల్వాయి, సిద్ధాపూర్, జిల్లె డ, సోమిని, రంగపల్లి, బోరుగూడ, ఎల్కపల్లి, నాగపల్లి, ఏటిగూడ, కోయపల్లి, తిక్కపల్లి, నం దిగాం, తుకుడ, అంబగట్టు, పాపన్పెట్, కలా యి, కుంతలమానపల్లి, సులుగుపల్లి, మర్పిడి, శివపల్లి, ఎల్లూర్, ఉట్నూర్ మండలంలో వడో ని, కోలాంగూడ, ఇంద్రవెల్లి మండలంలో రాం పూర్, గోపాల్పూర్, ధర్మసాగర్, పాటగూడ, అందుగూడ, భుర్శన్పటార్, మర్కగూడ, కుభీ ర్ మండలంలో రంగశివుని, కౌటాల, సిర్పుర్ (టి) తదితర మండలాల నుంచి వేలాది మంది పిల్లపాలతో బతుకుదెరువు కోసం వలసలు పో తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధు లు, అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా వీరు స్పందించి వలసలను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.