ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసే ఇద్దరి అధికారుల మధ్య ముదిరిన విభేదాలు ఐటీడీఏను అస్తవ్యస్తంగా మార్చాయి. ఐటీడీఏ పీవో జనార్దన్‌కు, డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదట నుంచి మనస్పర్థాలు ఉన్నాయని ప్రచారం ఉంది. రషీద్‌ను పీవో మూడు రోజుల క్రితం సస్పెండ్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. పీవో చర్యలను నిరసిస్తూ ఐటీడీఏ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది లేక వెలవెల బోతోంది. పనుల నిమిత్తం వచ్చే గిరిజనులు, ఇతరులు వెనుదిరిగి పోతున్నారు. సమస్యలు పరిష్కరించకుం టే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న తొమ్మిది ఐటీడీఏలలో ఆందోళన నిర్వహిస్తామని ట్రైబల్ వెల్ఫెర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గోపాల్, కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. పరిస్థితి చేయిజారక ముందే ఉన్నతాధికారులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
సఖ్యత లేదని ప్రచారం..
ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్‌కు డీడీటీడబ్ల్యూ రషీద్‌కు మొదటి నుంచే సఖ్యత లేదనే ప్రచారం ఐటీడీఏలో ఉంది. ఈ క్రమంలో పీవో నివాస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముక్కుసూటిగా వ్యవహరించడం, ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. దాదాపు 30 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్, వంద మందికిపైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రషీద్‌కు పీవోకు పడక పోవడంతో జూలై 31న అనారోగ్యం కారణం చూపుతూ రషీద్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారని ప్రచారం ఉంది. రషీద్ స్థానంలో అప్పటి ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు అదనపు బాధ్యతలు చేపట్టారు. అయన పదవీ విరమణతో ఏవో భీమ్ డీడీటీడబ్ల్యూగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ చివరి వారంలో గిరిజన సంక్షేమశాఖలో సుపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణరెడ్డిని ఆశ్రమాలకు సరుకులు సకాలంలో సరఫరా చేయడం లేదని అక్టోబర్ 31న సస్పెండ్ చేశారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో తెలియక ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
డీడీ విధుల్లో చేరడంతో..
అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన డీడీటీడబ్ల్యూ రషీద్ కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. వేతన చెల్లింపులో సాంకేతికలోపం ఏర్పడటంతో అయనను ప్రభుత్వం తిరిగి యథాస్థానికి పంపించింది. గత నెల 28న రషీద్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 5న విధుల్లో చేరారు. అప్పటికే డీటీఏఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు గిరిజన సంక్షేమశాఖలో విధులు నిర్వహిస్తూ సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 9 నుంచి ఐటీడీఏ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐటీడీఏ పీవో అనారోగ్యం కారణంగా సెలవు పెట్టడంతో 13 నుంచి 16వ తేదీ వరకు రషీద్ ఇన్‌చార్జి పీవోగా వ్యవహరించారు. ఈ సమయంలో 15న డీటీఏఫ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలోనే జీవో ఎంఎస్ నంబర్ 274 ప్రకారం రషీద్‌ను పీవో సస్పెండ్ చేశారు. డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేకున్నా జీవో నంబర్ 274ను ఆధారంగా చూపుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
ఉద్యోగులంత ఏకమై ఆందోళన
ఐటీడీఏ పీవో తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఏకమయ్యారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడం, నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకుండా విచారణ పేరిట కాలయాపన చేయడంపై ఆందోళన బాట పట్టారు. డీడీటీడబ్ల్యూ, గజిటెడ్, నాన్‌గజిటెడ్, ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నుంచి ఐటీడీఏ ఎదుట అందోళన నిర్వహిస్తున్నారు. పీవో కిందిస్థాయి ఉద్యోగులతో పనులు చేయిస్తూ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలి కాని ఇలా చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. పీవో వైఖరి మార్చుకోకపోతే న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది. గిరిజనుల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది.
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్‌తో ఆందోళనలు ఉధృతం
Published Sat, Dec 21 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM